ఓట్లు లక్ష ఓటరుకు రూ.లక్ష..? అసలు టార్గెట్ అదే..​

by Nagaya |   ( Updated:2022-10-24 03:49:20.0  )
ఓట్లు లక్ష ఓటరుకు రూ.లక్ష..? అసలు టార్గెట్ అదే..​
X

దిశ, తెలంగాణ బ్యూరో : మునుగోడు ఉపఎన్నిక రాజకీయం రసవత్తరంగా సాగుతోంది.. అయ్యా.. బాబ్బాబు అంటూ రాజకీయ నాయకులందరూ మునుగోడు ఓటర్ల చుట్టూనే తిరుగుతున్నారు. ఓటర్ల మనసు గెలుచుకునేందుకు, ఓటు బ్యాంకుగా మార్చుకోవడానికి పడరాని పాట్లు పడుతున్నారు. మునుగోడు ఉప ఎన్నిక అధికార టీఆర్ఎస్ కు, ప్రతిపక్ష బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు ఎంతో ప్రతిష్టాత్మకంగా మారింది. భవిష్యత్ ఎన్నికలకు ఈ ఉప ఎన్నిక కీలకం కావటంతో అందరి ఫోకస్ దీనిపైనే ఉంది. ఈ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రధాన పార్టీలన్నీ ప్రతి ఒక్క ఓటును కీలకంగా భావిస్తున్నాయి. తమకు విజయాన్ని అందించే ఏ ఒక్క అంశాన్ని కూడా వదులుకోవద్దనే కోణంలో శతవిధాలా ప్రయత్నిస్తున్నాయి. ఓటర్ల వద్దకు వెళ్లి తమకు ఓటు ఎందుకు వేయాలి? పక్క వారికి ఎందుకు వెయ్యకూడదు? తమ పార్టీకి ఓటేస్తే ఏమొస్తుంది? పక్క పార్టీకి ఓటేస్తే ఏం నష్టం జరుగుతుంది? వంటి అంశాలను చెప్పడంతో పాటు కులాల వారీగా కూడా ఓటుబ్యాంకు రాజకీయాలు చేస్తున్నారు. మందు, విందు, నగదు పంపిణీ, బహుమతులు ఇవ్వటం వంటి అనేక చర్యలకు పాల్పడుతున్నారు. దీంతో మునుగోడులో ఆసక్తికరంగా ప్రలోభాల పర్వం కొనసాగుతుంది.

మునుగోడుతో కష్టాలే..

మునుగోడుపై మూడు పార్టీలు ఫోకస్​పెట్టారు. అందులో టీఆర్ఎస్ పార్టీ ప్రతి ఓటరు పైన ప్రత్యేకమైన దృష్టి పెట్టి మునుగోడులో విజయం కోసం శతవిధాలా ప్రయత్నిస్తుంది. వాస్తవానికి హుజూర్‌నగర్‌, దుబ్బాక, నాగార్జునసాగర్‌, హుజురాబాద్‌ ఉప ఎన్నికలు నువ్వానేనా అన్నట్లు జరిగినా.. సాధారణ ఎన్నికలకు కొద్దిరోజులకు ముందు జరగబోతున్న మునుగోడు ఉపఎన్నిక.. మరింత కీలకంగా మారింది. పోటీలో నిలిచే అభ్యర్థుల కంటే వారిని బరిలోకి దించే పార్టీలకు, అధిష్ఠానాలకు ఈ ఎన్నికలు కీలకం కానున్నాయ్. మునుగోడు బైపోల్‌ ఫలితం రాష్ట్ర రాజకీయాల్లో కీలక మార్పులు తీసుకువచ్చే అవకాశం ఉంటుంది. రాజీనామా చేసి బీజేపీలో చేరిన రాజగోపాల్‌రెడ్డికి ఈ సీటు గెలుచుకోవడం అత్యంత అవసరమైనా.. ఆయన కంటే కూడా బీజేపీకి మరింత ప్రతిష్టాత్మకం. రాష్ట్రంలో అధికారంలోకి రావాలని కంకణం కట్టుకున్న బీజేపీ మునుగోడులో గెలిచి, ఇక రాబోయేది డబుల్‌ ఇంజన్‌ సర్కారే అని జనాల్లోకి తీసుకెళ్లాలని భావిస్తోంది. టీఆర్ఎస్‌కు కూడా ఈ ఉపఎన్నిక అత్యంత కీలకం. అధికారంలో ఉండి ఉప ఎన్నికల్లో రెండుసార్లు ఎదురుదెబ్బ తిన్న కారు పార్టీకి ఈ ఎన్నిక సవాల్‌ కానుంది. ఇక మునుగోడు నియోజకవర్గం కాంగ్రెస్‌కు కంచుకోటలాంటిది. పైగా సిట్టింగ్ సీట్‌ ! అంతర్గత కుమ్ములాటలతో పార్టీ భవిష్యత్‌ ప్రశ్నార్థకంగా మారుతున్న వేళ అధికారం రేసులో తాము ఉన్నామని సంకేతాలు పంపాలంటే కోమటిరెడ్డి కుటుంబాన్ని ఓడించి విజయం సాధించాల్సిన పరిస్థితి.

