సమయపాలన పాటించని ఉపాధ్యాయులు

by Disha Web Desk 23 |
సమయపాలన పాటించని ఉపాధ్యాయులు
X

దిశ, గన్నేరువరం: ప్రభుత్వ కొలువును నిర్వహిస్తూ గౌరవప్రదమైన ఉపాధ్యాయ వృత్తిలో ఉండి విద్యార్థులకు విద్యా బుద్ధులు నేర్పాల్సిన ప్రభుత్వ ఉపాధ్యాయులు సమయపాలన పాటించడం లేదు. సరైన విధంగా విధులు నిర్వహించకపోవడం తో విద్యార్థులు చదువుకు దూరం అవుతున్నారని తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంపై డీఈఓ కు ఫిర్యాదు చేశారు.ఈ సంఘటన మండలంలోని హనుమాజి పల్లి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో గురువారం చోటుచేసుకుంది. విద్యార్థులు తల్లిదండ్రులు తెలిపిన వివరాల ప్రకారం ఈ పాఠశాలలో ఉపాధ్యాయులు ఏ ఒక్కరు కూడా సమయానికి పాఠశాలకు రావడం లేదని, గతంలో ఎంఈఓ కు, జంగాపల్లి ప్రధానోపాధ్యాయునికి ఫిర్యాదు చేసినప్పటికీ ఉపాధ్యాయులలో ఏమాత్రం బాధ్యత గుర్తు రాలేదని, విధులను అదేవిధంగా నిర్లక్ష్యం చేయడంతో డీఈఓ కు ఫిర్యాదు చేసినట్లు వారు తెలిపారు. ఉపాధ్యాయులు ఆలస్యంగా రావడంతో విద్యార్థులు పాఠశాలలో ఇష్టం వచ్చినట్లు ఆటలు ఆడుతూ, పోట్లాడుకుంటూ గాయాల పాలవుతున్నారని ఏ ఒక్కరు కూడా చదువు పైన శ్రద్ధ లేకుండా పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. డిఇఓ వెంటనే ఉపాధ్యాయులపై క్రమశిక్షణ చర్యలు చేపట్టి పాఠశాలకు అవసరమైతే కొత్త సిబ్బందిని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.

తక్షణం స్పందించిన డీఇఓ సీహెచ్ వి జనార్దన్ రావు....

పాఠశాలకు ఉపాధ్యాయులు సమయానికి రావడం లేదని సమాచారం అందుకున్న డీఈవో సిహెచ్ జనార్దన్ రావు తక్షణమే స్పందించి హనుమాజి పల్లి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను తనిఖీ నిర్వహించారు. తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదును స్వీకరించి ఉపాధ్యాయుల పై క్రమశిక్షణ చర్యలు చేపడతానని తల్లిదండ్రులకు భరోసా కల్పించారు. ఈ సందర్భంగా తల్లిదండ్రులు విద్యార్థులకు చక్కని చదువులు చెప్పే ఉపాధ్యాయులను పాఠశాలకు కేటాయించాలని వేడుకున్నారు.


Next Story

Most Viewed