రెవెన్యూ శాఖకు మంచి పేరు తేవాలి

by Sridhar Babu |
రెవెన్యూ శాఖకు మంచి పేరు తేవాలి
X

దిశ, హైదరాబాద్ బ్యూరో : పౌరులకు సకాలంలో మెరుగైన సేవలు అందించి శాఖకు మంచి పేరు తేవాలని రెవెన్యూ అధికారులకు హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సూచించారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన రెవెన్యూ అధికారుల సమావేశంలో ఆయన పాల్గొని మండలాల వారీగా తహసిల్దార్ కార్యాలయాల పనితీరును సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజల నుండి వచ్చిన ఆఫ్ లైన్, ఆన్లైన్, వాట్సప్ ప్రతి దరఖాస్తులకు ఇన్వార్డ్ చేయాలన్నారు. తహసిల్దార్ కార్యాలయంకు వచ్చిన ప్రతి దరఖాస్తు స్వీకరించిన తేదీ, పరిష్కారమైన తేదీలు నమోదు చేయాలన్నారు. రిజిస్టర్ లను సక్రమంగా నిర్వహించాలని, కార్యాలయానికి వచ్చిన దరఖాస్తులకు పరిష్కారం చేసి సమయానికి ధ్రువపత్రాలను ప్రజలకు అందించాలని ఆదేశించారు. ప్రజావాణి, సీఎం ప్రజావాణి, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, కుల,

ఆదాయ ధ్రువీకరణ పత్రాల జారీలో అలసత్వం ప్రదర్శించవద్దని, కార్యాలయ నిర్వహణ సక్రమంగా ఉండాలని, అధికారులు బాధ్యతతో, నిబద్ధతతో, పారదర్శకంగా సమర్థవంతంగా, వేగవంతంగా పనిచేసి రెవెన్యూ శాఖకు మంచి పేరు తేవాలన్నారు. గత నెల 4వ తేదీ నుండి ఈనెల జూలై 4 వరకు మీసేవ కుల, ఆదాయ, నివాస, ఈబీసీ, ఓబీసీ ఇతర ధ్రువపత్రాల కోసం తహసిల్దారులకు 14,195 ఆర్జీలు రాగా 8,111 దరఖాస్తులను పరిష్కరించారని, అలాగే నాయబ్ తహసిల్దార్లకు 19,299 అర్జీలు రాగా 16,665 ఆర్జీలను పరిష్కరించినట్టు చెప్పారు. టైం లిమిట్ లో ఉన్న ఆర్జీలను త్వరలో పరిష్కరించడం జరుగుతుందన్నారు. ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం కాకుండా ఉండేందుకు, భూముల రక్షణ కోసం ల్యాండ్ బ్యాంక్ యాప్ రూపొందించాలని తహసిల్దార్లను కలెక్టర్ ఆదేశించారు. జిల్లాలో ఏ ప్రాంతంలో ఎక్కడ ఎంత ప్రభుత్వ

భూమి ఉందనే వివరాలను ల్యాండ్ బ్యాంక్ రిజిస్టర్లలలో నమోదు చేయాలని, ల్యాండ్ బ్యాంక్ రిజిస్టర్ ను ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలని అన్నారు. ప్రభుత్వం ఇచ్చిన భవనాలు వినియోగంలో లేకుంటే, ప్రభుత్వం భూములలో నిర్మాణ పనులు చేపట్టకపోతే ఈ ప్రభుత్వ భూములను, భవనాలను గుర్తించి తన దృష్టికి తీసుకురావాలన్నారు. తహసిల్దార్ కార్యాలయాల నిర్వహణ, సకాలంలో ధ్రువపత్రాలు అందించేలా చూసేందుకు తహసిల్దార్ కార్యాలయాలను ప్రతి వారం తనిఖీ చేసి నివేదిక అందించేందుకు నలుగురు డిప్యూటీ కలెక్టర్లను నోడల్ అధికారులుగా నియమించడం జరిగిందన్నారు. వారు కార్యాలయాలను తనిఖీ చేసి అధికారులు, సిబ్బంది పనితీరు, కార్యాలయ పరిశుభ్రత, నిర్వహణ తదితర

అంశాలపై నివేదిక అందిస్తారని తెలిపారు. ప్రొటోకాల్ విషయంలో తహసిల్దార్లు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. వర్షాకాలంలో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా, ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా ఉండేందుకు లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు. వర్షా కాలంలో సురక్షిత ప్రాంతాలకు తరలించిన ప్రజల వివరాలు ఏమైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తేవాలన్నారు. ఆర్టీఐ, లోకాయుక్త రిపోర్టులు పెండింగ్లో లేకుండా చూసుకోవాలన్నారు. రెవెన్యూ అధికారులు సమన్వయంతో పనిచేసి హైదరాబాద్ జిల్లాను ఇతర జిల్లాలకు ఆదర్శంగా నిలిచేలా పనిచేయాలని కోరారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ కదిరవన్, జిల్లా రెవెన్యూ అధికారి వెంకటాచారి, ఆర్డీవోలు మహిపాల్, దశరథ్ సింగ్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు ,తహసీల్దార్లు పాల్గొన్నారు.

Next Story

Most Viewed