‘జలగం’ను ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేయిస్తారా..? అసెంబ్లీ ఎన్నికల వేళ బీఆర్ఎస్‌కు కొత్త తలనొప్పి

by Satheesh |
‘జలగం’ను ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేయిస్తారా..? అసెంబ్లీ ఎన్నికల వేళ బీఆర్ఎస్‌కు కొత్త తలనొప్పి
X

దిశ, తెలంగాణ బ్యూరో: బీఆర్ఎస్ నేత జలగం వెంకట్రావును అసెంబ్లీ స్పీకర్ పిలుస్తారా..? ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయిస్తారా..? అనేది ప్రస్తుతం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. కొత్తగూడెం ఎమ్మెల్యేగా ఉన్న వనమా వెంకటేశ్వర్ రావు బీఆర్ఎస్‌లోనే కొనసాగుతుండడంతో ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది. వనమా ఉద్దేశపూర్వకంగా ఎన్నికల అఫిడవిట్‌లో కుటుంబసభ్యుల ఆదాయ వివరాలు వెల్లడించలేదని జలగం వెంకట్రావు 2019లో హైకోర్టులో పిటిషన్ వేశారు.

దీంతో వనమా ఎన్నిక చెల్లదని ఈ నెల 25న హైకోర్టు తీర్పు చెప్పింది. 2018 డిసెంబర్‌ 12 నుంచే జలగం వెంకట్రావు ఎమ్మెల్యేగా కొనసాగుతారని స్పష్టం చేసింది. అయితే హై కోర్టు తీర్పు సర్టిఫైడ్ కాపీ అందుబాటులోకి రాలేదని, సుప్రీంకోర్టుకు వెళ్లే వరకు తీర్పు అమలును నిలుపుదల చేయాలని ఈ నెల 26న వనమా హై కోర్టులో మధ్యంతర పిటిషన్‌ దాఖలు చేశారు. అయితే ఈ పిటిషన్‌ను హై కోర్టు కొట్టివేసింది. దీంతో జలగం వెంకట్రావుకు లైన్ క్లియర్ అయింది.

బీఆర్ఎస్‌కు కొత్త తలనొప్పి

హైకోర్టు తీర్పు కాపీ ఇంకా అసెంబ్లీకి రాలేదని తెలిసింది. ఈ తీర్పుకాపీతో పాటు వనమా అప్పీల్ చేసుకున్న స్టే ను హైకోర్టు నిరాకరించిన కాపీ సైతం అసెంబ్లీకి రావాల్సి ఉన్నది. ఆ తర్వాత చట్టంలో ఉన్న రూల్స్ ప్రకారం ప్రభుత్వం నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిసింది. గతంలో ఇలాంటి తీర్పులు వచ్చాయా? వాటిలో ఎలాంటి నిబంధనలు పాటించారు? అని పరిశీలించిన తర్వాత స్పీకర్ నిర్ణయం తీసుకుంటారని సమాచారం.

అయితే ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది? ఎన్నికలకు ముందు ఎవరికి హ్యాండ్ ఇస్తుందనేది పార్టీతోపాటు రాజకీయ వర్గాల్లోనూ చర్చనీయాంశంగా మారింది. జలగంతో ప్రమాణ స్వీకారం చేయిస్తారా? లేదా? అనేదానిపై నేతలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు గడువు సమీపిస్తున్న తరుణంలో ఈ వ్యవహారం బీఆర్ఎస్‌కు కొత్త తలనొప్పిగా మారింది.

Advertisement

Next Story

Most Viewed