హుజురాబాద్‌లో భారీగా పోలీసుల మోహరింపు.. స్థానికంగా ఉద్రిక్తత..

by Aamani |   ( Updated:2024-09-12 15:11:14.0  )
హుజురాబాద్‌లో భారీగా పోలీసుల మోహరింపు.. స్థానికంగా ఉద్రిక్తత..
X

దిశ, హుజురాబాద్ రూరల్: ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి ,అరికెపూడి గాంధీల మధ్య వివాదం చిలికి చిలికి గాలివానగా మారింది. ఈ నేపథ్యంలో హుజురాబాద్ లో బిఆర్ఎస్, కాంగ్రెస్ వర్గాల మధ్య ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా హుజురాబాద్ ఏసీపీ శ్రీనివాస్ జి ఆధ్వర్యంలో పోలీసులు ముందస్తుగా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.స్థానిక అంబేద్కర్ చౌరస్తాలో మోహరించిన పోలీసులు స్థానిక నాయకులపై నిఘా పేట్టారు. గురువారం హైదరాబాదులో హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఇంటి మీదకు ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ తో పాటు అతని అనుచరులు వెళ్లి గుడ్లు, టమాటలతో దాడి చేశారు. దీనికి కౌశిక్ రెడ్డి అనుచరులు సైతం దాడులకు దిగడంతో ఇరువర్గాలను అక్కడి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి నియోజకవర్గంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల ద్వితీయ శ్రేణి నాయకుల మధ్య ఏదైనా గొడవలు తలెత్తే అవకాశం ఉందని ముందస్తుగా పోలీసులు మోహరించారు.

పాడి కౌశిక్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో ఇటీవల చేరిన ఎమ్మెల్యేలపై హైకోర్టులో కేసు వేయడం కోర్టు తీర్పు రావడంతో కాంగ్రెస్ ,బీఆర్ఎస్ వర్గాలు పరస్పర ఆరోపణలు చేసుకున్నారు. దీంతో ఏకంగా అరికెపూడి గాంధీ తన అనుచరులతో పాడి కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్లడం వివాదాస్పదమైంది. నియోజకవర్గ స్థాయిలో కాంగ్రెస్,బీఆర్ఎస్ కు చెందిన రాష్ట్ర నాయకులు పోటాపోటీగా పత్రిక ప్రకటనలు జారీ చేశారు. కౌశిక్ రెడ్డి పార్టీ మారిన ఎమ్మెల్యేల ఉద్దేశించి చీరలు ,గాజులు పంపిస్తాను అనడంతో కాంగ్రెస్ పార్టీకి చెందిన రాష్ట్ర మహిళా నాయకురాలు చెప్పు చూపెట్టి కౌశిక్ రెడ్డి పై బూతు పురాణం చేశారు. దీనికి కౌంటర్ గా హుజరాబాద్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ నాయకులు, కాంగ్రెస్ మహిళా నాయకురాళ్లు విలేకరుల సమావేశాలు ఏర్పాటు చేసి ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్నారు.

స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ మహిళా నాయకురాళ్లు కౌశిక్ రెడ్డి ఫ్లెక్సీకి చీరలు, గాజులు, పూలతో వాయినమిచ్చారు .ఈ నేపథ్యంలో పాడి కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడి రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశం కావడంతో ఆయన సొంత నియోజకవర్గమైన హుజురాబాద్ లో గొడవలు జరిగే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇరువర్గాల ఆరోపణలు ప్రతి ఆరోపనలతో హుజురాబాద్ లో సైతం కాంగ్రెస్ ,బీఆర్ఎస్ పార్టీ నాయకుల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. ఇరువర్గాల గొడవ ఎక్కడికి దారి తీస్తుందో వేచి చూడాల్సిందే.

Advertisement

Next Story

Most Viewed