తెలంగాణలో గ్రామీణ రహదారులకు మహర్దశ

by srinivas |
తెలంగాణలో గ్రామీణ రహదారులకు మహర్దశ
X

దిశ, తెలంగాణ బ్యూరో:గ్రామీణ రహదారుల నిర్మాణాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని ముందుకు వెళ్తుందని, దీనికోసం రూ. 2,600 కోట్లను కేటాయించనున్నట్టు మంత్రి సీతక్క తెలిపారు. బుధవారం ఎర్రమంజీల్ లోని పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్ కార్యాలయంలో రూరల్ ఇంజనీర్లతో మంత్రి సీతక్క సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. పంచాయతీరాజ్ శాఖ 2.60 కోట్ల మందికి పైగా ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తుందని, రహదారి సౌకర్యాలు లేకపోవడం వల్ల అక్కడి ప్రజలు వెనుకబాటుకు గురవుతున్నారన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో ప్రతి ఆవాసం నుంచి గ్రామపంచాయతీ, మండల, జిల్లా కేంద్రాలకు రహదారులు నిర్మించనున్నట్టుు తెలిపారు. ఇప్పటికే రూ.2, 600 కోట్లు రహదారుల నిర్మాణానికి, రోడ్ల నిర్వహణ కోసం రూ.1600 కోట్లు ఖర్చు చేయనున్నామని వెల్లడించారు. 30 మెట్రిక్ టన్నుల వాహనాలు నడిచేలా రోడ్ల సామర్థ్యాన్ని మెరుగు పరచ్చాలని ఇంజనీర్లకు సూచించారు. రూరల్ ఇంజనీర్లు కార్యచరణ సిద్ధం చేయడంతో పాటు రహదారుల నిర్మాణ అంచనాలు పక్కగా ఉండాలని సూచించారు. ఇష్టారీతిన అంచనాలను సవరించొద్దన్నారు. ఇందజనీర్లే ఈ దేశ నిర్మాతలని మోక్షగుండం విశ్వేశ్వరయ్య, కాకతీయుల కాలం నాడు కట్టిన కట్టడాలు ఇంకా పటిష్టంగా ఉన్నాయని గుర్తు చేశారు. ఇదే రీతిలో రూరల్ ఇంజనీర్లు చేసే నిర్మాణాలు10 తరాలకు పనికి వచ్చేలా పటిష్ట చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజలే మన బంధువులన్న విషయాన్ని గుర్తించి పనులు చేయాలని, సరిగా పని చేయని కాంట్రాక్టర్లను బ్లాక్ లిస్ట్ లో పెట్టాలని హెచ్చరించారు. నాసిరకం పనులకు ఎన్ ఓసీలిచ్చే అధికారులపై కఠిన చర్యలు ఉంటాయన్నారు. మహానగరాల్లో రోడ్లు మెరిసినట్టుగానే పల్లెల్లో రహదారులు మెరవాలని, ఆ బాధ్యత రూరల్ ఇంజనీరింగ్ విభాగానిదేనని సూచించారు. రవాణా అవసరాలకు అనుగుణంగా రహదారుల నిర్మాణం జరగాలన్నారు.


జిల్లా స్థాయిలో రూరల్ ఇంజనీర్లు ప్రతి 15 రోజులకు సమీక్ష నిర్వహించాలన్నారు. పనుల పురోగతి నివేదికలను ప్రతి 15 రోజులకు ప్రభుత్వానికి అందించాలన్నారు. సమాజం బాగుండాలంటే ఇంజనీర్ల పాత్ర గొప్పది... ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని మంత్రి హితవు పలికారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో గుండివాగు బ్రిడ్జి 10 ఏండ్లుగా పూర్తికాలేదని, ఫలితంగా 40 మంది ప్రజలు వాగు దాటలేక మృత్యువాత పడ్డారన్నారు. గతంలో నా నియోజకవర్గంలో సరైన గ్రామీణ రోడ్లు లేక ఎంతో మంది ఆత్మీయులను రోడ్డు ప్రమాదంలో కోల్పోయానని మంత్రి సీతక్క ఆవేదన వ్యక్తం చేశారు. పట్టణాల్లో ఫ్లైఓవర్లు, స్కైవాక్స్ ఉన్నాయని, కానీ చాలా గ్రామాల్లో కనీస రోడ్డు సదుపాయం లేకపోవడం విచారకరమన్నారు. పల్లెలకు రహదారి సౌకర్యాలు కల్పిస్తేనే అసలైన అభివృద్ధి అని మంత్రి పేర్కొన్నారు. తీన శాఖలో పురోగతి రావాలంటే తాను పని చేయడమే కాదు రూరల్ ఇంజనీర్ల సహకారం కూడా కావాలని, అందరి సహకారం ఉంటేనే ప్రజల నమ్మకాన్ని నిలబెట్టు కోగలుగుతానని, రోడ్డు సదుపాయం లేని ఆవాసాలు, గ్రామాలు ఉండొద్దనే లక్ష్యంతో పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్ భాగం పని చేయాలన్నారు. ఈ సమావేశంలో పంచాయతీరాజ్ సెక్రటరీ లోకేష్ కుమార్, ఈఎన్ సీ కనకరత్నం, చీఫ్ ఇంజనీర్లు, సీఈలు, ఈఈలు పాల్గొన్నారు

Advertisement

Next Story

Most Viewed