కారు కడిగింది విద్యార్థి కాదంట.. ప్రైవేటు డ్రైవరేనట?

by samatah |
కారు కడిగింది విద్యార్థి కాదంట.. ప్రైవేటు డ్రైవరేనట?
X

దిశ, జగిత్యాల ప్రతినిధి : గురుకులంలో విద్యార్థులతో సాగుతున్న వెట్టి పనులపై విచారణాధికారిని తప్పుదోవ పట్టించినట్టుగా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. 'విద్యార్థులతో వెట్టి చాకిరీ' అనే కథనాన్ని దిశ ప్రచురించగా స్పందించిన అధికారులు విచారణ జరిపినట్టు తెలిసింది. అయితే విచారణకు వచ్చిన అధికారులకు ఇచ్చిన వాంగ్మూలం వారిని తప్పుదోవ పట్టించే విధంగా ఉందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కారు కడిగింది విద్యార్థి కాదని తన ప్రైవేటు డ్రైవర్ అని విచారణాధికారులకు చెప్పినట్టు సమాచారం. వాస్తవంగా సదరు కారు నడిపేందుకు ప్రైవేటు డ్రైవరే లేడని సెల్ఫ్ డ్రైవింగ్ లోనే నిత్యం పాఠశాలకు వస్తుంటాడని స్కూల్ లో పనిచేస్తున్న కొందరు అంటున్నారు. అలాంటప్పుడు కారు కడిగేందుకు ప్రత్యేకంగా డ్రైవర్ ఎలా వచ్చాడన్న ప్రశ్నకు సమాధానం లేకుండా పోతోంది. నిజాలు వెలుగులోకి రాకుండా ఉండేందుకే డ్రైవర్ కథను తెరపైకి తీసుకొచ్చారన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఒకవేళ డ్రైవరే ఉన్నట్టయితే కారును ఇంటివద్ద క్లీన్ చేయించుకోకుండా, సర్వీసింగ్ సెంటర్ కు పంపించకుండా గురుకులంలో ఎందుకు కడిగించుకోవాల్సి వచ్చిందన్న ప్రశ్న కూడా తలెత్తుతోంది. సాధారణంగా కారు యజమానులు ఇంటి నుంచి బయలుదేరేప్పుడు కారును శుభ్రం చేసుకుంటారు కానీ ప్రత్యేకంగా డ్రైవర్ ఉన్నప్పుడు గురుకులం వరకు వచ్చిన తరువాత క్లీన్ చేయించుకోవడం వెనక ఆంతర్యం ఏంటన్నది అంతు చిక్కడం లేదు. నిజంగానే తన డ్రైవర్ తో కారు కడిగించుకున్నట్టయితే పాఠశాలకు సంబంధించిన నీటిని వినియోగించుకోవం సరికాదని, అలాగే స్కూల్ ఆవరణ అంతా కూడా జలమయం అవుతుందన్న విషయాన్ని ఎందుకు విస్మరించారో అర్థం కావడం లేదు.

మైనరా..?

గురుకులంలో జరిగిన ఈ తతంగంపై విచారణ చేపట్టిన అధికారులకు ఇచ్చిన స్టేట్ మెంట్ కు వాస్తవానికి పొంతనలేదన్న వాదనలే ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఒక వేళ బయటివారిని పిలిపించుకుని కారు శుభ్రం చేయించుకున్నా వీడియోలో కనిపిస్తున్న వారిని గమనిస్తే మైనర్ అయి ఉంటాడన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఓ వైపున ఆపరేషన్ స్మైల్ పేరుతో ప్రభుత్వం బాల కార్మికుల నిర్మూలన దిశగా చర్యలు చేపట్టి అనేక కార్యక్రమాలు చేస్తుంటే ఈ పాఠశాలలో మాత్రం అందుకు విరుద్ధంగా మైనర్లతో వెట్టి చాకిరీ చేయించుకుంటున్నారన్న ఆరోపణళు రావడం విస్మయం కల్గిస్తోంది. అయితే విచారణాధికారులు కూడా సదరు ఉపాధ్యాయుడు ఇచ్చిన వాంగ్మూలం ఆధారం చేసుకోకుండా పర్సనల్ గా విద్యార్థుల నుంచి వివరాలను రాబడితే అసలు నిజం బయటపడేదని అంటున్నారు స్థానికులు.

జగిత్యాలలో ఇదే తంతా..?

ఓ వైపు జిల్లాలోని గురుకులాల్లో జరుగుతున్న నిబంధనల ఉల్లంఘనపై విమర్శలు వెల్లువెత్తుతంటే సాక్షాత్తు జిల్లా కేంద్రంలో కూడా ఇలాంటి ఘటనే మరొకటి వెలుగులోకి రావడం విచిత్రం. జగిత్యాల జిల్లా కేంద్రంలోని బాలికల సోషల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాలలో అయితే ఏకంగా విద్యార్థులతో కుర్చీలు మోయించిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. అయితే పాఠశాలలో పనిచేస్తున్న మరొకరిని బాధ్యుల్ని చేస్తూ మెమో జారీ చేసినట్లు విశ్వసనీయ సమాచారం. స్టూడెంట్స్ తో కుర్చీలు మోయిస్తున్న ఫొటోల ఆధారంగా 'దిశ' సదరు పాఠశాల ప్రిన్సిపాల్ ను వివరణ కోరే ప్రయత్నం చేసిన తరువాత తూతూమంత్రంగా మెమో ఇచ్చి చేతులు దులుపుకున్నారన్న విమర్శలు వస్తున్నాయి. వివరణ కోరనట్టయితే ఈ మెమో ఇచ్చే పరిస్థితి కూడా లేకుండా పోయేదని గురుకుల పాఠశాల వర్గాలు అంటున్నాయి.

తప్పు చేస్తే కఠిన చర్యలు : ఆర్ సీ ఓ

కోరుట్ల బాలుర సోషల్ వెల్ఫేర్ పాఠశాల ఘటనపై ఆర్ సీ ఓ అనంతలక్ష్మిని అడగగా పాఠశాల కాంపౌండ్ లో అధ్యాపకుడి కారు కడిగింది నిజమే అని అన్నారు. అయితే కార్ వాష్ చేసింది విద్యార్థి కాదని కారు డ్రైవర్ అని తనకు వాంగ్మూలం ఇచ్చారన్నారు. అయితే స్కూల్ ఆవరణలో కారు క్లీన్ చేయించుకోవడం తప్పేనని కూడా లిఖిత పూర్వకంగా వివరణ ఇచ్చారన్నారు.

Advertisement

Next Story

Most Viewed