ప్రశ్నార్థకంగా వరి సాగు.. జిల్లాలో తీవ్ర వర్షాభావం

by Shiva |
ప్రశ్నార్థకంగా వరి సాగు.. జిల్లాలో తీవ్ర వర్షాభావం
X

దిశ, సైదాపూర్ : ఖరీఫ్ వరిసాగు ప్రశ్నార్థకంగా మారింది. రెండు నెలలుగా రైతులు ఆశించినంత వర్షపాతం నమోదు కాకపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.తేలికపాటి వర్షాలతో మొక్కజొన్న, పత్తి సాగుతోపాటు వరి సాగు చేసేందుకు రైతులు నార్లు పోశారు. వర్షాలు కురుస్తాయని రైతులు ఇంకా ఆశగా ఎదురు చూస్తున్నారు. మెట్ట ప్రాంతమైన సైదాపూర్ మండలంలోని చెరువులు, కుంటల్లో నీరు ఎండిపోయి భూగర్భ జలాలు అడుగంటి పోయాయి. దీంతో వ్యవసాయ బావులు, బోర్ల నీటిమట్టం గణనీయంగా తగ్గింది. రైతులు వరిసాగు చేసేందుకు పోసిన నార్లు ముదిరిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పట్టణ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలు గ్రామీణ ప్రాంతాల్లో కురవకపోవడంతో రైతులు తీవ్ర నిరాశ చెందుతున్నారు. రోహిణి, మృగశిర, ఆరుద్ర వంటి 3 కార్తెల్లో ఆశించిన వర్షాలు కురవ లేదు. దీంతో దిక్కు తోచని పరిస్థితుల్లో రైతులు కొట్టుమిట్టాడుతున్నారు.

కూలీలు ఉన్నా.. వర్షాలు లేవు!

వరి నాట్లు వేసేందుకు ఇతర రాష్ట్రాలైన బీహార్, మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్ తదితర ప్రాంతాలకు చెందిన వలస కూలీలను స్థానికులు తీసుకొచ్చారు. నీటి సౌకర్యం ఉన్న రైతులు వ్యవసాయ బావులు, బోర్ల వద్ద సుమారుగా వెయ్యి ఎకరాల్లో నాట్లు పూర్తయ్యాయి. ఆశించిన మేరకు వర్షాలు పడకపోవడంతో మిగిలిన ప్రాంతాల్లో సాగు పనులు సాగడం లేదు. దీంతో కూలీలకు తగినంత పని లేకుండా పోయింది. కాగా ప్రతి ఏడాది ఖరీఫ్‌లో మండలంలో సుమారుగా 18వేల ఎకరాల్లో వరి సాగు చేసేదని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. గత రెండు నెలలుగా మోస్తరు వర్షాలు కురవకపోవడంతో రైతుల పంటల సాగు చతికిలపడింది. దీంతో వరినాట్లు ఆలస్యం అవుతుండడంతో రైతులు లబోదిబోమంటున్నారు. జూలై నెల సగం గడిచిపోతున్నా కరీంనగర్ జిల్లాలో వరుణుడి జాడలేదు.

మూడు ఎకరాలకు నారు పోసిన: పర్శ శ్రీనివాస్ రైతు, లస్మన్నపల్లి

మూడు ఎకరాలు వరి నాటు వేసేందుకు నారు పోసిన. పొలం దున్నడానికి బావిలో సరిపడా నీళ్లు లేవు. నారు పోసి 30రోజులు దాటింది. మూడు కార్తెలు ముగిసినా భారీ వర్షం కురవలేదు. నెల లోపల నాటు వేస్తే మంచి దిగుబడి వస్తుంది. నారు ముదిరిపోయే పరిస్థితి ఏర్పడింది. ఇప్పటివరకు ఆశించిన వర్షపాతం నమోదు కాలేదు. ఎకరం పొలం దున్నితే నీళ్లు లేక దుక్కి ఎండిపోయింది.

ఆగస్టు వరకు నాట్లు వేసుకోవచ్చు: ఏఓ, వైదేహి, సైదాపూర్

ఆగస్టు 20వరకు వరి నాట్లు వేసుకోవచ్చు. దొడ్డు రకం 35రోజులు, సన్న రకం 45రోజుల వ్యవధిలో నాట్లు వేసుకునే అవకాశం ఉంది. దిగుబడిలో ఇబ్బందులు తలెత్తదు. సన్న రకం వరినాట్లు పాయలుగా వేసుకోవాలి. దీంతో గాలి తగిలి పైరు దోమపోటుకు గురి కాకుండా ఉంటుంది.

Advertisement

Next Story

Most Viewed