అసెంబ్లీ ఎన్నికల్లో మునుగోడులో బీజేపీకి గెలుపు సాధ్యమేనా?

by GSrikanth |   ( Updated:2023-05-28 02:37:08.0  )
అసెంబ్లీ ఎన్నికల్లో మునుగోడులో బీజేపీకి గెలుపు సాధ్యమేనా?
X

దిశ, చౌటుప్పల్: అభివృద్ధిలో అత్యంత వెనుకబడిన ప్రాంతాల్లో మునుగోడు నియోజకవర్గం ఒకటి. అంతేకాకుండా ఫ్లోరైడ్ పీడిత ప్రాంతంగా మునుగోడు నియోజకవర్గం ఉండేది. మునుగోడు నియోజకవర్గం 1967వ సంవత్సరంలో ఏర్పడి 13 సార్లు ఎన్నికలు జరగగా అత్యధికంగా కాంగ్రెస్ 6సార్లు, సీపీఐ 5 సార్లు, మొన్నటి ఉప ఎన్నికలతో కలిపి టీఆర్ఎస్ రెండుసార్లు ఇక్కడ అధికారాన్ని చేపట్టాయి. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు పాల్వాయి గోవర్ధన్ రెడ్డి 5 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందగా, సీపీఐ నాయకులు ఉజ్జిని నారాయణరావు వరసగా మూడుసార్లు, పల్ల వెంకట్ రెడ్డి, ఉజ్జిన్ యాదగిరిరావు లు రెండు సార్లు గెలుపొందారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ కాకుండా మరో పార్టీ నియోజకవర్గంలో గెలుస్తూ రావడంతోనే అభివృద్ధిలో వెనకబడుతూ వస్తుందనే అపవాదు ఉంది.

2014 సంవత్సరంలో రాష్ట్రంలో అధికార బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెలుపొందిన నియోజకవర్గం పెద్దగా అభివృద్ధికి నోచుకోలేదని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. 2019లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీఆర్ఎస్ అభ్యర్థి పై విజయం సాధించిన తిరిగి రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారంలో రావడంతో నియోజకవర్గ అభివృద్ధి పూర్తిస్థాయిలో నిలిచిపోయిందని చెప్పొచ్చు. గత సంవత్సరం రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బీజేపీ తరఫున పోటీ చేశారు. రాష్ట్రంలో అధికారంలో బీఆర్ఎస్ పార్టీ ఉన్నందున నియోజకవర్గంలో ఆ పార్టీ అభ్యర్థిని గెలిపిస్తే పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందుతుందని ప్రజలు నమ్మారు. అంతేకాకుండా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి తరపఉన మంత్రులు, ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీలు గ్రామాలను ఇన్చార్జిలుగా తీసుకొని అభివృద్ధి పై పెద్ద ఎత్తున హామీలు కురిపించారు. మునుగోడు ఉపఎన్నిక దేశంలోనే అతి ఖరీదైన ఎన్నికలుగా కూడా మిగిలిపోయాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

మునుగోడు పైనే దృష్టి

మునుగోడు ఉప ఎన్నికలలో రాజగోపాల్ రెడ్డి విజయం సాధించి కాషాయ జెండాను ఎగరవేయాలని ఆ పార్టీ శ్రేణులు భావించిన చివరకు బీఆర్ఎస్ అభ్యర్థికి గట్టి పోటీ ఇచ్చి ఓటమిపాలయ్యారు. నియోజకవర్గంలో 20 వేలకు లోపే ఉన్న బీజేపీ ఓట్ల సంఖ్యను గణనీయంగా పెంచిన రాజగోపాల్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలని పట్టుదలతో ఉన్నారు. ఉప ఎన్నికల్లో అధికార పార్టీ తన ఆర్థిక, అంగ బలాన్ని ఉపయోగించిన స్వల్ప మెజార్టీతోనే విజయం సాధించిందని రాజగోపాల్ రెడ్డి అంటున్నారు. నియోజకవర్గంలో అత్యంత బలమైన కేడర్ ఉన్న కమ్యూనిస్టులు కూడా అధికార పార్టీ అభ్యర్థి విజయంలో కీలక పాత్ర పోషించారని,కానీ రాబోయే సాధారణ ఎన్నికల్లో కచ్చితంగా బీజేపీ పార్టీని విజయం సాధిస్తుందనే ధీమాలో రాజగోపాల్ రెడ్డి ఉన్నారు. అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీ నుంచి వ్యాపారవేత్త అయిన చలమల్ల కృష్ణారెడ్డి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తానని ఇప్పటికే నియోజకవర్గంలో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. అదేవిధంగా అధికార బీఆర్ఎస్ పార్టీలో టికెట్ల కోసం అరడజనుకు పైగా అభ్యర్థులు పోటీ పడుతున్నారు.బీఆర్ఎస్ తో పొత్తు కొనసాగితే మునుగోడు టికెట్ వస్తుందని సీపీఐ ఆశాభావం వ్యక్తం చేస్తుంది.దీంతో వచ్చే ఎన్నికల్లో విజయం ఏ పార్టీని వరిస్తుందోనని ప్రజలు చర్చించుకుంటున్నారు.

