GHMC: ప్రధాన కార్యాలయంలో సందర్శకులను కలవని ఆఫీసర్లు

by Mahesh |
GHMC: ప్రధాన కార్యాలయంలో సందర్శకులను కలవని ఆఫీసర్లు
X

దిశ, సిటీబ్యూరో : జీహెచ్ఎంసీలో ఆఫీసర్లు సామాన్య సందర్శకులను కలుస్తున్నారా, వారు వచ్చినప్పుడు అందుబాటులో ఉండి వారి మొర ఆలకిస్తున్నారా అన్న ప్రశ్నకు లేదనే సమాధానం వస్తుంది. సందర్శన వేళల్లో సమీక్షలు, ఇతర సమావేశాలు నిర్వహిస్తుండటం సందర్శకులను కలవకపోవడం తో వారు నిరాశతో వెనుదిరుగుతున్నారు. రాష్ట్రంలో ప్రజాపాలన అందుబాటులోకి వచ్చిందని అధికార పార్టీ గొప్పగా ప్రకటనలు చేస్తున్నా, జీహెచ్ఎంసీలో పరిపాలన మాత్రం గత సర్కారు మాదిరిగానే ఉందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రతిరోజు ప్రభుత్వ కార్యాలయాల్లో మధ్యాహ్నం 3 గంటల నుంచి 5 గంటల వరకు విజిటింగ్ వేళలుగా అధికారికంగా ప్రకటించినా, జీహెచ్ఎంసీలోని జోనల్, సర్కిల్ కార్యాలయాల్లో సందర్శన వేళలు ఏమాత్రం అమలు కావడం లేదంటూ సందర్శకులు వాపోతున్నారు.

జీహెచ్ఎంసీకి ఫిర్యాదులు, వినతులు, ఆర్జీలను సమర్పించేందుకు వివిధ ప్రాంతాల్లో రోజు 800 నుంచి వెయ్యి మంది వరకు ప్రధాన కార్యాలయం, జోనల్, సర్కిల్ కార్యాలయాలకు వస్తుంటారు. వీరిలో ఎక్కువ మంది హెల్త్, టౌన్ ప్లానింగ్, ఇంజనీరింగ్, పరిపాలన, లీగల్, క్వాలిటీ కంట్రోల్, ఫైనాన్స్, బయోడైవర్సిటీ, స్పోర్ట్స్, స్థల సేకరణ, ఎంటమాలజీ, వెటర్నరీ తదితర విభాగాలకు వస్తుంటారు. మరి కొందరు అధికారులైతే ప్రధాన కార్యాలయం సిబ్బందిని కూడా కలిసేందుకు అంగీకరించడం లేదని తెలిసింది. ఇంకొందరైతే తమను కలవాలంటే ముందుగా అపాయింట్‌మెంట్ తీసుకోల్సిందేనని తేల్చి చెబుతున్నారు.

పనేదైనా నెలల తరబడి తిరగాల్సిందే..

ముఖ్యంగా భవన నిర్మాణ అనుమతులు, అక్యుపెన్సీ సర్టిఫికెట్లు, ట్యాక్స్ ఖాతాల్లో మార్పులు, మ్యుటేషన్‌లతో పాటు ఇంజినీరింగ్ విభాగానికి సందర్శకులు వస్తుంటారు. ముఖ్యంగా అక్రమ నిర్మాణాలు, వీధి దీపాలు వంటి ఫిర్యాదులతో వస్తున్న సందర్శకులకు అధికారులు ఏ మాత్రం అందుబాటులో ఉండటం లేదని సందర్శకులు వాపోతున్నారు. ఫలితంగా బర్త్, డెత్ సర్టిఫికెట్లు, వాటిల్లో సవరణల కోసం నెలల తరబడి బల్దియా ఆఫీసుల చుట్టూ చక్కర్లు కొట్టాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఫిర్యాదులతో వచ్చే సందర్శకుల్లో ఎక్కువ మంది వయోవృద్దులే ఉంటున్నారు. పౌర సేవల నిర్వహణకు సంబంధించి తలెత్తుతున్న సమస్యలు, వాటిని పరిష్కరించాల్సిన సర్కిల్, జోనల్ స్థాయి అధికారులు నిర్లక్ష్యాన్ని, అవినీతిని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువచ్చేందుకు పటాన్‌చెరు, శేరిలింగంపల్లి, కుత్బుల్లాపూర్, ఎల్బీనగర్, రాజేంద్రనగర్ తదితర ప్రాంతాల నుంచి వస్తున్న సందర్శకులకు ఆఫీసర్లు అందుబాటులో ఉండటం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

మేయర్ ప్రజలను కలవరా?

కొద్ది సంవత్సరాల క్రితం వరకు మేయర్ సైతం ప్రజాదర్బార్ నిర్వహించే వారు. కానీ సమైక్య పాలన పోయి, సొంత పాలన వచ్చినప్పటి నుంచి మేయర్ ప్రజలకు కలవకుండా దూరమవుతున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. స్టాండింగ్ కమిటీ, కౌన్సిల్ సమావేశాలున్నప్పుడే మేయర్ తన ఆఫీసుకు వస్తున్నారని, భారీ వర్షాలు కురిసినప్పుడు కూడా మేయర్ కేవలం అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించి మామ అనిపిస్తున్నారన్న విమర్శలు సైతం లేకపోలేవు. 2021 ఫిబ్రవరి రెండో వారంలో మేయర్‌గా పదవీ బాధ్యతలు చేపట్టిన మేయర్ ఆ తర్వాత ప్రజావాణి, ప్రజాదర్భార్ కార్యక్రమాలను నిర్వహించి, తరుచూ ప్రజలను కలిసి వారి సమస్యలపై దృష్టి సారిస్తానని హామీ ఇచ్చి, ఆ తర్వాత అది మర్చిపోయారంటూ సందర్శకులు వాపోతున్నారు. మేయర్ ఆదేశించిన పనులకు సంబంధించిన పురోగతిని తెలియజేసేందుకు అధికారులే ఆమె నివాసానికి వెళ్తున్నట్లు సమాచారం.



Next Story