ఎస్టీపీ లేని బహుళ అంతస్తుల భవనాలపై హైడ్రా దృష్టి

by Mahesh |
ఎస్టీపీ లేని బహుళ అంతస్తుల భవనాలపై హైడ్రా దృష్టి
X

దిశ, తెలంగాణ బ్యూరో: చెరువుల పరిరక్షణలో హైడ్రా(HYDRAA) మరో అడుగు ముందుకేయనుంది. అందుకు నయా పంథా ఎంచుకుంది. చెరువుల ఆక్రమణలపై మొదట్లో దూకుడుగా వ్యవహరించిన హైడ్రా రియల్ ఎస్టేట్ వ్యాపారుల లాబియింగ్, ప్రభుత్వం నిర్ణయం, సీఎం రేవంత్ రెడ్డి ప్రటనల నేపథ్యంలో కూల్చివేతలపై నిర్ణయం మార్చుకుంది. చెరువుల, ఇతర నీటి వనరుల్లోని నిర్మాణాలకు ప్రభుత్వ సంస్థల అనుమతి ఉంటే వాటికి జోలికెళ్ల బోమని హైడ్రా ప్రకటించిన విషయం తెలిసిందే. అనుమతిలేని భవనాల్లోనూ నివాసం ఉంటే పట్టించుకో బోమని, అదే వాణిజ్య కార్యకలాపాలు నిర్వహిస్తే కూల్చివేస్తామని స్పష్టంగా హైడ్రా వెల్లడించింది. అయితే ఇక నుంచి ప్రభుత్వ సంస్థల అనుమతులతో నిర్మించినా వాటికి ఎస్టీపీ(STP) లేకపోతే హైడ్రా చర్యలకు ఉపక్రమించనుంది. అనుమతుల విషయంలో సడలింపిచ్చిన హైడ్రా కాలుష్యం విషయంలో మాత్రమే తగ్గేది లేదని తేల్చి చెబుతోంది.

ఓఆర్ఆర్ పరిధిలో

ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలో 549 చెరువులకు సర్వే నిర్వహించడం తో పాటు ఎఫ్టీఎల్, బఫర్ జోన్లను గుర్తించి 411 చెరువులకు ప్రిలిమినరీ నోటిఫికేషన్ ఇచ్చారు. 138 చెరువులకు ఫైనల్ నోటిఫికేషన్ ఇచ్చారు. త్వరలోనే అన్ని చెరువులకు ఫైనల్ నోటిఫికేషన్ ఇవ్వడానికి చర్యలు అధికారులు తీసుకోనున్నారు. వీటితోపాటు ప్రభుత్వ ఆస్తులకు సంబంధించిన జియో ట్యాగింగ్ ప్రక్రియ కొనసాగుతోంది.

చెరువుల కాలుష్యంపై..

ఓఆర్ఆర్(ORR) పరిధిలోని చెరువుల కాలుష్యంపై హైడ్రా దృష్టి సారించింది. చెరువులను ఆక్రమించి లేక్ వ్యూ పేరుతో వ్యాపారాలు చేస్తున్న బడా నిర్మాణ సంస్థలు తమ బహుళ అంతస్తుల భవనాలకు సంబంధించిన మురుగునీటిని యథేచ్చగా చెరువుల్లోకి వదిలేస్తున్నాయి. కోమటికుంట, మైసమ్మ చెరువు, ఐడీఎల్ చెరువు, అంబీర్, ఖాజాగూడ చెరువులను కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్ బులిటీ(సీఎస్ఆర్) పేరుతో అభివృద్ధి చేస్తామని తీసుకున్న సంస్థలే కాలుష్యకారకాలుగా మారుస్తున్నాయని పర్యావరణ ప్రేమికులు, స్వచ్ఛంద సంస్థలు ఆరోపిస్తున్నాయి. ఈ నిర్మాణదారులు బహుళా అంతస్తులకు ఎస్టీపీలు నిర్మించాలని నిబంధనల్లో ఉన్న ఏ ఒక్కరూ పట్టించుకోవడం లేదు. సీఎస్ఆర్ కింద ఇచ్చిన చెరువులను జీహెచ్ఎంసీ అధికారులు, కాలుష్యం నివారణలో పీసీబీ అధికారులు పట్టించుకోవడం లేదు.

కర్ణాటక తరహాలో..

చెరువుల కాలుష్యాన్ని కర్ణాటక తరహాలో పరిష్కరించడానికి హైడ్రా కసరత్తు చేస్తోంది. చెరువుల్లోకి వస్తున్న మురుగును సీవరేజ్ ట్రీట్ మెంట్ ప్లాంట్(ఎస్టీపీ)ల ద్వారా చెరువులను నింపుతున్న విధానాన్ని, చెరువుల పునరుద్దరణకు బృహత్ బెంగళూరు మహానగర పాలిక (బీబీఎంపీ) అనుసరిస్తున్న విధానాలను హైడ్రా అధికారులను అధ్యయనం చేశారు. సుందరీకరణ తో పాటు చెరువులోకి మురుగు చేరకుండా పై భాగంలో కుంటలు ఏర్పాటు చేసి సిల్ట్ నుంచి నీటిని వేరు చేసే విధానాన్ని పరిశీలించారు.

పీసీబీ అధికారులతో..

చెరువుల కాలుష్యం పై కాలుష్య నియంత్రణ మండలి(PCB) అధికారులతో హైడ్రా కమిషనర్ ఏవీ.రంగనాథ్ (Hydra Commissioner AV Ranganath) సమావేశం కానున్నారు. చెరువుల కాలుష్యాన్ని నియంత్రించడానికి తీసుకోవాల్సిన చర్యలు, అనుసరించాల్సిన విధానాలపై పీసీబీ అధికారులతో కలిసి నిబంధనలు రూపొందించనున్నారు. ఒక వేళ ఇప్పటికే నిబంధనలు ఉంటే వాటి అమలు తీరును పరిశీలించిన తో పాటు ఆచరణలో పెట్టే అవకాశముంది.

ఒక్క భవనాన్నైనా..

అపార్ట్ మెంట్లకు సంబంధించిన మురుగునీటిని చెరువుల్లోకి పంపిస్తున్న వాటిపై హైడ్రా, పీసీబీ అధికారులను సర్వే చేయనున్నారు. ఆ సర్వే వచ్చిన నివేదిక ఆధారంగా ఒక్క భవనాన్నైనా సీజ్ చేసేవిధంగా హైడ్రా కసరత్తు చేస్తోంది. ఒక భవనంపై కఠిన చర్యలు తీసుకుంటే భవిష్యత్‌లో ఎస్టీపీలను నిర్మించుకోవడానికి అవకాశముందని అధికారులు భావిస్తున్నారు. కాలుష్యం విషయంలోనైనా హైడ్రా సీరియస్ గా వ్యవహరించాలని పర్యావరణ వేత్తలు, ఎన్జీఓలు కోరుతున్నారు.

Advertisement

Next Story