బీఆర్ఎస్.. డైరెక్షన్ మిస్! అప్పట్లో కేసీఆర్ కనుసన్నల్లో.. నేడు ఇష్టారాజ్యంగా..!

by karthikeya |
బీఆర్ఎస్.. డైరెక్షన్ మిస్! అప్పట్లో కేసీఆర్ కనుసన్నల్లో.. నేడు ఇష్టారాజ్యంగా..!
X


దిశ,తెలంగాణ బ్యూరో: గులాబీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్‌కు తెలియకుండా ఏదీ జరిగేది కాదు. ఆయన అనుమతి లేకుండా పార్టీలో ఏ ప్రోగ్రామ్స్ జరిగేవి కావు. చివరికి ప్రెస్‌మీట్ పెట్టాలన్నా ఆయన పర్మిషన్ తీసుకోవాల్సి ఉండేది. అందులో ఎవరు మాట్లాడాలి? ఏం మాట్లాడాలి? అనేది సైతం అధినేత అనుమతి తీసుకునే చేయాల్సి ఉండేదని చెప్పుకునేవారు. కానీ కొన్ని రోజులుగా పార్టీలో జరుగుతోన్న పరిణామాలు, లీడర్లు వ్యవహరిస్తున్న తీరు చూస్తే బీఆర్ఎస్ పట్టుతప్పుతుందేమోనని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

కేసీఆర్ డైరెక్షన్ ఉందా?లేదా?

కొన్ని రోజులుగా బీఆర్ఎస్ లీడర్లు చేస్తున్న ప్రకటనలు, నిర్వహిస్తున్న ఆందోళనలు ఆ పార్టీ చీఫ్ కేసీఆర్ కనుసన్నల్లోనే జరుగుతున్నాయా? లేదా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ మధ్య ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి ఎపిసోడ్ అధినేతకు తెలిసే జరిగిందా? లేదా? అనే చర్చ మొదలైంది. ఒకవేళ తెలిసే జరిగితే.. కౌశిక్ రెడ్డి దూకుడుగా వ్యవహరించి ఉంటే అది పార్టీకి రాజకీయంగా ప్రయోజనం జరగపోగా, పెద్ద ఎత్తున డ్యామేజీ తెచ్చిందనే అభిప్రాయాలు సొంత పార్టీలోనే ఉన్నాయి. కేసీఆర్ నోటీసులో లేకుండానే ఈ తతంగం మొత్తం జరిగితే, పార్టీ గాడి తప్పేందుకు మొదటి అడుగు పడినట్టేనని విమర్శలు వస్తున్నాయి. కౌశిక్ రెచ్చగొట్టే విధంగా వ్యవహరించడం, అందుకు ప్రతిగా ఆయన ఇంటిపై దాడి జరగడం, ఆయనకు బాసటగా ఇతర ఎమ్మెల్యేలు వెళ్లడం, కొందరు సిటీ ఎమ్మెల్యేలు దూరంగా ఉండటంతో పార్టీలో లుకలుకలు ఉన్నట్టు కేడర్‌లో చర్చలు మొదలయ్యాయి. ఖమ్మంలో వరదలు వచ్చినప్పుడు ముంపు బాధితులను పరామర్శించేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వెళ్లారు. అక్కడ కాంగ్రెస్ కార్యకర్తలతో ఘర్షణ పడ్డారు. దీంతో సర్కారు వైఫల్యం ఎత్తిచూపే అంశం పక్కదారి పడినట్లు అయ్యింది.

‘సారు’ను ఇరుకున పెట్టిన కౌశిక్

అరెకెపుడి గాంధీతో జరిగిన వివాదంలో కౌశిక్ రెడ్డి నేరుగా కేసీఆర్‌ను దోషిగా నిలపెట్టారనే విమర్శలొచ్చాయి. ‘ఆంధ్ర వాళ్లు వచ్చి దాడి చేస్తే ఊరుకుంటామా?’ అని గాంధీపై చేసిన విమర్శలను బీఆర్ఎస్ లీడర్లే తప్పుపడుతున్నారు. 2014లో టీడీపీ నుంచి గెలిచిన గాంధీని కేసీఆర్ పార్టీలో చేర్చుకుని, 2018, 2023లో టికెట్ ఇచ్చారు. కానీ ఇప్పుడు గాంధీని ఆంధ్ర లీడర్ అని విమర్శించి కేసీఆర్‌ను ఇరుకున పెట్టారని పార్టీ నేతలే మండిపడుతున్నారు.

నేతల మధ్య ఆధిపత్యపోరు

పార్టీ ఎమ్మెల్యేల మధ్య ఆధిపత్యపోరు ఎక్కువైందని, దీనితో ఒకరిపై మరొకరు పైచేయి సాధించేందుకు పోటీ పడుతున్నారని తెలుస్తున్నది. ప్రతినిత్యం మీడియాలో ఉండేందుకు తీవ్రంగా కష్టపడుతున్నారనే కామెంట్స్ వస్తున్నాయి. ఒకరు ఉదయం ప్రెస్‌మీట్ పెడితే, మరొకరు సాయంత్రం చిట్‌చాట్ చేస్తున్నారని, ఒకరు ట్వీట్ చేస్తే, మరొకరు ప్రెస్‌నోట్ విడుదల చేస్తుండటం ఆసక్తికరంగా మారింది. కేసీఆర్ కంట్రోల్ చేయక పోవడం వల్లే నేతలు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారనే టాక్ వినిపిస్తున్నది.

కేసీఆర్ మౌనం వల్లే సమస్యలు?

ప్రతిపక్ష నేతగా కేసీఆర్ పార్టీని పట్టించుకోకపోవడంతోనే సొంత పార్టీ లీడర్లు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నట్టు విమర్శలున్నాయి. లీడర్ల మాటలు ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టినట్టు ఉన్నా కేసీఆర్ పట్టించుకోకపోవడం సరికాదనే అభిప్రాయాలున్నాయి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి సుమారు పది నెలలు అవుతున్నది. ఇప్పుడైనా ఆయన మౌనం వీడి, ప్రతిపక్ష పాత్రలో పార్టీని నడిపించాలని, లేకపోతే పార్టీ మనుగడకే సమస్య వచ్చే ప్రమాదం ఉందని చర్చ జరుగుతున్నది.

Advertisement

Next Story

Most Viewed