విద్యార్థులకు జిల్లా ఎస్పీ అఖిల్ మహజన్ కీలక సూచన

by Aamani |
విద్యార్థులకు జిల్లా ఎస్పీ అఖిల్ మహజన్  కీలక సూచన
X

దిశ,వేములవాడ : ర్యాగింగ్ చేయడం నేరమని, ఎవరైనా ర్యాగింగ్‌ చేసినట్లయితే అలాంటి వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ అఖిల్ మహజన్ హెచ్చరించారు. గురువారం వేములవాడ పట్టణ పరిధిలోని ఓ ఫంక్షన్ హాల్ లో మహిళల రక్షణ, ఈవ్ టీజింగ్,ర్యాగింగ్, గంజాయి, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలపై పాలిటెక్నిక్, డిగ్రీ, జే.ఎన్.టీ.యూ కళాశాల విద్యార్థిని, విద్యార్థులకు ఏర్పాటు చేసిన అవగాహన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ విద్యా సంవత్సరం ప్రారంభమైందని, అన్ని విద్యాసంస్థల్లో యాంటీ ర్యాగింగ్ కమిటీలు ఏర్పాటు చేసి ర్యాగింగ్ మొదటి దశలోనే కట్టడి చేయాలని, కళాశాల యాజమాన్యాలు విద్యార్థుల అలవాట్లను, నడవడికను ఎప్పటికప్పుడు గమనించాలని సూచించారు.

విద్యార్థులు ర్యాగింగ్ చేస్తే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని,తోటి విద్యార్థులతో అసభ్యంగా ప్రవర్తించడం, వారిని ఇబ్బందులకు గురి చేయడం మంచి విద్యార్ధి లక్షణం కాదని అన్నారు. సీనియర్స్, జూనియర్స్ అనే తేడా లేకుండా విద్యార్థులందరూ స్నేహపూర్వకంగా కలిసి మెలిసి విద్యనభ్యసించి ఉన్నత లక్ష్యాలు చేరుకోవాలని సూచించారు. ర్యాగింగ్ కు పాల్పడే వారి వివరాలను డయల్ 100 కు తెలియజేసి సమాచారం అందించాలన్నారు. వేధింపులకు గురైన మహిళలు షీ టీం ను సంప్రదించాలని సూచించారు. ఈ సమావేశంలో ఏ.ఎస్పీ శేషాద్రిని రెడ్డి,సి.ఐ వీరప్రసాద్, ఎస్సైలు రమేష్, అంజయ్య, డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ శంకర్, జే.ఎన్.టీ. యూ కళాశాల ప్రిన్సిపాల్ వేణుగోపాల్, పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ చారి, షీ టీమ్ సిబ్బంది, భరోసా సెంటర్ సిబ్బందితో పాటు భారీ సంఖ్యలో విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed