'జైనూర్‌' నిందితుడిని కఠినంగా శిక్షిస్తాం : మంత్రి సీతక్క

by M.Rajitha |
జైనూర్‌ నిందితుడిని కఠినంగా శిక్షిస్తాం : మంత్రి సీతక్క
X

దిశ, తెలంగాణ బ్యూరో: కుమ్రంభీం ఆసిఫాబాద్‌ జిల్లా జైనూర్‌ బాధితురాలి ఉదంతానికి మత రంగు పులుమడం ఏమాత్రం సరికాదని తెలంగాణ రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క పేర్కొన్నారు. జైనూర్ మండలంలో ఆటో డ్రైవర్ దాడిలో తీవ్రంగా గాయపడ్డ ఆదివాసీ మహిళను గాంధీ ఆసుపత్రిలో ఆమె గురువారం పరామర్శించారు. బాధితురాలికి ప్లాస్టిక్ స‌ర్జరి జ‌రుగుతున్న విష‌యాన్ని తెలుసుకుని.. ఆమెకు అందుతున్న చికిత్స వివ‌రాల‌ను డాక్టర్ల నుంచి అడిగి తెలుసుకున్నారు. బుధ‌వారం సైతం సీతక్క బాధితురాలిని ప‌ర‌మర్శించారు. గురువారం నాడు మ‌రోసారి గాంధీ ఆసుపత్రికి చేరుకుని బాధితురాలి కుటుంబానికి భరోసా కల్పించారు. బాధితురాలి కుటుంబ స‌భ్యుల‌కు గిరిజ‌న సంక్షేమ శాఖ త‌రుపున త‌క్షణ ప‌రిహారంగా ల‌క్ష రూపాయ‌ల చెక్కును అంద‌చేశారు. ప్రభుత్వం అన్ని రకాలుగా అండ‌గా ఉంటుంద‌ని భ‌రోసా ఇచ్చారు.

ఘటన విషయంలో కొందరు చేస్తున్న విమర్శలపై మంత్రి సీతక్క తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివాసులను ఆదుకోవడానికి హైదరాబాదు లో బంధువులు ఎవరు వుండరని, అందుకే తక్షణ పరిహారంగా లక్ష రూపాయలు ఇస్తే.. దాన్ని కూడా తప్పు పడతారా అని మాజీ మంత్రి కేటీఆర్ ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. వారి హయాంలో ఆదిలాబాద్ లో టేకు లక్ష్మి హత్యాచారానికి గురైతే కనీసం పట్టించుకోలేదని మండిపడ్డారు. కోర్టు జోక్యం చేసుకుంటే తప్ప బాధిత కుటుంబానికి న్యాయం దక్కలేదన్నారు. దాడి ఘటనను పక్కదారి పట్టించాల్సిన అవసరం ప్రభుత్వానికి లేదన్నారు. ఆడబిడ్డకు అన్యాయం జరిగిందని తెలిసిన వెంటనే ప్రభుత్వం స్పందించిందని... 24 గంటల్లోనే నిందితున్ని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు సీతక్క స్పష్టం చేశారు. నిందితుడిపై ఎస్సీ, ఎస్టీ కేస్ నమోదు చేసినట్లు పేర్కొన్న మంత్రి.. నిందితుడికి కఠిన శిక్ష పడే వరకు ప్రభుత్వం వదిలిపెట్టదని తెలిపారు. మహిళా సంక్షేమ శాఖ మంత్రిగా, ఆడబిడ్డగా, ఆదివాసి బిడ్డగా బాధితురాలికి న్యాయం చేయాల్సిన బాధ్యత తనకు ఎక్కువగా వుంటుందన్నారు.

బీజేపీ నేతలపై సీతక్క ఆగ్రహం

నిందితుడిని తక్షణం ఉరితీయాలని కొంతమంది బిజెపి నేతలు డిమాండ్ చేయడాన్ని సీతక్క తప్పుపట్టారు. మహిళలపై దాడి, లైంగిక దాడి చేసిన నిoధితులను తక్షణం ఉరి తీసేలా కేంద్ర ప్రభుత్వం చట్టం చేస్తే... అమలు చేయడానికి తాము సిద్ధంగా ఉన్నామన్నారు. అలాంటి చట్టాన్ని బిజెపి నేతలు తీసుక రాగలరా అని సవాలు చేశారు. అనవసరంగా జనాలను రెచ్చగొట్టడం మానుకోవాలని హితవు పలికారు. అయితే జైనూరు ఘటనకు మతం రంగు పూసేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారన్న అనుమానాలను మంత్రి సీతక్క వ్యక్తం చేశారు. మత కొట్లాటలు రేపెందుకు కుట్రలు పన్నుతున్న శక్తుల పట్ల తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.

Next Story

Most Viewed