Pulwama Terror Attack : పుల్వామా ఘటనకు నాలుగేళ్లు.. ఆ రోజు ఏం జరిగిందంటే?

by Sathputhe Rajesh |   ( Updated:2023-02-14 04:57:27.0  )
Pulwama Terror Attack : పుల్వామా ఘటనకు నాలుగేళ్లు.. ఆ రోజు ఏం జరిగిందంటే?
X

దిశ, వెబ్ డెస్క్: దేశం మొత్తం దిగ్భ్రాంతికి గురి చేస్తూ 40 మంది సైనికులను ముష్కర మూకలు పొట్టన పెట్టుకున్న పుల్వామా ఘటన దేశ చరిత్రలో చీకటి రోజుగా మిగిలి పోయింది. వీర సైనికులను తలచుకుంటూ దేశ ప్రజల గుండెల్లో బాధ, కన్నీళ్లతో కళ్లు, సైనికుల రక్తం మరిగిన రోజు.

టీవీ స్క్రీన్లు, మొబైల్ నోటిఫికేషన్లు, న్యూస్ పేపర్లు ఈ వార్తతో నిండిపోయాయి. కాలిపోయిన అమరసైనికుల మృతదేహాలు, దాడి అనంతరం భయానక దృశ్యాలతో దేశం యావత్తు షాక్‌కు గురైన పుల్వామా అటాక్ దాడి జరిగి నేటికి నాలుగేళ్లు పూర్తయ్యాయి. ఈ ఘటనను దేశమంతా ముక్తకంఠంతో ఖండించింది. నాలుగేళ్ల క్రితం 40 కుటుంబాల్లో ఈ ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది.

పుల్వామా దాడి ఇలా..

2019 ఫిబ్రవరి 14న జమ్ము శ్రీనగర్ జాతీయ రహదారి 44పై భారతీయ సైనికులను తీసుకువెళ్తున్న వాహనాల కాన్వాయ్ మీద లేథిపురా (అవంతిపురా సమీపంలో) కారుతో ఆత్మాహుతి బాంబు దాడి జరిగింది. ఈ దాడిలో 76వ బెటాలియన్‌కు చెందిన 40 మంది సెంట్రల్ రిజర్వ్ పోలిస్ ఫోర్స్ (సీఆర్పీఎఫ్) సైనికులు, ఒక ఉగ్రవాది మరణించారు. ఈ దాడి ఘటనలో 35 మంది గాయపడ్డారు. తామే పుల్వామా దాడికి పాల్పడినట్లు జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ ప్రకటించింది.

22 ఏళ్ల సూసైడ్ బాంబర్ ఆదిల్ అహ్మద్ దార్ అనే వ్యక్తి పేలుడు పదార్థాలతో కూడిన వాహనంతో జవాన్ల కాన్వాయ్‌పై దాడికి పాల్పడ్డాడు. ఈ యువకుడు కశ్మీర్‌కు చెందిన వాడిగా దాడి అనంతరం సైనికాధికారులు గుర్తించారు. సైనిక కుటుంబాలకు భారత ప్రభుత్వం రూ.12లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించింది. ఫిబ్రవరి 18, 2019న ఇండియన్ ఆర్మీ ఇద్దరు మిలిటెంట్లను ఎన్ కౌంటర్ చేసి ప్రతీకారం తీర్చుకుంది.

పాకిస్థాన్‌పై భారత్ సీరియస్..

ఈ ఘటన అనంతరం పాకిస్థాన్‌పై భారత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ దాడి పాకిస్థాన్ కేంద్రంగా జరిగినట్లు భారత్ ఆరోపించింది. దాడి అనంతరం పాకిస్థాన్‌ను మోస్ట్ ఫేవర్డ్ నేషన్ హోదాను ఉపసంహరించుకోవాలని భారత్ నిర్ణయం తీసుకుంది.

పాకిస్థాన్‌పై భారత్ కఠినమైన ఆంక్షలను విధించింది. పాకిస్థాన్ నుంచి దిగుమతి చేసుకునే అన్ని వస్తువులపై కస్టమ్ డ్యూటీని భారత్ 200 శాతానికి పెంచింది. మనీలాండరింగ్‌పై ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ పాకిస్థాన్‌ను బ్లాక్ లిస్ట్‌లో చేర్చాలని కోరింది. అనంతర కాలంలో ఆ సంస్థ పాకిస్థాన్‌ను గ్రే లిస్ట్‌లో చేర్చింది.

బాలకోట్ సర్జికల్ స్ట్రయిక్..

దాడులకు ప్రతిగా భారత్ 2019 ఫిబ్రవరి 26న భారత ఎయిర్‌ఫోర్స్ పాకిస్థాన్‌లోని బాలకోట్ ప్రాంతంలోని ఉగ్రవాద శిబిరంపై సర్జికల్ స్ట్రయిక్‌లతో విరుచుకుపడింది. ఈ దాడిలో 300 మంది ఉగ్రవాదులు మరణించారు. పుల్వామా ఉగ్రదాడి ఘటనలో కీలక సూత్రధారి, సూసైడ్ బాంబర్ ఆదిల్‌కు శిక్షన ఇచ్చిన జైషే మహమ్మద్ కమాండర్ రషీద్ ఘాజీ‌తో పాటు మరో ఉగ్రవాది కమ్రాన్‌ను భద్రతా దళాలు మట్టుబెట్టాయి.

ఇందుకు పాకిస్థాన్ సైతం వైమానిక దాడులను ప్రారంభించింది. ఆ సందర్భంలోనే మిగ్ 21 ఫైటర్ జెట్ పైలట్ అభినందన్ వర్థమాన్ పాకిస్థాన్‌కు చెందిన ఎఫ్ - 16‌ని కూల్చి వేశాడు. ఆ సమయంలో వింగ్ కమాండర్ వర్థమాన్ పాకిస్థాన్ భూభాగంలోకి ల్యాండ్ అయ్యాడు. అభినందన్‌ను పాకిస్థాన్ సైన్యం అదుపులోకి తీసుకుంది. మార్చి 1, 2019లో భారత దౌత్యంతో అభినందన్‌ను పాకిస్థాన్ విడుదల చేసింది.

ఈ దాడి అనంతరం సరిహద్దుల వెంబడి ఉగ్రవాదుల ఏరివేత కొనసాగుతూనే ఉంది. ఈ దాడికి సంతాపంగా దేశవ్యాప్తంగా ఫిబ్రవరి 14న వీర సైనికుల యాదిలో కొవ్వొత్తులతో నివాళులు అర్పిస్తున్నారు. తీవ్రవాదంపై ప్రపంచ దేశాలు ప్రత్యేక దృష్టి సారించి ప్రపంచ శాంతికి బాటలు వేయాలని ఈ సందర్భంగా దేశ ప్రజలు కోరుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed