టీ.బీజేపీలో ముదురుతున్న ముసలం.. కీలక సమయంలో అలిగిన ఏలేటి

by Gantepaka Srikanth |
టీ.బీజేపీలో ముదురుతున్న ముసలం.. కీలక సమయంలో అలిగిన ఏలేటి
X

దిశ, తెలంగాణ బ్యూరో: బీజేపీలో ముసలం మరింత ముదురుతున్నది. ఇప్పటికే వర్గ పోరుతో నేతల మధ్య దూరం పెరిగి ఎవరికి వారే యమునా తీరు అన్నట్లుగా ఉన్నారు. ఈ తరుణంలో బీజేపీ వరద ముంపు ప్రాంతాల పర్యవేక్షణకు బృందాల ఏర్పాటు మరో వివాదానికి కారణమైంది. వరద బాధితులను పరామర్శించేందుకు వెళ్లాలని ఆ పార్టీ రాష్ట్ర నాయకత్వం మూడు రోజుల క్రితం నిర్ణయం తీసుకుంది. రెండు బృందాలుగా విడిపోయి బాధితులను పరామర్శించాలని నిర్ణయించింది. ఓ బృందానికి కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్, మరో బృందానికి మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ నేతృత్వం వహిస్తారని అనౌన్స్ చేసింది. అయితే పార్టీ తీసుకున్న డెసిషన్‌తో బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి అలక బూనినట్లు సమాచారం. వరద బాధిత ప్రాంతాల పర్యవేక్షణకు తనకు అధ్యక్షత ఇవ్వకపోవడమే అలకకు కారణమని తెలుస్తున్నది. అందుకే వరద ముంపు బాధితుల పరామర్శకు ఏలేటి గైర్హాజరైనట్లు చర్చ జరుగుతున్నది.

ప్రొటోకాల్ సైతం పట్టించుకోలేదని..

ఫ్లోర్ లీడర్‌గా ఉన్న తనకు నేతృత్వ బాధ్యతలు ఇవ్వకపోవడంపై ఏలేటి గుర్రుగా ఉన్నట్లు తెలుస్తున్నది. ఈటల బృందంలో సభ్యుడిగా చేర్చడంపై ఆయన అనుచరులు అభ్యంతరం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఫ్లోర్ లీడర్‌గా అసెంబ్లీలో గళమెత్తే బాధ్యత ఏలేటిపై ఉండగా ఆయనకు నేతృత్వం ఇవ్వకపోవడం ఏంటని వారు ప్రశ్నిస్తున్నారు. ఎమ్మెల్యేలందరినీ ఓ బృందంగా ఏర్పాటు చేసి ఏదైనా ఒక రూట్‌లో ఫీల్డ్ విజిట్‌కు అవకాశం కల్పించినా బాగుండేదని వారు అభిప్రాయ పడుతున్నారు. కనీసం ఎల్పీ నేత అనే ప్రొటోకాల్‌నూ పార్టీ పట్టించుకోలేదని ఆయన అనుచరులు ఆగ్రహంతో ఉన్నట్లు సమాచారం.

విజిట్‌కు రామారావు పాటిల్ సైతం దూరం

ముంపు ప్రాంతాల విజిట్ బృందం బాధ్యతలు అప్పగించని విషయాన్ని ఏలేటి పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లినట్లు ఆయన వర్గీయులు చెబుతున్నారు. అయినా హైకమాండ్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాలేదని తెలుస్తున్నది. వరద ముంపు ప్రాంతాల పరిశీలనకు ఏలేటితో పాటు ఎమ్మెల్యే రామారావు పాటిల్ సైతం దూరంగా ఉన్నారు. ఇప్పటికే నేతల మధ్య సమన్వయం లేక సతమతమవుతున్న పార్టీకి వరద బాధితుల పరామర్శ కొత్త తలనొప్పులు తెచ్చిపెట్టినట్లు అయ్యింది. అసంతృప్తితో ఉన్న ఏలేటికి రాష్ట్ర నాయకత్వం నచ్చజెప్పి సమన్వయంతో ముందుకెళ్లేలా చర్యలు తీసుకుంటుందా? లేక లైట్ తీసుకుంటుందా? అనేది వేచి చూడాల్సి ఉంది.

Advertisement

Next Story