బీఆర్ఎస్‌కు మైలేజీ వస్తుందనుకుంటే.. అదే మైనస్ అయ్యిందా?

by S Gopi |   ( Updated:2023-03-23 02:29:23.0  )
బీఆర్ఎస్‌కు మైలేజీ వస్తుందనుకుంటే.. అదే మైనస్ అయ్యిందా?
X

దిశ, కరీంనగర్​బ్యూరో: బీఆర్ఎస్​పార్టీకి డబుల్​బెడ్​రూం ట్రబుల్​పట్టుకుంది. డబుల్​బెడ్​రూం ఇళ్ల నిర్మాణంతో పార్టీకి మైలేజీ వస్తుందని భావిస్తే ఇప్పుడు అదే మైనస్​అయింది. నిర్మాణం పూర్తి అయిన డబుల్ బెడ్ రూం ఇళ్లను పేదలకు అందించాలని నిర్ణయించిన ప్రభుత్వం ఇటీవల అర్హులైనవారు దరఖాస్తు చేసుకోవాలని సూచించడంతో పెద్ద ఎత్తున దరఖాస్తులు వచ్చాయి. దరఖాస్తులను పరిశీలించిన ఆఫీసర్లు అర్హులను గుర్తించి డ్రా పద్ధతిలో ఇళ్లను కేటాయించారు. కట్టిన ఇళ్లు తక్కువగా ఉండటం.. దరఖాస్తులు దండిగా రావడం, అర్హులు ఎక్కువగా ఉండటం వ్యతిరేకతకు కారణమైంది. రాష్ర్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న డబుల్​ బెడ్​రూం ఇళ్లు ఎన్నికల సమయంలో ప్రభుత్వంపై వ్యతిరేకతకు కారణం అవుతుంది.


పెద్దపల్లి జిల్లాలో 3,394 డబుల్​బెడ్ రూం ఇళ్లు నిర్మాణానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఇందులో 960 ఇళ్ల నిర్మాణం పూర్తి కాగా 1,012 ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభం కాగా 1,327 ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభం కాలేదు. పెద్దపల్లి నియోజకవర్గంలోని పెద్దపల్లి మండలం రాంపల్లి, చందపల్లి ఇళ్ల నిర్మాణం చేపట్టారు. ఇందులో160 ఇళ్ల నిర్మాణం పూర్తి కాగా 340 ఇళ్లు నిర్మాణంలో ఉన్నాయి. కాల్వశ్రీరాంపూర్ మండలంలో 240 ఇళ్లకు గాను 50 పూర్తి కాగా మిగిలినవి చివరి దశకు చేరుకున్నాయి. ఓదెల మండలంలో 48 ఇళ్ల నిర్మాణం పూర్తి కాగా సుల్తానాబాద్​మండలంలో 80 ఇళ్ల నిర్మాణాలు నిలిచిపోయాయి. రామగుండం నియోజకవర్గంలో మల్కాపూర్​శివారులో 600 ఇళ్ల నిర్మాణం పూర్తి చేశారు. గోదావరిఖనిలో 160 ఇళ్లు అసంపూర్తిగా ఉండగా అంతర్గాం మండలంలో 240 ఇళ్ల నిర్మాణానికి గాను 60 ఇళ్ల నిర్మాణం పూర్తయింది. కాగా పాలకుర్తి మండలం పూట్నుర్​గ్రామంలో10 ఇళ్ల నిర్మాణం చేపట్టారు. మంథని నియోజకవర్గంలోని మంథనిలో 94 మంది ఇళ్లు నిర్మించగా కూచిరాజ్​పల్లి గ్రామంలో 62 ఇళ్ల నిర్మాణం మధ్యలోనే నిలిచిపోయాయి.

దరఖాస్తులు దండిగా...

శాసనసభ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో పేద ప్రజల ఓట్లే లక్ష్యంగా ప్రభుత్వం మరోమారు డబుల్ వల విసిరే పని చేసింది. డబుల్​బెడ్ రూం ఇళ్లు పంపిణీ చేస్తాం అర్హులైనవారు దరఖాస్తులు చేసుకోవాలని ప్రకటించింది. ప్రభుత్వ ప్రకటనతో నిరుపేదలు మీసేవ కేంద్రాల్లో పెద్ద ఎత్తున దరఖాస్తు చేసుకున్నారు. ఫిబ్రవరి 7వ తేదీ నుంచి ఫిబ్రవరి 20 వరకు మీసేవ కేంద్రాల ద్వారా దరఖాస్తులు స్వీకరించారు. పెద్దపల్లి పట్టణంలో డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణం కోసం 2,079 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో 1,029 మందిని అర్హులుగా గుర్తించారు. 487 మందికి డ్రా పద్ధతిలో ఇళ్లు కేటాయించారు. ఓదెల మండల కేంద్రంలో 48 ఇళ్ల నిర్మాణం పూర్తి కాగా మండలంలోని వివిధ గ్రామాల నుంచి 3500 వరకు దరఖాస్తులు వచ్చాయి. ఇందులో 170మందిని అర్హులుగా గుర్తించారు. కాల్వశ్రీరాంపూర్​మండలంలో డబుల్​ బెడ్​రూం ఇళ్ల నిర్మాణం కోసం 1,604 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇక్కడ లబ్ధిదారుల గుర్తింపు పూర్తి కాలేదు. రామగుండం నియోజకవర్గంలోని గోదావరిఖనిలో డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణం కోసం 7872 దరఖాస్తులు రాగా, ఇందులో 2468 మందిని అర్హులుగా గుర్తించి ఈనెల 16వ తేదినా డ్రా పద్ధతిలో 600 ఇళ్లు కేటాయించారు.

నిరసన వెల్లువ...

డబుల్​బెడ్​రూం ఇళ్ల నిర్మాణం ఇప్పుడు అధికార పార్టీకి ఇబ్బందికరంగా మారింది. పెద్దపల్లిలో నిర్మించిన ఇళ్ల స్థలంలో గతంలో 400 మందికి పైగా పట్టాలను అందజేశారు. పట్టాలు రద్దు చేసిన అధికారులు ఇక్కడ డబుల్​బెడ్​రూం ఇళ్ల నిర్మాణం చేశారు. గతంలో పట్టాలు పొందినవారిని కాకుండా ఇప్పుడు డ్రా పద్ధతిలో ఎంపిక చేయడంపై నిరసన వ్యక్తం అవుతుంది. రామగుండం నియోజకవర్గంలో గతంలో 160 లబ్ధిదారులను గుర్తించినవారికి ఇళ్లు కేటాయించకుండా ఇప్పుడు దరఖాస్తు చేసుకున్నవారిని అర్హులుగా గుర్తించి డ్రా పద్దతిలో ఇళ్లు కేటాయించడం పేదల ఆగ్రహానికి కారణం అవుతుంది. రెండు నియోజకవర్గాల్లో కాంగ్రెస్​పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహించి అర్హులైనవారి అందరికి ఇళ్లు కేటాయించాలని డిమాండ్​ చేస్తున్నారు. ఎన్నికల ముందు డబుల్​ట్రబుల్​నుంచి అధికార పార్టీ ఎలా బయటపడుతుందో వేచి చూడాలి.

Also Read: బిగ్ న్యూస్: యూత్‌కు దగ్గరయ్యేందుకు రూట్ మార్చిన పొలిటిషియన్స్.. అన్ని పార్టీలదీ ఇదే ఫార్ములా!

Advertisement

Next Story

Most Viewed