నియోజకవర్గంలోని మొత్తం ఓటర్ల సంఖ్య :240093

పురుష ఓటర్ల సంఖ్య:120817

మహిళా ఓటర్ల సంఖ్య:119267

ఇతరులు:9

శివన్న గూడెం ప్రాజెక్టు పనులు పూర్తి చేయాలి: కంచుకట్ల సుభాష్,ఫ్లోరోసిస్ విముక్తి పోరాట సమితి కన్వీనర్.

మూడు లక్షల పైగా ఎకరాలకు సాగునీరు అందించే శివన్నగూడెం ప్రాజెక్టు పనులు 2017 సంవత్సరంలో ప్రారంభమయ్యాయి.రెండు సంవత్సరాలలోనే ప్రాజెక్టు పనులు పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. కానీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి మునుగోడులో విజయం సాధించడంతో ఆ పనులు మందకోడిగా కొనసాగాయి. మొన్న జరిగిన ఉపఎన్నికలలో శివన్నగూడెం ప్రాజెక్టు పనుల పూర్తి కోసం అధికార పార్టీ అభ్యర్థిని గెలిపించాము. ఇంకా ప్రాజెక్టు పనులు ఎందుకు పూర్తి కావడం లేదో ముఖ్యమంత్రి కెసిఆర్ దృష్టి సారించాలి.

రాచకొండ రైతులకు పట్టాలు ఇవ్వాలి: మినుగు గోపాల్, రాచకొండరైతు సంస్థాన్ నారాయణపురం.

రాచకొండలో ప్రభుత్వ భూములలో తాము ఎన్నో ఏళ్లుగా సాగు చేసుకుంటున్నాము.గత ప్రభుత్వాలు మా భూములకు పట్టాలు ఇచ్చాయి.తెలంగాణ ప్రభుత్వంలో ధరణి రాకతో పట్టాలు ఇవ్వకపోగా తాము సాగు చేస్తున్న భూములు అటవీ భూములు అంటూ వేధింపులకు గురి చేస్తున్నారు. ఆ భూమిని సాగు చేసుకుంటూ దానిపై ఆధారపడి జీవనం సాగిస్తూ ఉన్నాము,ఇకనైనా ప్రభుత్వం స్పందించి మాకు పట్టాలు అందించాలి.

చండూర్‌ను రెవెన్యూ డివిజన్‌గా చేయాలి: నల్ల యాదయ్య, లకీనేని గూడం, చండూర్.

చండూరును రెవెన్యూ డివిజన్ గా చేయాలి.దీంతో చుట్టుపక్కల మండలాల ప్రజల ఇబ్బందులు తీరుతాయి. మొన్నటి ఉప ఎన్నికల్లో రెవెన్యూ డివిజన్ గా ఏర్పాటు చేస్తామని చెప్పిన ఇంతవరకు నెరవేర్చలేదు. అంతేకాకుండా మున్సిపాలిటీలోని రోడ్లను విస్తరిస్తామని చెప్పిన అటువైపుగా పనులు చేయడం లేదు. కానీ ఇకనైనా రెవెన్యూ డివిజన్ గా ఏర్పాటు చేసి, చండూరు మున్సిపాలిటీలోని సమస్యలను తీర్చాలి.

Also Read: బీఆర్ఎస్ లీడర్ల కుటుంబాల్లో MLA టికెట్ల పంచాయితీ!

Advertisement

Next Story

Most Viewed