ఫెస్టిసైడ్స్ పంపిణీ పేరున ల్యాబ్ టూ ల్యాండ్ కంపెనీ భారీ మోసం

by Disha Web Desk 15 |
ఫెస్టిసైడ్స్ పంపిణీ పేరున ల్యాబ్ టూ ల్యాండ్ కంపెనీ భారీ మోసం
X

దిశ, శేరిలింగంపల్లి : డీలర్ల పేరున ప్రైవేట్ ఫైనాన్స్ లలో లక్షలాది రూపాయల క్రెడిట్ లోన్ తీసుకుని ఓ అగ్రికల్చర్ బేస్డ్ కంపెనీ బోర్డు తిప్పేసిన ఘటన సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని టీ హబ్ లో చోటు చేసుకుంది. బాధిత డీలర్లు, ఉద్యోగులు తెలిపిన వివరాల ప్రకారం.. రాయదుర్గం నాలెడ్జ్ సిటీలోని టీ హబ్ లో గత ఏడాది ఆదిత్య దేశ్ పాండే అనే వ్యక్తి ల్యాబ్ టూ ల్యాండ్ అగ్రిటెక్ సొల్యూషన్స్( పురుగు మందుల) కంపెనీని ప్రారంభించారు. ప్రతిష్టాత్మకంగా రూపుదిద్దుకున్న టీ హబ్ లో సదరు కంపెనీ ప్రారంభం కావడంతో ఉద్యోగులు కూడా భారీ అంచనాలతో అందులో చేరారు. ఫెస్టి సైడ్స్ డీలర్లు కూడా ఈ కంపెనీ నుండి మందులను తీసుకునేందుకు పెద్ద ఎత్తున డబ్బులు చెల్లించి డీలర్ షిప్స్ తీసుకున్నారు.

అయితే ల్యాబ్ టూ ల్యాండ్ సీఈఓ ఆదిత్య దేశ్ పాండే ఉద్యోగులను నియమించుకుని డీలర్ల బ్యాంక్ అకౌంట్స్, ఇతర సమాచారం సేకరించాడు. అలాగే క్రెడిట్ లైన్ పేరున డీలర్లకు రూ.50 వేల వరకు ఫెస్టిసైడ్స్ సరఫరా చేసి వారి పేరున శ్రీరామ్ ఫైనాన్స్, మింట్ ఫైన్ సంస్థల నుండి కోట్లాది రూపాయల అప్పులు తీసుకున్నారు. అలాగే గత అక్టోబర్ నెల నుండి ల్యాబ్ టూ ల్యాండ్ కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగులకు కూడా జీతాలు ఇవ్వడం లేదు. మీరు తీసుకున్న డబ్బులు చెల్లించాలంటూ డీలర్లకు ఆయా ఫైనాన్స్ కంపెనీల నుండి మెసేజ్ లు రావడంతో ఆందోళనకు గురైన డీలర్లు తమ సమాచారం సేకరించిన ల్యాబ్ టూ ల్యాండ్ కంపెనీ ప్రతినిధులను నిలదీశారు.

కంపెనీ సీఈవో ఆదిత్య దేశ్ పాండే డీలర్ల పేరున డబ్బులు తీసుకున్న విషయం తెలియని కంపెనీ ఉద్యోగులు ఇదే విషయం సీఈవోను అడగగా వారి నుండి ఎలాంటి స్పందన లేదు. పైగా వారిని కంపెనీ ఆవరణలోకి రాకుండా సెక్యూరిటీ అడ్డుకోవడంతో బాధిత ఉద్యోగులు గురువారం టీ హబ్ ఎదుట ఆందోళనకు దిగారు. అయినా కంపెనీ యాజమాన్యం నుండి ఎలాంటి స్పందన లేకపోవడంతో బాధితులు ల్యాబ్ టూ ల్యాండ్ సీఈవో ఆదిత్య దేశ్ పాండే మీద సైబరాబాద్ కమిషనరేట్ లో ఫిర్యాదు చేశారు. ఈ ల్యాబ్ టూ ల్యాండ్ అగ్రిటెక్ కంపెనీ బాధితులు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి సుమారు 700 మంది వరకు ఉన్నట్లు బాధితులు తెలిపారు.


Next Story

Most Viewed