టార్గెట్​ లక్ష

2014 ఎన్నికల్లో మునుగోడు నుంచి గెలిచినప్పటి నుంచీ రాజగోపాలరెడ్డి కాంగ్రెస్ పార్టీకి దూరంగానే ఉంటూ వచ్చారు. ఇప్పుడు బీజేపీలో చేరడం, పదవికి రాజీనామా చేయడం ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ ఉప ఎన్నిక అన్ని పార్టీలకు కీలకంగా మారిన నేపథ్యంలో.. ఒక్కో పార్టీ కనీసం లక్ష ఓట్ల కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. మొత్తం 2.38 లక్షల ఓట్లు ఉంటే.. ఈ ఉప ఎన్నికలో 90 శాతం ఓటింగ్​ అవుతుందని భావిస్తున్నారు. గతంలో వరుసగా తీసుకుంటే 2014 అసెంబ్లీ ఎన్నికల్లో 82.01 శాతం, 2018 ఎన్నికల్లో 91.07 శాతం ఓటింగ్​ అయింది. ఈసారి కొంత పెరుగుతుందని భావిస్తున్నారు. 2018 ఎన్నికల్లో ఆయనకు 99 వేల ఓట్లు వచ్చాయి. ఈసారి కూడా ఏ అభ్యర్థి అయినా లక్ష ఓట్లు సంపాదించుకుంటే గెలుస్తారని అంచనా వేస్తున్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో టీఆర్ఎస్​, కాంగ్రెస్​ మధ్యే ఫైట్​ జరిగింది. అప్పుడు బీజేపీకి 12 వేల ఓట్లు వచ్చాయి. కానీ, ఈసారి పోటీపడే అభ్యర్థుల సంఖ్య పెరిగింది. టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీతో పాటుగా సామాజిక వర్గాల వారీగా అభ్యర్థులు రంగంలోకి దిగారు. బీఎస్పీ, కేఏ పాల్, జన సమితితో పాటుగా కొంతమంది స్వతంత్రులు కూడా పోటీ చేస్తున్నారు. దీంతో ఓట్లు చీలిపోతాయని స్పష్టమవుతోంది. దీంతో లక్ష ఓట్లు సంపాదించుకుంటే గెలిచినట్టేనని అభ్యర్థులు వ్యూహాలు వేస్తున్నారు.

