ఉస్మానియా, గాంధీ, నిలోఫర్ ఆస్పత్రుల చీఫ్ డైటీషియన్ల బదిలీ

by Sridhar Babu |
ఉస్మానియా, గాంధీ, నిలోఫర్ ఆస్పత్రుల చీఫ్ డైటీషియన్ల బదిలీ
X

దిశ , హైదరాబాద్ బ్యూరో : రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్పత్రులలో పని చేస్తున్న వైద్యులు, సిబ్బందితో పాటు పలు విభాగాల అధిపతుల బదిలీలతో రోగులు పడరాని పాట్లు పడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం గత నెలలో చేపట్టిన సాధారణ బదిలీలలో భాగంగా లాంగ్ స్టాండింగ్ ఉన్న వారిని ఇతర జిల్లాలకు బదిలీ చేసిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా నగరంలోని ఉస్మానియా, గాంధీ, నిలోఫర్ ఆస్పత్రులలో పని చేస్తున్న చీఫ్ డైటీషియన్లకు కూడా స్థాన చలనం కల్పించింది. అయితే బదిలీ అయిన వారి స్థానంలో కొత్త వారిని నియమించకపోవడంతో ఆయా ఆస్పత్రులలో డైట్ సప్లై లో ఇబ్బందులు ఏర్పడుతున్నాయి.

రోగులకు క్వాలిటీ, క్వాంటిటీ ఫుడ్ అందడం లేదనే ఆరోపణలు సైతం వినబడుతున్నాయి. ఉస్మానియా, గాంధీ, నిలోఫర్ ఆస్పత్రులకు ప్రతినిత్యం వేల సంఖ్యలో పేద రోగులు వైద్య పరీక్షలు, చికిత్సలకు వస్తుంటారు. వీరిలో అవసరమైన వారిని ఇన్ పేషంట్ గా చేర్చుకుని వైద్య సేవలతో పాటు ఆహారాన్ని అందిస్తుంటారు. రోగులకు ఉదయం అల్పాహారం, లంచ్, డిన్నర్ లలో ఆహారం ఎంత మోతాదులో ఇవ్వాలి, ఎలాంటి ఆహారం ఇవ్వాలనేది డైటీషియన్లు పరిశీలిస్తుంటారు. అంతేకాకుండా డైట్ సప్లై , డైట్ కౌన్సెలింగ్ (రోగులకు జీవన్ శైలి వ్యాధుల పట్ల అవగాహన కల్పించడం ), ప్రాపర్ డైట్ అడ్వైజ్ చేయడం వంటివి చేస్తుంటారు. అయితే బదిలీలతో డైట్ కాంట్రాక్టర్ పై నిఘా లోపం ఏర్పడి అవకతవకలు చోటు చేసుకునే అవకాశాలు ప్రభుత్వమే కల్పించినట్లు కాగా రోగులకు నాణ్యమైన ఆహారం సరఫరా ప్రశ్నార్ధకంగా మారింది.

డైట్ విద్యార్థుల శిక్షణ పై ప్రభావం...

నగరంలోని మూడు ప్రధాన ఆస్పత్రులలో చీఫ్ డైటీషియన్లను బదిలీ చేసి వారి స్థానంలో కొత్త వారిని నియమించకపోవడంతో డైట్ విభాగంలో కొత్తగా వచ్చిన బీఎస్సీ, ఎమ్మెస్సీ న్యూట్రీషియన్ విద్యార్థులకు శిక్షణ ఇచ్చే వారు లేకుండా పోయారు. సాధారణంగా అన్ని ప్రధాన ఆస్పత్రులలో విభాగాధిపతులతో పాటు ఇతర అసిస్టెంట్, అసోసియేట్ ప్రొఫెసర్లు, ఆర్ఎంఓలు, జూనియర్ డాక్టర్లు, సీనియర్ రెసిడెంట్ డాక్టర్స్ ఉంటారు. వీరంతా తాము పని చేస్తున్న విభాగాలలో రోగులకు సేవలందిస్తుంటారు. అయితే ఉస్మానియా, గాంధీ, నిలోఫర్ ఆస్పత్రులలో డిపార్ట్ మెంట్ ఆఫ్ డైటీటిక్స్ లలో చీఫ్ డైటీషియన్ పోస్టు ఒక్కటే ఉంది. తాజాగా జరిగిన బదిలీలో వీరు బదిలీ కావడం , కొత్తవారిని నియమించకపోవడంతో ఈ విభాగంలో సేవలపై తీవ్ర ప్రభావం చూపుతోంది.

