గంజాయి పట్టివేత…అంతర్ రాష్ట్ర ముఠా గుట్టురట్టు

by Kalyani |   ( Updated:2024-12-16 11:16:28.0  )
గంజాయి పట్టివేత…అంతర్ రాష్ట్ర ముఠా గుట్టురట్టు
X

దిశ, చైతన్యపురి : గంజాయి విక్రయిస్తున్న అంతర్ రాష్ట్ర ముఠాను రాచకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. ఎల్బీనగర్ ఎస్ఓటీ, మీర్ పేట పోలీసులు విస్తృత తనిఖీలు నిర్వహించి గంజాయి విక్రయిస్తున్న ముగ్గురు నిందితులను రిమాండ్ తరలించారు. సోమవారం ఎల్బీనగర్ లోని రాచకొండ క్యాంప్ కార్యాలయంలో సీపీ సుధీర్ బాబు మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. రాజస్థాన్ కు చెందిన మంగీలాల్ (21), మంగీలాల్ డాక (25), బీరా రామ్ (25) నాదర్ గుల్ లోని అశోక్ రెడ్డి కాలనీలో ఉంటూ వివిధ పనులు చేస్తూ నివసిస్తున్నారు. వీరికి మధ్యప్రదేశ్ కు చెందిన పింటూ అలియాస్ మోహన్ సింగ్ తో పరిచయం ఏర్పడింది. సులభంగా డబ్బులు సంపాదించడానికి డ్రగ్స్ విక్రయించాలని నిర్ణయించారు. పింటూ తాను మధ్యప్రదేశ్ నుండి గంజాయి తెచ్చి ఇస్తానని మీరు ముగ్గురు కలిసి హైదరాబాద్ లో విక్రయించాలని ఒప్పందం చేసుకున్నారు.

ఈ క్రమంలో ఈనెల 15న మంగీలాల్, మంగీలాల్ డాకు, బీర రామ్ ముగ్గురు కలిసి నాదర్ గుల్ లో గంజాయి విక్రయించడానికి ప్రయత్నిస్తున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు ఎల్బీనగర్ ఎస్ఓటీ, మీర్ పేట పోలీసులు సంయుక్తంగా దాడులు నిర్వహించారు. ఈ దాడులలో 53 కిలోల గంజాయి పట్టుకున్నారు. ఈ గంజాయి నుండి హెరాయిన్ నుంచి ప్రత్యేకంగా పాపి స్ట్రా అనే మత్తు పదార్థాన్ని తయారు చేయడానికి వినియోగిస్తారని సీపీ సుధీర్ బాబు తెలిపారు. 53 కిలోల గంజాయి విలువ మార్కెట్లో రూ. 1. 25 కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు. గంజాయి విక్రయిస్తున్న ముగ్గురిని, కొనుగోలు చేస్తున్న ఇద్దరినీ, మధ్యప్రదేశ్ నుంచి సరఫరా చేస్తున్న మరొక్కరిని మొత్తం ఆరుగురిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

ముగ్గురిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు సీపీ తెలిపారు. నిందితులలో ఒక్కడైనా మంగీలాల్ పై 2023 లో గంజాయి విక్రయిస్తూ హయత్ నగర్ పోలీసులకు పట్టుబడ్డాడు. కాగా పప్పిస్ట్రా ద్రావణాన్ని నీరు, నిమ్మరసం, టీ, కాఫీ తదితర ద్రవపదార్థాలు కలుపుకుని సేవిస్తారు. చాకచక్యంగా వ్యవహరించి నిందితులను అరెస్టు చేసిన ఎల్బీనగర్ ఎస్ఓటీ, మీర్ పేట పోలీసులను సీపీ అభినందించారు. ఈ సమావేశంలో ఎల్బీనగర్ ఎస్ఓటీ డిసిపి మురళీధర్, అడిషనల్ డీసీపీ షాకీర్ హుస్సేన్, ఇన్స్ పెక్టర్ లు భాస్కర్ రెడ్డి, ముదసిర్ ఆలీ, మీర్ పేట ఇన్స్ పెక్టర్ నాగరాజు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed