అధికారంలోకి రాగానే 'ధరణి పోర్టల్' రద్దు : ఎమ్మెల్యే శ్రీధర్ బాబు

by Vinod kumar |   ( Updated:2022-11-24 11:34:50.0  )
అధికారంలోకి రాగానే ధరణి పోర్టల్ రద్దు : ఎమ్మెల్యే శ్రీధర్ బాబు
X

దిశ, రామగిరి: కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ధరణి పోర్టల్‌ను పూర్తిగా రద్దు చేసి ప్రజలకు ఉపయోగపడే రెవెన్యూ చట్టాలను తీసుకువస్తామని మంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు అన్నారు. గురువారం టీపీసీసీ పిలుపు మేరకు భూ సమస్యలను పరిష్కరించాలని మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఎమ్మార్వో కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం శ్రీధర్ బాబు రామగిరి ఎమ్మార్వో కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అసైన్డ్, పోడు భూముల సమస్యలను పరిష్కరించాలని, నిషేధిత జాబితాలో ఉన్న 24 లక్షల ఎకరాల అసైన్డ్ భూములను తొలగించి ధరణిలో పొందుపర్చాలని డిమాండ్ చేశారు. అధికారంలోకి వచ్చాక రెవెన్యూ చట్టాన్ని సవరింప చేసి ప్రతి ఒక్కరికీ న్యాయం చేస్తానని చెప్పిన కేసీఆర్ ఎందుకు పరిష్కరించట్లేదో ప్రజలకు చెప్పాలని ప్రశ్నించారు.

ధరణి లోని లోపాలను అడ్డుపెట్టుకుని కొందరు టీఆర్ఎస్ నాయకులు అవినీతికి పాల్పడుతున్నారని వెల్లడించారు. రుణమాఫీ చేస్తానని చేయకపోవడంతో వడ్డీలు కట్టలేక రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, తక్షణమే రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కౌలు రైతుల కోసం 2016లో జీవో420 తెచ్చిందని, అయితే టీఆర్ఎస్ ప్రభుత్వం దాన్ని నీరుగార్చిందని పేర్కొన్నారు.

ప్రతి ఎస్సీ కుటుంబానికి దళిత బంధు అందజేయాలని, అంతేకాకుండా ఎస్టీ బీసీ మైనార్టీలకు కూడా బంధును ప్రకటించాలన్నారు. కొందరు వ్యక్తిగతంగా విమర్శలకు దిగుతున్నారని, అవి మానేసి ప్రజా సమస్యల పరిష్కారం కోసం దృష్టి సారించాలన్నారు. సోషల్ మీడియాలో పోస్టులపై రియాక్ట్ కావద్దని, మనమేంటో ప్రజలకు తెలసన్నారు. ఈ కార్యక్రమంలో మంథని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు తొట్ల తిరుపతి, రామగిరి మండల అధ్యక్షుడు తోట చంద్రయ్య, నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు బర్ల శ్రీనివాస్, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed