కుల గణనపై బుధవారం రౌండ్ టేబుల్ సమావేశం

by srinivas |
కుల గణనపై బుధవారం రౌండ్ టేబుల్ సమావేశం
X

దిశ; తెలంగాణ బ్యూరో: కుల గణనపై రేపు(బుధవారం) రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తామని ప్రొఫెసర్ల బృందం ప్రకటించింది. సోమవారం విద్య కమిషన్ సభ్యులు ప్రొఫెసర్ పీఎల్ విశ్వేశ్వర్ రావు గాంధీభవన్‌లో మాట్లాడుతూ కుల గణన బిల్లును పార్లమెంట్ లో పెట్టాలని రాహుల్ గాంధీ చెప్పారని, కుల గణన సర్వే లో ప్రశ్నల మీద ఢిల్లీలోని ప్రొఫెసర్లు సైతం చర్చించారన్నారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతించాలన్నారు. దీనిని వ్యతిరేకించే హక్కు ఎవరికీ లేదన్నారు. అలాంటి వారు సమాజ వ్యతిరేకులు అవుతారని స్పష్టం చేశారు. బీజేపీ కుల గణన మీద తప్పుడు ప్రచారం ఆపకపోతే ప్రజల్లోకి వెళ్లి చైతన్యం చేస్తామన్నారు.

ప్రొఫెసర్ మురళి మనోహర్ మాట్లాడుతూ కులగణనపై పీపుల్స్ కమిటీ,కాస్ట్ సెన్సెస్ ఆధ్వర్యంలో అనేక సమావేశాలు నిర్వహించామన్నారు. ప్లానింగ్ ప్రాకరమే ప్రభుత్వం సర్వే నిర్వహిస్తుందన్నారు. కుల గణన వ్యతిరేకించే వాళ్ళు దేశాన్ని విడగొట్టాలని చూస్తున్నట్లే అని మండిపడ్డారు. బీజేపీ గత పది సంవత్సరాల నుండి అనేక వృత్తుల గురించి అధ్యయనం చేయలేదన్నారు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ గురించి కూడా బీజేపీ తప్పుడు విధానాలను ఎత్తుకున్నదన్నారు. తెలంగాణలో జరుగుతున్న కులగణనను బీజేపీ ఎందుకు వ్యతిరేకిస్తుందని ప్రశ్నించారు. ప్రజలంతా స్వచ్ఛందంగా కులగణనకు సపోర్ట్ చేయాలన్నారు. అభివృద్ధి, సంక్షేమ ఫలాలు కొన్ని కులాలకు మాత్రమే అందుతున్నాయని, వాటిని సెన్సస్ ప్రకారం అందించడమే ప్రభుత్వం లక్ష్యం అన్నారు.

ప్రొ. సమ్మయ్య మాట్లాడుతూ ప్రభుత్వం ఇస్తున్న అభివృద్ధి ఫలాలు ప్రతి ఒక్కరికీ అందాలంటే కులగణన అవసరమన్నారు. ప్రొఫెసర్ సింహాద్రి మాట్లాడుతూ కుల గణన ఎజెండాను అడ్డుకోవడం అంటే దేశ అభివృద్ధిని అడ్డుకోవడమే అని, బీజేపీ విభజన అనే ప్రచారం చేస్తుందన్నారు. 75 ఏళ్ల కల నెరవేరుతున్నందుకు ప్రజలంతా హర్షించాల్సిన అవసరం ఉన్నదన్నారు.

Advertisement

Next Story

Most Viewed