- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గ్రేటర్‌లో పెరుగుతున్న సీజనల్ వ్యాధులు
దిశ,హైదరాబాద్ బ్యూరో : గ్రేటర్ హైదరాబాద్ లో సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్నాయి. డెంగీ తో పాటు చికున్ గున్యా కూడా ప్రభలుతూ ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఇటీవల డెంగీ, చికున్ గున్యా కేసులు కూడా పెరిగిపోయాయి. వ్యాధి బారిన పడిన రోగులు ఆస్పత్రులకు పరుగులు తీస్తున్నారు. అయితే ప్రభుత్వ ఆస్పత్రుల కంటే ప్రైవేట్ హాస్పిటల్స్ కు జబ్బుల బారిన పడిన రోగులు చికిత్సల నిమిత్తం పరుగులు పెడుతుండటంతో అవి ప్రైవేట్ ఆస్పత్రులు డెంగీ రోగులతో కిటకిటలాడుతున్నాయి . గతంలో వారానికి కేవలం పదుల సంఖ్యలో నమోదయ్యే కేసులు తాజాగా ప్రతి హాస్పిటల్ లో నిత్యం పదుల సంఖ్యలో నమోదవుతుండడం గమనార్హం. నగరంలోని చాలా ప్రైవేట్ , కార్పొరేట్ హాస్పిటల్స్ లో పడకల కొరత ఏర్పడుతోందంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు . వీటిలో వైద్యం ఆర్ధికంగా భారమైనప్పటికీ రోగులు ప్రైవేట్ హాస్పిటల్స్ కు చికిత్స నిమిత్తం వెళ్తున్నారు .
భయపెడుతున్న డెంగీ...
డెంగీ జ్వరం ముఖ్యమైన, ప్రాణాంతకమైన వ్యాధి. సాధారణంగా దీని వ్యాప్తి వర్షాకాలం ముగిసే సమయానికి మొదలవుతుంది.అయితే ఈ ఏడాది దీని ప్రభావం ముందుగానే కనబడుతోంది. డెంగీ జ్వరం దోమల వల్ల కలిగే వైరల్ వ్యాధి. ఏడిస్ దోమ కాటు ద్వారా డెంగీ వైరస్ మనుషులకు వ్యాపిస్తుంది. ఇది శరీర అవయవాల పనితీరు పై ప్రభావం చూపుతుంది.
డెంగీ బారిన పడినవారికి తేలికపాటి వ్యాధి లక్షణాలు ఉంటాయి. కొంతమందిలో ఎలాంటి లక్షణాలు ఉండవు. డెంగీ బారిన పడిన వారిలో 75 శాతం మందిలో ఎలాంటి లక్షణాలు కనిపించవని సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) చెబుతోంది. 20 శాతం మందిలో తేలికపాటి లక్షణాలు ఉంటాయి. మిగతా ఐదు శాతం మందిలో తీవ్రమైన లక్షణాలు ఉండవచ్చు. వీరిలో వ్యాధి ప్రాణాంతకంగా మారే అవకాశం ఉంది.
జ్వర లక్షణాలు కనబడితే పరీక్షలు తప్పనిసరి...
వర్షా కాలంలో జ్వర లక్షణాలు కనబడితే డెంగీ గా అనుమానించాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ముందుగా రోగికి కంప్లీట్ బ్లడ్ పిక్చర్ (సీబీపీ) పరీక్ష చేయించాలి. డెంగీ తీవ్రత అధికంగా ఉన్న బాధితులలో ప్యాకెడ్ సెల్ వాల్యూమ్ (పీసీవీ)అధికంగా ఉంటే వారి శరీర ఎత్తు, బరువు ఇతర అంశాలను పరిగణలోకి ఐవీ ద్రావణాలను అందించాలి. సాధారణంగా డెంగీ రోగులలో ప్లేట్ లెట్స్ 10 వేల కంటే తగ్గితే ఐవీ ద్రావణాలను ఎక్కించడం తప్పనిసరి. డెంగీ ప్రభావం ఎక్కువగా ఉన్న రోగుల్లో రక్తం గడ్డకట్టకుండా ఉండేందుకు హెపారిన్ మందులు ఇవ్వాల్సి ఉంటుంది. అంతేకాకుండా వీరికి ప్లేట్లెట్లు, డీ డైమర్ పరీక్షలు చేయాలి. ఒకవేళ వీరిలో ప్లేట్ లెట్ల సంఖ్య లక్ష కంటే తక్కువగా ఉన్నా, రక్తస్రావం అవతుంటే ఈ మందును వాడరాదని , డెంగీ సోకిన వారు కనీసం వారం తర్వాత మాత్రమే స్టెరాయిడ్స్ వాడాలని వైద్యులు సూచిస్తున్నారు.
పెరిగిన చికున్ గున్యా రోగులు...
జీహెచ్ఎంసీ పరిధిలో ఇటీవల చికున్ గున్యా రోగులు కూడా ఒక్కసారిగా పెరిగిపోయారు . ఇది టో విరిడే కుటుంబానికి చెందిన ఆల్ఫా వైరస్ వల్ల కలిగే అరుదైన విష జ్వరం. ఈ వైరస్ ఏడిస్ ఈజిప్టీ అనే రకం దోమ యొక్క కాటు వలన వ్యాపిస్తుందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు . ఈ వ్యాధి వచ్చిన రోగులు కీళ్ల నొప్పులతో తీవ్ర ఇబ్బందల పాలవుతారు . నిటారుగా నడవలేక వంగి గూనిగా నడుస్తారు . చికున్ చికన్‌గన్యా వ్యాధి ప్రాణాంతకము కానప్పటికీ శరీరం భరించలేని నొప్పుల బారిన పడడంతో భరించలేక రోగులు హాస్పిటల్స్ కు పరుగులు తీస్తున్నారు .
తీవ్రంగా జ్వరం ఉంటే అనుమానించాలి...:డాక్టర్ వసంత్ కుమార్
డెంగీ వైరస్ బారిన పడిన వారికి సాధారణంగా తీవ్ర స్థాయిలో జ్వరం వస్తుంది. తలనొప్పి భరించ లేనట్లుగా వేధిస్తుంది. దీంతోపాటు కంటి నొప్పి, ఎముక, కండరాలు, కీళ్ల నొప్పులు వంటి సమస్యలు ఉంటాయి.వికారంగా అనిపించడం, వాంతులు, చర్మంపై దద్దుర్లు వంటి ఇతర అనారోగ్యాలు ఎదురవుతాయి. ఈ వ్యాధిని ప్రారంభ దశలోనే గుర్తించి చికిత్స తీసుకుంటే ప్రమాదం ఉండదు. సరైన సమయంలో చికిత్స అందిస్తే ఊపిరితిత్తులు, కాలేయం, గుండె వంటి ముఖ్యమైన అవయవాలు దెబ్బతినకుండా కాపాడుకోవచ్చు. తద్వారా డెంగీ మరణాల రేటు కూడా తగ్గుతుంది. అయితే ఎవరూ కూడా వైద్యుల సలహాలు లేకుండా సొంతంగా మందులు వాడవద్దు. పై లక్షణాలు కనబడితే హాస్పిటల్ కి వెళ్లి పరీక్షలు చేయించుకోవడంతో పాటు వైద్యుల పర్యవేక్షలో వైద్యం పొందాలి. డెంగీ బారిన పడిన రోగులు పండ్ల రసాలు, మంచినీరు , ఓఆర్ఎస్ తీసుకోవాలి.