అన్ని వర్గాల ప్రజలను దగా చేసిన సీఎం కేసీఆర్: ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

by Shiva |
అన్ని వర్గాల ప్రజలను దగా చేసిన సీఎం కేసీఆర్: ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి
X

దిశ, జగిత్యాల ప్రతినిధి: ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా అన్ని వర్గాల ప్రజలను సీఎం కేసీఆర్ తన పాలనతో దగా చేస్తున్నాడని పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్ లో మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రం ఏర్పడిన తొలినాళ్లలో నిరుపేదలకు డబుల్ బెడ్ రూం ఇండ్లు ఇస్తామని హామీ ఇచ్చి నెరవేర్చలేదని రెండో పర్యాయం అధికారంలోకి వచ్చాక వాటి ఊసే లేకుండాపోయిందని అన్నారు.

ఇళ్ల నిర్మాణానికి బదులు సొంత స్థలంలో ఇళ్లు నిర్మించుకుంటే ఇచ్చే ఆర్థిక సాయం రూ.5లక్షల నుంచి రూ.3లక్షలకు తగ్గించారని ఆరోపించారు. గతంలో ఇచ్చిన నాలుగు లక్షల డబుల్ బెడ్ రూం ఇళ్ల హామీ ఏమైందంటూ ఎద్దేవా చేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా దళిత బంధు ఇస్తున్నామని దళితులను మోసం చేస్తోందని అన్నారు. ముందుగా ఎస్సీల అభివృద్ధి కోసం కేటాయించిన రూ.30 వేల కోట్లను ఖర్చు చేయాలని హితవు పలికారు.

మునుగోడు ఉప ఎన్నికల్లో గిరిజనులకు గిరిజన బంధు, పొడు భూములకు పట్టాలు, గిరిజనులకు రిజర్వేషన్లు, 80వేల ఉద్యోగాల భర్తీ చేస్తామని 17 వేల ఉద్యోగాల భర్తీ కి మాత్రమే నోటిఫికేషన్ ఇచ్చారని అన్నారు. పరీక్షా ప్రతాలను అంగట్లో అమ్మకానికి పెట్టారని ఆరోపించారు. జనాభాలో యాభై శాతం ఉన్న బలహీన వర్గాలకు స్వయం ఉపాధి పథకాలు అమలు చేయడం లేదన్నారు. చివరకు మహిళలకు ఇవ్వాల్సిన ఉచిత వడ్డీ నాలుగేళ్లుగా చెల్లించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇలా అన్ని వర్గాల ప్రజలను సీఎం తన పాలనతో దగా చేస్తున్నారని మండిపడ్డారు. ఆత్మీయ సమ్మేళనాల పేరుతో పార్టీలో నాయకులను, కార్యకర్తల అసంతృప్తిని తగ్గించగలరెమో కానీ, ప్రజల్లో అసంతృప్తిని ఏమాత్రం తగ్గించలేరని జీవన్ రెడ్డి అన్నారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ తెలుగు వారి ఆత్మగౌరవం అంటున్న కేటీఆర్.. షుగర్ ఫ్యాక్టరీలు ఇక్కడి ప్రజల ఆత్మ గౌరవం కదా అని ప్రశ్నించారు.

ఇకనైనా వాస్తవాలను గ్రహించి రాష్ట్ర ప్రయోజనాలను కాపాడేందుకు చిత్తశుద్ధితో పని చేయాలంటూ హితవు పలికారు. ఈ సమావేశంలో డీసీసీ అధ్యక్షుడు అడ్లూరి లక్ష్మణ్ కుమార్, పీసీసీ సభ్యులు గిరి నాగభూషణం, పీసీసీ ఆర్గనైజింగ్ సెక్రటరీ బండ శంకర్, జిల్లా కాంగ్రెస్ మహిళ అధ్యక్షురాలు తాటిపర్తి విజయలక్ష్మి దేవేందర్ రెడ్డి, నాయకులు కళ్లేపల్లి దుర్గయ్య, చాంద్ పాషా, రాజేష్, లైసెట్టీ విజయ్, అభిలాష, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed