BSP అధికారంలోకి వస్తే.. RS ప్రవీణ్ కుమార్ CM: మాయావతి కీలక ప్రకటన

by Satheesh |
BSP అధికారంలోకి వస్తే.. RS ప్రవీణ్ కుమార్ CM: మాయావతి కీలక ప్రకటన
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాజ్యాంగాన్ని మార్చాలన్న కేసీఆర్‌ను రానున్న ఎన్నికల్లో ఓడించాలని ప్రజలకు బీఎస్పీ చీఫ్ మాయావతి పిలుపునిచ్చారు. తెలంగాణలో బీఎస్పీ ప్రభుత్వం ఏర్పాటైతే ముఖ్యమంత్రి అయ్యేది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అని స్పష్టం చేశారు. అంబేద్కర్ పేరుతో కేసీఆర్ రాజకీయాలు చేస్తున్నారని, సచివాలయానికి పేరు పెట్టుకుని పొలిటికల్ మైలేజ్ పొందే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు.

పేద దళితులకు మూడెకరాల సాగుభూమిని ఇచ్చే స్కీమ్‌ను ఉత్తరప్రదేశ్‌లో తాము సంపూర్ణంగా అమలుచేశామని, దాన్ని కాపీకొట్టిన కేసీఆర్ తూతూ మంత్రంగా భావించి చివరకు అటకెక్కించారని ఆరోపించారు. తెలంగాణ భరోసా సభ పేరుతో సరూర్‌నగర్‌లో ఆదివారం జరిగిన బహిరంగసభకు ముఖ్య అతిథిగా వచ్చిన ఆమె ప్రసంగిస్తూపై వ్యాఖ్యలు చేశారు.

స్వార్థ రాజకీయాల కోసం, ఓట్ల కోసం తెలంగాణ సచివాలయానికి అంబేడ్కర్ పేరు పెట్టుకున్నారని, దళితులకు దగ్గర కావడానికి ఆయన విగ్రహాన్ని పెట్టారని విమర్శించారు. తెలంగాణలో బీఎస్పీ బలపడుతుండడాన్ని కేసీఆర్ సహించలేకపోతున్నరని, ఆ భయంతోనే అంబేడ్కర్ పేరుతో పొలిటికల్ డ్రామాలకు తెర లేపారని అన్నారు. అంబేడ్కర్‌ను రాజకీయాల కోసం వాడుకోవడం ఆయనకే చెల్లిందన్నారు.

కేసీఆర్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, రాజ్యాంగాన్ని మార్చాలని కామెంట్ చేసిన ఆయనకు రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బుద్ధి చెప్తారని అన్నారు. నిరుద్యోగ భృతి లాంటి హామీలతో ఎన్నికల సమయంలో దళితులకు దగ్గర కావడం, అంబేడ్కర్ పేరు చెప్పుకుని ప్రజలను మోసగించడం చాలా పార్టీలకు రొటీన్‌ ప్రాక్టీసుగా మారిందని ఆరోపించారు.

ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌ను ప్రత్యేకంగా అభినందించిన మాయావతి.. తెలంగాణలో బీఎస్పీ ప్రభుత్వం ఏర్పడితే ముఖ్యమంత్రి అయ్యేది ఆర్ఎస్ ప్రవీణ్ కుమారేనని సభా వేదికగా ప్రకటించారు. ప్రజలకు సేవ చేయడం కోసమే ఆయన తన ఐపీఎస్ ఉద్యోగానికి రాజీనామా చేశారని, ఇప్పుడు బీఎస్పీ తరఫున ప్రజల కోసం పాటుపడుతున్నారని అన్నారు. తమ ప్రభుత్వం ఏర్పడితే నిరుద్యోగ భృతి అవసరమే ఉండదని, ఉద్యోగాల భర్తీయే ఉంటుందన్నారు. తెలంగాణకు చెందిన ఐఏఎస్ అధికారి జి.కృష్ణయ్యను హత్య చేసిన ఆనంద్‌మోహన్‌ను బిహార్ ప్రభుత్వం విడుదల చేస్తే కేసీఆర్ మౌనంగా ఉన్నారని మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం మొట్టమొదటిసారిగా పార్లమెంటులో మద్దతు తెలిపింది బీఎస్పీ పార్టీయేనని ఆమె గుర్తుచేశారు.

ఉత్తరప్రదేశ్‌లో బీఎస్పీ అధికారంలో ఉన్నంతకాలం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు మైనార్టీలకు అన్ని రకాల ప్రాధాన్యత ఇచ్చిందని, సమానమైన అధికారాలు ఇచ్చిందని గుర్తుచేశారు. తెలంగాణలో కూడా అలాంటి పాలననే అందిస్తామన్నారు. కాంగ్రెస్ పార్టీ కారణంగానే బహుజనులకు కష్టాలు వచ్చాయని, న్యాయ శాఖ మంత్రిగా అనాడు అంబేడ్కర్ చేసిన సూచనలను నెహ్రూ పట్టించుకోలేదన్నారు. అందువల్లనే అంబేడ్కర్ తన మంత్రి పదవికి రాజీనామా చేశారన్నారు. ఇప్పటికిప్పుడు బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు జరిగితే దేశమంతా బీఎస్పీయే గెలుస్తుందని, ఈవీఎం పద్ధతిలో జరిగితే ఆధిపత్య పార్టీలదే విజయమవుతుందన్నారు.

Advertisement

Next Story

Most Viewed