'తెలంగాణ పేరు పలకడానికి అంత మొహమాటమా?'

by Sathputhe Rajesh |   ( Updated:2023-01-19 13:36:34.0  )
తెలంగాణ పేరు పలకడానికి అంత మొహమాటమా?
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఖమ్మం బీఆర్ఎస్ సభలో కేసీఆర్ మాటలు అద్దాల వెనుక ఉన్న మిఠాయిళ్లా ఉన్నాయని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొ.కోదండరామ్ విమర్శించారు. అనేక మంది ప్రాణ త్యాగాలతో కేసీఆర్‌కు అధికారం కట్టబెడితే బీఆర్ఎస్ సభలో కనీసం జై తెలంగాణ అని పలకలేకపోవడం నిజంగా విషాదకరం అని మండిపడ్డారు. తెలంగాణ పేరు ఎత్తడానికే సిగ్గుపడితే రేపు తెలంగాణను ఏం అభివృద్ధి చేస్తారని నిలదీశారు.

గురువారం నాంపల్లిలోని టీజేఎస్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన కోదండరాం కేసీఆర్ మాటలకు రాష్ట్రంలోని పరిస్థితులకు వైరుధ్యం ఉందని ధ్వజమెత్తారు. దేశంలో విస్తారమైన జల సంపద ఉన్నా సక్రమంగా వినియోగించుకోవడంలో ప్రభుత్వాలు విఫలం అయ్యాయని విమర్శిస్తున్న కేసీఆర్.. కృష్ణా నదిపై ప్రాజెక్టులు పెండింగ్ విషయంపై ఎందుకు స్పందించడం లేదన్నారు.

కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయింది అని చెప్పడం పచ్చి అబద్దం అన్నారు. ఈ ప్రాజెక్టులో కట్టలు మాత్రమే పూర్తయ్యాయని కాలువలు ఇంకా పూర్తి కాలేదన్నారు. రాష్ట్రంలో ఎక్కడ నీళ్లు వచ్చినా అవి కాళేశ్వరం నీళ్లు అని చెప్పడం బీఆర్ఎస్‌కు అలవాటుగా మారిందని విమర్శించారు. ఒక్క కాళేశ్వరం ప్రాజెక్టుతోనే అప్పుల పాలైన రాష్ట్రాన్ని పాలిస్తున్న కేసీఆర్ దేశంలో ఏం పరిపాలిస్తారని ప్రశ్నించారు.

వ్యవసాయం, విద్య, వైద్యం, ప్రజాస్వామ్యం అమలు రంగాల్లో తెలంగాణ వెనుకబడిపోయిందన్నారు. మాది నేషనలైజేషన్ పాలసీ అని చెబుతున్న కేసీఆర్ అధికారంలోకి వచ్చాకే సింగరేణిలో అధిక భాగం ప్రైవేట్ పరం అయిన మాట నిజం కాదా? అని ప్రశ్నించారు. నిజాం చెక్కర ఫ్యాక్టరీ ఎందుకు ప్రారంభించలేదని ప్రశ్నించారు. ఇదేనా మీరు దేశానికి చూపించే మోడల్ అని నిలదీశారు.

తొమ్మిదేళ్లలో రాష్ట్రంలో విధ్వంసం తప్ప అభివృద్ధి జరగలేదన్నారు. కేసీఆర్ మాటలకు చేతలకు పొంతన లేదని, కేసీఆర్ నాటకాలు తెలంగాణ ప్రజలకు అర్థమవుతున్నాయని అన్నారు. ఈ సందర్భంగా ఛలో ఢిల్లీ గోడ పత్రికలు, కరపత్రాలను పార్టీ నేతలతో కలిసి ఆవిష్కరించారు.

ఈ నెల 30 న కృష్ణా జలాల వాటా, విభజన హామీలు సాధన కోసం జంతర్ మంతర్ వద్ద దీక్ష చేపడతామని చెప్పారు. 31న తొమ్మిదేళ్ల తెలంగాణ పాలన అభివృద్ధి, వాస్తవాల మీద సెమినార్ ఉంటుందన్నారు. తెలంగాణ ఆకాంక్షలు, అస్తిత్వాన్ని కాపాడుకోవడం కోసం ఉమ్మడి ఉద్యమ కార్యాచరణ నిర్ణయించి ముందుకు సాగుదామని ఇందుకోసం అన్ని పార్టీలు, సంఘాలు కలసి రావాలని పిలుపునిచ్చారు.

Advertisement

Next Story

Most Viewed