పటాన్ చెరుకు ఉమ్మడి జిల్లా సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్

by Sathputhe Rajesh |
పటాన్ చెరుకు ఉమ్మడి జిల్లా సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్
X

ఉమ్మడి జిల్లా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం తరలింపు ప్రక్రియ అన్నివర్గాల్లో చర్చనీయాంశమవుతున్నది. జిల్లా కేంద్రమైన సంగారెడ్డి నుంచి కార్యాలయాన్ని పటాన్ చెరుకు మార్చాలనే ప్రభుత్వ నిర్ణయంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి మూడు జిల్లాలకు సంబంధించిన కార్యాలయం సంగారెడ్డి నుంచి సేవలందిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఆ కార్యాలయాన్ని ఒక్కసారిగా పటాన్ చెరుకు మార్చాల్సిన అవసరం ఏమొచ్చిందనే విమర్శలొస్తున్నాయి. పటాన్ చెరు నియోజకవర్గ పరిధికి సంబంధించిన సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ఏర్పాటు చేస్తే సరిపోయేదని, జిల్లా కార్యాలయం తరలింపు వ్యవహారంపై అధికార, రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చజరుగుతున్నది. - దిశ బ్యూరో, సంగారెడ్డి

ఉమ్మడి మెదక్ జిల్లాకు సంబంధించిన గతం నుంచే సంగారెడ్డి సబ్ రిజిస్ట్రార్ ఆఫీసు నుంచి సేవలు అందుతున్న విషయం తెలిసిందే. జిల్లాలు ఏర్పడిన తర్వాత కూడా ఉమ్మడి జిల్లా సేవలు మాత్రమే ఇక్కడి నుంచే కొనసాగుతున్నాయి. ప్రస్తుతం ఉమ్మడి జిల్లా పరిధిలో సంగారెడ్డి, సదాశివపేట, జహీరాబాద్, అందోలు, నారాయణఖేడ్, నర్సాపూర్, మెదక్, రామాయంపేట, తూప్రాన్, సిద్దిపేట, గజ్వేల్, చేర్యాల, జగదేవ్ పూర్, హుస్నాబాద్, దుబ్బాక సబ్ రిజిస్ట్రార్ ఆపీసుర్లున్నారు. ఆయా ఆఫీసుల నుంచి వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్లు జరుగుతుండగా ఉమ్మడి జిల్లాలోని అన్ని తహసిల్దార్ కార్యాలయాల్లో వ్యవసాయ భూములు రిజిస్ట్రేషన్లు జరుగుతున్న విషయం తెలిసిందే.

సంగారెడ్డి నుంచి పటాన్ చెరుకు..

సంగారెడ్డిలో ఉన్న ఉమ్మడి జిల్లా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని ఒక్కసారిగా పటాన్ చెరుకు మార్చే నిర్ణయంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పటాన్ చెరు సెగ్మెంట్ పరిధికి సంబంధించి పటాన్ చెరు, రామచంద్రాపురం, గుమ్మడిదల, జిన్నారం మండలాలు కలిపి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం పటాన్ చెరుకు మంజూరు చేయాలని ఎమ్మెల్యే ఇంతకుముందే మంత్రులు కేటీఆర్, హరీశ్ రావులకు విన్నవించిన విషయం తెలిసిందే. ఎవరూ ఊహించని విధంగా పటాన్ చెరు సబ్ డివిజన్ సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుతోపాటు ఉమ్మడి జిల్లా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని కూడా పటాన్ చెరుకు మార్చుతూ ప్రభుత్వం జీవో విడుదల చేయడం గమనార్హం.

పటాన్ చెరులోని మండలాలు సంగారెడ్డిలోకి..

పటాన్ చెరులో కొత్తగా ఏర్పాటు కానున్న సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం పరిధిలోకి పటాన్ చెరు, అమీన్ పూర్, రామచంద్రాపూర్ మండలాల్లోని అన్ని గ్రామాలను కలిపారు. ఈ మూడు మండలాల పరిధికి సంబంధించి పటాన్ చెరులో కొత్త సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ఏర్పాటు కాబోతున్నదని జీవో పేర్కొన్నారు. పటాన్ చెరు అసెంబ్లీ నియోజకర్గంలోని జిన్నారం, గుమ్మడిదల రెండు మండలాలను సంగారెడ్డి సబ్ రిజిస్ట్రార్ పరిధిలోనే ఉండడం గమనార్హం. వాస్తవానికి తమ నియోజకవర్గంలోని అన్ని మండలాలను కలిపి ప్రత్యేకంగా పటాన్ చెరులో సబ్ రిజిస్ట్రార్ ఆఫీసు ఏర్పాటు చేయాలని స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి చాలాకాలంగా డిమాండ్ చేస్తూ వస్తున్నారు.

సంగారెడ్డిలో ఇక నాలుగు మండలాలే

ఉమ్మడి జిల్లా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం పటాన్ చెరుకు మారితే జిల్లా కేంద్రమైన సంగారెడ్డిలో ఇక సంగారెడ్డి, కంది, జిన్నారం, గుమ్మడిదల మండలాలుంటాయి. తమ నియోజకవర్గంలోని మండలాలను సంగారెడ్డిలో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో కొనసాగించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎక్కడో ఉమ్మడి జిల్లా సేవలు పటాన్ చెరులో అందుబాటులో ఉంటే స్థానికులు మాత్రమే రిజిస్ట్రేషన్లకు సంగారెడ్డికి వెళ్లాలా? అని జిన్నారం, గుమ్మడిదల మండలాల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఎందుకు..? ఎలా ఈ నిర్ణయం తీసుకున్నదో అర్థం కావడం లేదని జిల్లా కార్యాలయం తరలింపులో అధికార యంత్రాంగం పునరాలోచించాలనే అధికార పార్టీ నేతలే డిమాండ్ చేయడం కొసమెరుపు.

Advertisement

Next Story

Most Viewed