కాంట్రాక్టర్లపై కొరవడిన నిఘా ....

ఉస్మానియా, గాంధీ, నిలోఫర్ ఆస్పత్రులలో రోగులకు ఆహారం అందించేందుకు టెండర్లు నిర్వహిస్తుంటారు. టెండర్ దక్కించుకున్న కాంట్రాక్టర్ నిబంధనల మేరకు రోగులకు ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రి భోజనం అవసరమైన క్వాంటిటీలో సరఫరా చేయాల్సి ఉంటుంది. ఉస్మానియాలో 1168 , గాంధీలో సుమారు 1600, నిలోఫర్ లో సుమారు 1000 పడకలు ఉండగా ఐపీ రోగులకు నిబంధనల మేరకు ఆహారం ఇవ్వాల్సి ఉంటుంది.

చీఫ్ డైటీషియన్ లేకపోవడంతో ముఖ్యంగా డయాబిటిక్ , మూత్ర పిండాల (రీనల్) పేషంట్, కాలేయ సంబంధ రోగులు, కార్డియాక్, పోస్ట్ ఆపరేటివ్ కేసులు, స్థూలకాయం (ఒబేసిటి), రోగులకు, నిలోఫర్ లో గర్భిణులు, ప్రసవానంతరం చిన్నపిల్లలకు పోషక ఆహారం ఎంత మోతాదులో తీసుకోవాలో తెలియకుండా పోవడంతో వారు త్వరగా కోలుకోవడంపై ప్రభావం చూపుతోంది. దీంతో కార్పొరేట్ హాస్పిటల్స్ కు ధీటుగా వైద్య సేవలు అందిస్తున్న ఆయా ఆస్పత్రులలో సూపర్ స్పెషలిస్ట్​ సేవలకు అంతరాయం ఏర్పడుతోంది.

ఎప్పుడు ? ఎంత క్వాంటిటీలో ఇవ్వాలి....

బ్రేక్ ఫాస్ట్ ....

ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రోగులకు ఉదయం 7.30 నుండి 8.30 గంటల మద్య ఇడ్లీ (150 గ్రాములు), 100 గ్రాముల సాంబర్/ చట్నీ , పొంగల్, కిచిడి , ఉప్మ, బ్రెడ్ స్లైస్ లు 5 లలో ఏదో ఒకటి , ఒక కప్పు (100 ఎంఎల్ విత్ 50 ఎంఎల్ మిల్క్) ఉడకబెట్టిన గుడ్డు ఇవ్వాలి.

లంచ్ ....

మధ్యాహ్నం 12 నుండి ఒంటి గంట వరకు రోగులకు లంచ్ సరఫరా చేయాలి. ఇందులో అన్నం, 8 ఇంచుల డయా కలిగిన పుల్క 600 గ్రాములు , వెజ్ కర్రీ 150 గ్రాములు , ఆకు కూర పప్పు 150 గ్రాములు, 200 ఎంఎల్ సాంబర్ , ఉడకబెట్టిన గుడ్డు ఒకటి, 100 ఎంఎల్ పెరుగు మజ్జిగ అయితే 200 ఎంఎల్ ఒక అరటి పండు ఇవ్వాలి.

డిన్నర్ ....

డిన్నర్ రాత్రి 6 నుండి 8 గంటల లోపు ఇవ్వాలి. ఇందులో అన్నం / ఆరు పుల్కలు మొత్తం 300 గ్రాములు , పుల్కలు 2, వెజ్ కర్రీ 150 గ్రాములు , ఆకుకూర పప్పు 150 గ్రాములు , సాంబర్ 200 ఎంఎల్, ఉడకబెట్టిన గుడ్డు ఒకటి, 100 ఎంఎల్ పెరుగు మజ్జిగ అయితే 200 ఎంఎల్ ఒక అరటి పండు ఇవ్వాలి.

అయితే సెమీ సాలిడ్ , లిక్విడ్ డైట్ , డయాబిటిక్ , రెనల్, కార్డియక్ , హై ప్రోటిన్ డైట్ అవరమయ్యే రోగులకు ఇచ్చే డైట్ మారుతుంటుంది. ఇవన్నీ చీఫ్ డైటీషియన్ పరిశీలించాలి. ఇప్పుడా పరిస్థితి లేకుండా పోయింది. ఈ విషయంలో ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని, అవసరమైతే కొత్త వారిని నియమించే వరకు పాత వారికి అదనపు బాధ్యతలు అప్పగించాలనే అభిప్రాయాలు వినబడుతున్నాయి .

Advertisement

Next Story

Most Viewed