కాళేశ్వరం ప్రాజెక్టులో తక్షణమే రిపేర్ పనులు చేపట్టండి: పీసీ ఘోష్

by GSrikanth |
కాళేశ్వరం ప్రాజెక్టులో తక్షణమే రిపేర్ పనులు చేపట్టండి: పీసీ ఘోష్
X

దిశ, తెలంగాణ బ్యూరో: కాళేశ్వరం ప్రాజెక్టులో కీలక భాగాలుగా ఉన్న మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ బ్యారేజీలకు తక్షణం చేపట్టాల్సిన రిపేర్ పనులపై దృష్టి పెట్టాలని ఇరిగేషన్ శాఖ ఇంజినీర్-ఇన్-చీఫ్‌లకు జస్టిస్ పినాకి చంద్రఘోష్ ఆదేశాలు జారీ చేశారు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ రెండు రోజుల క్రితం చేసిన సిఫారసులను తక్షణం అమల్లోకి తీసుకురావాల్సిందిగా స్పష్టం చేశారు. మూడు బ్యారేజీలను క్షేత్రస్థాయిలో పరిశీలించి హైదరాబాద్ చేరుకున్న ఆయన గురువారం బీఆర్‌కేఆర్ భవనంలో ఏర్పాటైన ఎంక్వయిరీ కమిషన్ ఆఫీసులో ఇద్దరు ఈ-ఇన్-సీలతో సమావేశమయ్యారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగిన ఈ మీటింగులో అనేక టెక్నికల్, మెకానికల్ అంశాలపై వారి నుంచి వివరాలను తెలుసుకోవడంతో పాటు ఎన్డీఎస్ఏ సిఫారసుల అమలు క్రమంలో ఎదురయ్యే చిక్కుల గురించి వివరించారు.

ఈ సమావేశానికి కొనసాగింపుగా ఇరిగేషన్ శాఖ ఉన్నతాధికారులతో శుక్రవారం సమావేశం నిర్వహించనున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి అవినీతి, అవకతవకలు, డిజైన్, ప్లానింగ్, కన్‌స్ట్రక్షన్ తదితరాలను స్టడీ చేయడంతో పాటు మూడు బ్యారేజీలకు జరిగిన డ్యామేజ్‌పై అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాల్సిందిగా జస్టిస్ పీసీ ఘోష్ నేతృత్వంలోని ఎంక్వయిరీ కమిషన్‌ను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. గత నెల చివరి వారంలో ఫస్ట్ విజిట్‌గా రాష్ట్రానికి వచ్చిన జస్టిస్ ఘోష్.. ఇరిగేషన్ శాఖ అధికారులతో సమావేశమై అనేక అంశాలపై వివరాలను అడిగి తెలుసుకున్నారు. గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను, కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన అనుమతులకు సంబంధించిన డాక్యుమెంట్లను స్టడీ చేశారు.

సెకండ్ విజిట్‌లో భాగంగా మూడు రోజుల క్రితం రాష్ట్రానికి వచ్చిన జస్టిస్ పీసీ ఘోష్ ఇరిగేషన్ ఇంజినీర్లకు ఆదేశాలు ఇవ్వడంతో పాటు అధికారులతో శుక్రవారం జరిగే రివ్యూ అనంతరం మరికొన్ని నిర్ణయాలను తీసుకోనున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంతో ఏ రూపంలో సంబంధం ఉన్నా ఆ అధికారులను, ఇంజినీర్లను, రిటైర్డ్ ఆఫీసర్లకు నోటీసులు ఇచ్చి ఎంక్వయిరీ చేస్తామని, అవసరమైతే రాజకీయ నాయకులకూ నోటీసులు ఇస్తామని జస్టిస్ పీసీ ఘోష్ గత నెల చివరి వారంలో మీడియాకు వెల్లడించారు. ఇందులో భాగంగానే ప్రస్తుతం సెకండ్ విజిట్‌ కంప్లీట్ కాకముందే కొద్దిమందికి నోటీసులు జారీ చేసినట్లు సమాచారం. కానీ అధికారికంగా అటు కమిషన్ నుంచి, ఇటు ఇరిగేషన్ డిపార్టుమెంటు నుంచి కన్ఫర్మేషన్ రాలేదు. ఒకటి రెండు రోజుల్లో దీనిపై మరింత స్పష్టత వచ్చే అవకాశమున్నది.

Advertisement

Next Story