లక్ష ఓట్ల కోసం లక్షన్నరకు తాయిలాలు

లక్ష ఓట్ల కోసం లక్షన్నర మంది ఓటర్లకు ఈసారి తాయిలాలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. లక్షన్నర మంది ఓటర్లను టార్గెట్‌గా పెట్టుకుంటే అందులో లక్ష ఓట్లు తమకు పోలయ్యేలా ప్లాన్​చేసుకుంటున్నారు. ప్రధాన పార్టీలన్నీ లక్షన్నర మంది ఓటర్లకు తాయిలాలు పంపిణీ చేయాలని చూస్తున్నాయి. అధికార టీఆర్ఎస్​పార్టీ ఓవైపు సంక్షేమ పథకాల ఆశ చూపిస్తూనే.. మరోవైపు భారీగా ప్రలోభాల పర్వానికి దిగుతుందని ఆరోపణలున్నాయి. ఇప్పటికే కోట్ల రూపాయలు అధికారులకు చిక్కుతున్నాయి. కొత్త కొత్తగా పంపిణీ చేస్తున్నారు. ఇప్పటి వరకు కేవలం లీడర్ల వరకే పంపిణీ ప్రక్రియ పూర్తయినట్లు మునుగోడులో టాక్. బీజేపీ అభ్యర్థి రాజగోపాల్​రెడ్డి తనకు గత ఎన్నికల్లో వచ్చిన 97,239 వేల ఓట్ల కంటే అదనంగా తెచ్చుకోవాలని చూస్తున్నారు. అప్పుడు కాంగ్రెస్​ మెజార్టీ 22 వేలు. ఈసారి లక్ష ఓట్ల టార్గెట్ గా పని చేస్తున్నారని, ఒక్కో ఓటరుకు లక్ష రూపాయల చొప్పున లక్ష ఓట్ల టార్గెట్ గా వెయ్యి కోట్లు ఖర్చు చేయడానికి సిద్ధంగా ఉన్నారని ఇప్పటికే అధికార టీఆర్ఎస్​ఆరోపిస్తుంది. కానీ, అంతకు మించి టీఆర్ఎస్​ పంపిణీ చేసేందుకు సిద్ధంగా ఉందని ఎదురుదాడి కూడా చేస్తున్నారు. ఇదే సమయంలో కాంగ్రెస్​ కూడా లక్ష నుంచి లక్షన్నర ఓట్ల కోసం నగదు పంపిణీ చేస్తుందని సొంత పార్టీ నేతలే చెప్పుతుండటం గమనార్హం.

ఆఖరి మూడు రోజుల్లోనే..!

ప్రస్తుతం ప్రచార పర్వాన్ని హీటెక్కిస్తున్న పార్టీలు.. ఓటర్లకు తాయిలాలు మాత్రం ఆఖరి మూడు రోజుల్లోనే పంపిణీ చేయాలని భావిస్తున్నారు. ప్రస్తుతం ప్రచారానికి వచ్చే వారికి మాత్రమే రోజుకు కొంత ఇస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. కానీ, ఆఖరి మూడు రోజుల్లో అభ్యర్థులు ఓటర్ల కోసం అసలైన ఆయుధాలను బయటకు తీస్తారని అధికార వర్గాల్లోనూ చర్చ జరుగుతోంది. టీఆర్ఎస్​ పార్టీ ఇప్పటికే గ్రామాల్లో కవర్లు తయారు చేసిందని, బీజేపీ కూడా అదే పనిలో ఉందని, ఈ రెండు పార్టీలు నగదు తో పాటుగా బంగారం కూడా పంచేందుకు సిద్ధంగా ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. ఇక, కాంగ్రెస్​ కూడా ఆఖరి రోజుల్లో లక్ష నుంచి లక్షన్నర ఓట్ల కోసం రూ.20 కోట్ల వరకు ఖర్చు పెడుతుందని టాక్.

ఇవి కూడా చదవండి : మునుగోడులో భారీగా సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు.. రంగంలోకి కేంద్ర బలగాలు!

ఇవి కూడా చదవండి : ముగ్గురు మూడు రోజులు.. మునుగోడుకు అగ్రనేతల ఫినిషింగ్ టచ్‌లు

Advertisement

Next Story

Most Viewed