హైడ్రా కూల్చివేతలు మళ్లీ ప్రారంభం.. ఇప్పటికే 50 మందికి నోటీసులు!

by Gantepaka Srikanth |
హైడ్రా కూల్చివేతలు మళ్లీ ప్రారంభం.. ఇప్పటికే 50 మందికి నోటీసులు!
X

దిశ, తెలంగాణ బ్యూరో: ‘హైడ్రా(Hydra) నాలుగు రోజులపాటు ఆక్రమణలను కూల్చింది. సీఎం(CM) ప్రకటన రాగానే చల్లబడింది అని సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారు. కానీ సైలెంట్ కాలేదు.. చల్లబడలేదు.. మళ్లీ కూల్చివేతలకు హైడ్రా(Hydra) సిద్ధమవుతోంది. అందుకు సంబంధించిన కార్యాచరణను రూపొందించింది. చెరువులు, కుంటలు, నీటి వనరులతో పాటు పార్కులు, రోడ్లు, ప్రభుత్వ స్థలాల్లో నిర్మాణాలపై ప్రత్యేక ఫోకస్ పెట్టింది. ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలోని హెచ్ఎండీఏ(HMDA), జీహెచ్ఎంసీ(GHMC), మున్సిపాలిటీలు, ఇతర ప్రభుత్వ సంస్థలకు చెందిన స్థలాలపై హైడ్రా దృష్టి పెట్టింది. ప్రభుత్వ స్థలాలను ఎక్కడికక్కడ ఆక్రమించుకుని నిర్మాణాలు చేపట్టారు. వాటన్నింటిని ఎలాగైనా స్వాధీనం చేసుకోవగడానికి కసరత్తు చేస్తోంది.

అనుమతులను అతిక్రమిస్తే..

చెరువుల పరిరక్షణలో భాగంగా ఎఫ్‌టీఎల్(FTL), బఫర్ జోన్ల(Buffer Zones)లోని నిర్మాణాలపై ప్రభుత్వం వెనక్కి తగ్గింది. అయితే పార్కులు, రోడ్లు, ప్రభుత్వ స్థలాల్లోని నిర్మాణాలకు ప్రభుత్వ సంస్థల నుంచి అనుమతులుంటే లీగల్ ప్రొసీడ్ కావాలని హైడ్రా నిర్ణయించింది. అధికారులిచ్చినా అనుమతులకు విరుద్దంగా నిర్మాణాలు చేపట్టినా, అమీన్ పూర్ మండలంలోని కిష్టారెడ్డి పేట్ తరహాలో అనుమతులు తీసుకునే ముందు ఒక సర్వే భూమి చూపించి, వేరే సర్వే నెంబర్‌లోని భూమిలో చేపట్టిన నిర్మాణాలకు నోటీసులు ఇవ్వాలని హైడ్రా నిర్ణయించింది. ఇక శివారు మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లలో అక్రమ నిర్మాణాలను సైతం హైడ్రా కూల్చనుంది.

50 మందికి నోటీసులు..

పార్కులు, రోడ్లు, ప్రభుత్వ స్థలాల్లోని నిర్మాణాలు చేపట్టిన 50 మందికి హైడ్రా నోటీసులు జారీచేసింది. ఈ నిర్మాణాలపై వివరణ ఇవ్వాలని 7 రోజుల కాలపరిమితితో మొదటి నోటీసు, తర్వాత 15 రోజుల కాలపరిమితితో మరో నోటీసులు జారీచేశారు. అయినా సదరు నిర్మాణదారుడి నుంచి స్పందన రాకుంటే కూల్చడమే తరువాయి అని హైడ్రా అధికారులు చెబుతున్నారు. ఒక వేళ సకాలంలో స్పందించినా..సమాధానానికి హైడ్రా సంతృప్తి చెందకపోయినా చర్యలు తప్పవని హైడ్రా అధికారులు హెచ్చరిస్తున్నారు.

బెంగుళూరుకు హైడ్రా బృందం..

చెరువుల సుందరీకరణను అధ్యయనం చేయడానికి హైడ్రా అధికారులు గురువారం బెంగుళూరు వెళ్లనున్నారు. బెంగుళూరులో ఇన్ఫోసిస్ చెరువుతోపాటు మరో నాలుగు చెరువుల సుందరీకరించిన తీరును పరిశీలించనున్నారు. దీంతోపాటు లేక్స్ మాన్ ఆఫ్ ఇండియా ఆనంద్ మల్లిగవాడేతో సమావేశం కానున్నారు. చెరువుల సుందరీకరణలో తీసుకున్న చర్యలు, పాటించిన మెళకువలు, ఆయా ప్రభుత్వ శాఖల సహకారం, ప్రజల భాగస్వామ్యం గురించి చర్చించనున్నారు. ఓఆర్ఆర్ పరిధిలోని చెరువుల పరిరక్షణ, సుందరీకరణ, గొలుసుకట్టు చెరువుల పునరుద్ధరణ వంటి అంశాలపై ఆనంద్ సలహాలు తీసుకోనున్నారు.

Advertisement

Next Story

Most Viewed