కంటి వెలుగు పథకం ఓట్ల కోసం తెచ్చింది కాదు: CM KCR

by Mahesh |   ( Updated:2022-12-04 14:53:04.0  )
కంటి వెలుగు పథకం ఓట్ల కోసం తెచ్చింది కాదు: CM KCR
X

దిశ, డైనమిక్ బ్యూరో: కంటి వెలుగు పథకం ఓట్ల కోసం తెచ్చింది కాదని సీఎం కేసీఆర్ అన్నారు. కంటి వెలుగు పథకం వెనుక ఎంతో పరమార్థం ఉందని ఏ తెలంగాణ కోరుకున్నామో అది సాకారమవుతోందని మహబూబ్‌నగర్‌ జిల్లాలో అధికారులతో నిర్వహించిన సమీక్షలో సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారు. మహబూబ్‌నగర్‌లో నూతనంగా నిర్మించిన టీఆర్​ఎస్ పార్టీ కార్యాలయాన్ని, నూతన కలెక్టరేట్ భవనాన్ని ప్రారంభించి ప్రత్యేక పూజలు చేశారు. అక్కడే జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ...తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందు ఉమ్మడి పాలమూరు జిల్లాలో చెట్లు కూడా బక్క చిక్కి ఉండేవి అని..ఎక్కడ చూసినా కరువు కష్టాలతో ప్రజలు ఎన్నో బాధలు పడే వారు అని అన్నారు. ఇప్పుడు ఆ బాధలు అన్నీ తొలగిపోయి రోడ్ల పొడువునా ఎటు చూసినా పచ్చని చేలు, ధాన్యపు రాశులు కనిపిస్తున్నాయి అన్నారు.

ఈ కష్టాలను తొలగించుకునేందుకు చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు మంచి ఫలితాలు ఇచ్చాయి అన్నారు. అద్భుతమైన ప్రయాణంలో తాము సాగుతున్నామన్నారు. ఇది సాధించామనే సంతృప్తి జీవితంలో చాలా ముఖ్యమని పేర్కొన్నారు. గజ్వేల్‌లో పైలెట్‌ ప్రాజెక్టుగా కంటి పరీక్షలు చేస్తే 127 మందిలో కంటి చూపు సమస్య ఉందని సీఎం కేసీఆర్ అన్నారు. అధికారులు అంకితభావంతో కంటి వెలుగును విజయవంతం చేయాలని సూచించారు. ఏ పథకం తెచ్చిన సమగ్ర చర్చ, ఒక దృక్పథం ఉంటుందన్నారు. కేసీఆర్‌ కిట్‌ పథకం కూడా ఆషామాషీగా తెచ్చింది కాదని సీఎం కేసీఆర్ అధికారులతో అన్నారు. ఈ 8 ఏళ్లలో అందించిన సహకారం భవిష్యత్‌లోనూ కొనసాగాలని అధికారులకు సీఎం కేసీఆర్ సూచించారు. త్వరలో ప్రారంభించే రెండో విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేసి మహబూబ్నగర్ జిల్లాను రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలబెట్టాలి అని అధికారులకు సూచించారు .

అద్భుత ప్రగతి సాధిస్తున్నాం...

విద్యుత్ వినియోగం, సంక్షేమ పథకాల అమలులో దేశంలో మనమే మొదటి స్థానంలో ఉన్నాం అని చెప్పారు. వంద ఏళ్ల నాడు రూపొందించుకున్న చట్టాలు ఇప్పటి పరిసథితులకి సరిపోవు. అవసరాన్ని బట్టి కొన్ని మార్పులు చేర్పులు చేసుకుని అందరూ శ్రమించాలని ముఖ్య మంత్రి సూచించారు. మహిళలు గర్భిణీగా ఉన్నప్పుడు ఆర్థిక, సామాజిక సమస్యలు ఉంటాయన్న సీఎం కేసీఆర్.. గర్భిణీగా ఉన్నప్పుడు ఆదాయం కోల్పోతారనే డబ్బు కూడా ఇస్తున్నామని తెలిపారు. టీకాలను నిర్లక్ష్యం చేయొద్దనే టీకాలు వేయించినప్పుడు డబ్బులు ఇస్తున్నామని తెలిపారు. సామాజిక, మానవీయ దృక్పథం తో పథకాలు తెస్తున్నామని అధికారులతో సీఎం అన్నారు. సంస్కరణలు నిరంతర ప్రక్రియ, ఒక దశతో ముగిసేవి కాదని పేర్కొన్నారు. రాష్ట్రం చిమ్మచీకటవుతుందని శపించిన వాళ్లూ ఉన్నారని సీఎం కేసీఆర్ ఆరోపించారు. అందరి అంచనాలను తలకిందులు చేస్తూ అద్భుత ప్రగతి సాధిస్తున్నామన్నారు.

Advertisement

Next Story

Most Viewed