నాణ్యతలేని చిరుతిళ్లు.. ప్యాకెట్ తినుబండరాలతో పొంచి ఉన్న ముప్పు

by Prasanna |
నాణ్యతలేని చిరుతిళ్లు.. ప్యాకెట్ తినుబండరాలతో పొంచి ఉన్న ముప్పు
X

దిశ, హుజూరాబాద్ రూరల్ : సర్వం కల్తీమయమే. ప్రతి వస్తువునూ కల్తీ చేస్తున్నరు కొందరు అక్రమార్కులు. నిత్యావసర సరుకులే కాదు.. నిజమైన కంపెనీలను తలదన్నేలా అదే పేరుపై డూప్లికేట్లను రూపొందిస్తున్నారు. ఈ నేపథ్యంలో చిరుతిళ్లు పూర్తిస్థాయిలో కల్తీ అవుతున్నాయి. చిన్నారులనే లక్ష్యంగా చేసుకుని, ఆకర్షించే రంగులతో రకరకాల ప్యాకెట్లలో స్నాక్స్ తయారు చేసి షాపులకు సరఫరా చేసి విక్రయిస్తున్నారు. చిన్నారులు వాటి వైపు ఆకర్షితులై అనారోగ్యం కొనితెచ్చుకుంటున్నారు. ఎటు చూసినా అవే హుజూరాబాద్ నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో పదుల సంఖ్యలో దుకాణాల్లో ఎక్కడా చూసినా నాణ్యత లేని ఆహార పదార్థాల ప్యాకెట్లు దర్శనమిస్తున్నాయి. వ్యాపారుల జిమ్మిక్కులతో పిల్లలను ఆకట్టుకునే కార్టూన్లు, రంగుల ప్యాకింగుల్లో చిరుతిళ్లు ఆకట్టుకుంటున్నాయి. వీటిని చూడగానే కొనివ్వాలంటూ చిన్నారులు మారాం చేస్తున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో తల్లిదండ్రులు వాటిని కొనివ్వక తప్పని పరిస్థితులు ఏర్పడుతున్నాయి. చివరకు అవి చిన్నారుల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతాయనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. వీటివల్ల భవిష్యత్తులో ఆరోగ్యానికి పెను ముప్పు తప్పదని, క్యాన్సర్ కారక వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

విచ్చలవిడిగా తయారీ..

హుజూరాబాద్ పట్టణంలోని శివారు ప్రాంతాల్లో ఇళ్లను అద్దెకు తీసుకొని నకిలీ చిరుతిళ్లను కొందరు వ్యాపారులు తయారు చేస్తున్నారు. తమిళనాడు, ఆంధ్రా ప్రాంతానికి చెందిన కొందరు ఈ ప్రాంతంలో నివాసం ఏర్పరచుకుని వీటిని తయారు చేస్తున్నట్లు తెలిసింది. అలాగే మరికొందరు వ్యాపారులు వరంగల్ జిల్లాలో తయారుచేస్తున్న చిరుతిళ్లను ఈ ప్రాంతంలో విక్రయిస్తున్నారు. ధనార్జనే ధ్యేయంగా నకిలీ చిరుతిళ్లను విచ్చలవిడిగా మార్కెట్లోకి వదులుతున్నారు. స్నాక్స్ ప్యాకెట్లుగా వాటిని చలామణి చేస్తున్నారు. వాటిపై తయారయ్యే ప్రాంతం చిరునామా, ఎంఎఫ్ కూడా ఉండక పోవడం గమనార్హం.

పరిస్థితి ఇదీ..

నియోజకవర్గంలో దాదాపు వందల కిరాణా, జనరల్ స్టోర్, టేలాలు ఉన్నాయి. వీటిల్లో చిన్నారులు తినే వివిధ రకాల చిరుతిళ్లను అధికంగా అమ్మకాలు చేస్తున్నారు. పాఠశాలల పరిధిలోనే అధికంగా చిరుతిళ్ల దుకాణాలు వెలిశాయి. దీంతో విద్యార్థులు ఆయా దుకాణాల వద్ద చిరుతిళ్ల ప్యాకెట్లను, వివిధ రకాల తీపి, కారం తినుబండరాలు అధికంగా విక్రయిస్తున్నారు. మరికొన్ని పేర్లు కూడా అర్ధంకాని రీతిలో ఉంటాయి. మరికొన్ని అయితే ప్రముఖ కంపెనీల పేరును పోలీ మార్కెట్లోకి వస్తున్నాయి. చూడగానే తినాలనిపించే రకంగా వాటిని తయారు చేస్తున్నారు. విచ్చలవిడిగా దుకాణాల్లో వీటిని అమ్ముతున్నారు. వాటికి సంబంధించి మండలాల్లోని ప్రతి గ్రామంలో రోజూ భారీఎత్తున వ్యాపారం జరుగుతోంది. అయితే, సంబంధిత అధికారులు వాటిపై తనిఖీలు చేయనందునే నాణ్యత లేని, తిను బండరాలు మార్కెట్లోకి వస్తున్నాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

నాసిరకంతో అనారోగ్యం..

నాసిరకం తినుబండరాలు ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతాయి. ఎక్కువ కాలం నిల్వ ఉండాలనే ఉద్దేశంతో తినుబండరాల్లో వివిధ హానికర కెమికల్స్ వాడుతున్నారు. రుచి కోసం ఎక్కువ మోతాదులో మసాలాలు, ఆకర్షణీయమైన రంగుల కోసం ప్రమాదకర పౌడర్లు కూడా వినియోగిస్తున్నారు. వీటిని తింటే భవిష్యత్తులో ఆరోగ్య సమస్యలు తప్పవు. ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి.

- డాక్టర్ మధు, వైద్యాధికారి, చేల్పూర్

చిరుతిళ్లకు దూరంగా ఉంచాలి

పిల్లలకు ప్రమాదకరమైన చిరుతిళ్లను ఇళ్లు, పాఠశాలల్లో నివారించాలి. సహజ సిద్ధమైన పోషక విలువలతో కూడిన ఆహార పదార్థాలను పిల్లలకు ఇవ్వాలి. రెడీమెడ్ వాటి జోలికి వెళ్లకుండా పిల్లలను ఉంచడం ఉత్తమం. పిల్లలు మారాం చేసినా వారి ఆరోగ్యంపై తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలి. చిరుతిళ్లకు చిన్నారులను దూరంగా ఉంచాలి.

- సుగుణ, సీడీపీఓ, హుజూరాబాద్

Next Story

Most Viewed