మునుగోడులో భారీగా సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు.. రంగంలోకి కేంద్ర బలగాలు!

by GSrikanth |   ( Updated:2022-10-24 03:48:40.0  )
మునుగోడులో భారీగా సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు.. రంగంలోకి కేంద్ర బలగాలు!
X

దిశ, తెలంగాణ బ్యూరో: పోలింగ్ తేదీ దగ్గర పడుతుండడంతో ఏర్పాట్లపై రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి దృష్టి సారించారు. స్వయంగా మునుగోడు నియోజకవర్గంలో పర్యటించి క్షేత్రస్థాయిలోని పరిస్థితులను అధ్యయనం చేశారు. పోలింగ్ బూత్‌ల ఏర్పాటు మొదలు సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇవ్వడం వరకు అన్ని అంశాలపై సమీక్ష నిర్వహించారు. పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా, పారదర్శకంగా, స్వేచ్ఛగా జరిగేందుకు తీసుకోవాల్సిన చర్యలపై జిల్లా ఎన్నికల అధికారి, ఎస్పీ తదితరులతో సమావేశం నిర్వహించారు. రాష్ట్ర పోలీసు భద్రతతో పాటు సుమారు 3,350 మందితో కూడిన కేంద్ర పారా మిలిటరీ బలగాలను రంగంలోకి దించినట్లు సీఈఓ వికాస్ రాజ్ మీడియాకు వివరించారు.

మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నికకు మొత్తం 289 పోలింగ్ బూత్‌లను ఏర్పాటు చేశామని, అందులో 105 సమస్యాత్మకమైనవిగా గుర్తించి తగిన చర్యలు తీసుకున్నట్లు వివరించారు. ఎక్కువగా చౌటుప్పల్ మండలంలో 22 ఉన్నాయని, ఆ తర్వాతి స్థానంలో మర్రిగూడ, చండూర్ మండలాల్లో 17 చొప్పున, నారాయణపురం, గట్టుప్పల్‌ మండలాల్లో 12 చొప్పున, నాంపల్లి మండలంలో 10 సమస్యాత్మక బూత్‌లు ఉన్నాయన్నారు. చౌటుప్పల్‌లో ఏకంగా తొమ్మిది గ్రామాలను సమస్యాత్మకమైనవిగా గుర్తించామని, మునుగోడు, చండూర్ మండలాల్లో సైతం 8 చొప్పున గ్రామాలు కొంచెం ఇబ్బందికరమైనవే ఉన్నాయన్నారు. ఇక్కడ రాష్ట్ర, కేంద్ర పోలీసు బలగాలను ఎక్కువ సంఖ్యలో నియమిస్తామన్నారు.

ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనలు జరుగుతున్నట్లు గుర్తించామని, ఇప్పటివరకు 12 కేసుల్ని నమోదు చేశామని సీఈఓ వికాస్ రాజ్ తెలిపారు. నియోజకవర్గం చుట్టూ సరిహద్దుల్లో స్పెషల్ చెక్‌పోస్టుల్ని ఏర్పాటుచేశామని, కరెన్సీ కట్టలు గ్రామాల్లోకి రవాణా కాకుండా పటిష్టమైన చర్యలు తీసుకున్నామని, అయినా వాహనాల్లో వస్తున్నవాటిని పట్టుకుంటున్నట్లు తెలిపారు. ఇప్పటివరకు సుమారు రూ. 2.49 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. ఎక్కడికక్కడ కేంద్ర ఎన్నికల సంఘం తరఫున నిఘా బృందాలు తిరుగుతున్నాయని, కోడ్ ఉల్లంఘనలను ఉపేక్షించే ప్రసక్తే లేదని, ఈ విషయంలో కఠినంగా వ్యవహరించాల్సిందిగా జిల్లా అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినట్లు తెలిపారు.

పార్టీలు, ప్రత్యర్థుల మధ్య విమర్శలు, ఆరోపణలు పెరుగుతున్నాయని, దీనిని దృష్టిలో పెట్టుకుని 24 గంటలూ పనిచేసే హెల్ప్ లైన్ సెంటర్‌ (08681-2230198)ను ఏర్పాటు చేశామని, ఎలాంటి ఫిర్యాదులున్నా సంప్రదించవచ్చని తెలిపారు. పోలింగ్ ప్రక్రియను ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలన్న లక్ష్యంతో 14 ఫ్లైయింగ్ స్క్వాడ్‌లు, 14 స్టాటిక్ సర్వియలెన్స్ టీమ్‌లు, 14 వీడియో నిఘా టీమ్‌లను నెలకొల్పినట్లు తెలిపారు. నియోజకవర్గవ్యాప్తంగా నిఘాను ముమ్మరం చేయాలన్న ఉద్దేశంతో ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనలను పసిగట్టడానికి ఈ ఏర్పాట్లు చేసినట్లు వివరించారు.

నియోజకవర్గంలో మద్యం వినియోగం ఎక్కువగా జరుగుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, ఓటర్లను ప్రలోభ పెడుతున్నట్లు ఫిర్యాదులు రావడంతో ఎక్సయిజ్ శాఖ నుంచి అదనంగా 128 మంది సిబ్బందిని రంగంలోకి దించినట్లు తెలిపారు. పదుల సంఖ్యలో బెల్టు షాపులను క్లోజ్ చేశామని పేర్కొన్న సీఈఓ ఇప్పటివరకు 58 కేసులు నమోదు చేసి 24 మందిని అరెస్టు చేసినట్లు వివరించారు.

పోలింగ్ తేదీ దగ్గర పడుతున్నందున ఎలాంటి అవాంతరాలు, అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నట్లు వికాస్ రాజ్ తెలిపారు. ప్రతీ పోలింగ్ కేంద్రంలో ఒక వీవీప్యాట్ (ఓటు ఎవరికి వేసిందీ నిర్ధారించుకునేందుకు స్లిప్‌ను ప్రింట్ చేసే మిషన్)తో పాటు మూడు ఈవీఎంలు ఉంటాయని తెలిపారు. ఒక్కో ఈవీఎంలో 16 మంది అభ్యర్థుల పేర్లకు మాత్రమే అవకాశం ఉన్నందున బరిలో మొత్తం 47 మంది క్యాండిడేట్లు ఉన్నందున మూడు ఈవీఎంలను ప్రతీ బూత్‌లో పెట్టాల్సి వచ్చిందన్నారు. గతంలో సింగిల్ ఈవీఎంతో ఎన్నికల నిర్వహణపై సిబ్బందికి అనుభవం ఉన్నదని, మూడింటిని హ్యాండిల్ చేయడానికి స్పెషల్ ట్రెయినింగ్ ఇచ్చినట్లు తెలిపారు.

టెక్నికల్ సమస్యలను దృష్టిలో పెట్టుకుని 35% మేర ఈవీఎంలు, వీవీప్యాట్‌లను జిల్లా ఎన్నికల అధికారి పర్యవేక్షణలో రిజర్వులో ఉంచినట్లు తెలిపారు. పోస్టల్ బ్యాలెట్ అవసరాలతో పాటు పోలింగ్ బూత్‌ల దగ్గర గోడలకు అంటించే నమూనా బ్యాలెట్ పత్రాల ముద్రణ ప్రక్రియ పూర్తయినట్లు వివరించారు.

ఇవి కూడా చదవండి : ఓట్లు లక్ష ఓటరుకు రూ.లక్ష..? అసలు టార్గెట్ అదే..​

Advertisement

Next Story

Most Viewed