కాలేజీ ఎదుట జాగృతి విద్యార్థి విభాగం ధర్నా

by S Gopi |
కాలేజీ ఎదుట జాగృతి విద్యార్థి విభాగం ధర్నా
X

దిశ, శేరిలింగంపల్లి: శ్రీ చైతన్య కాలేజీ యాజమాన్యం ఒత్తిడితో ఆత్మహత్యకు పాల్పడిన విద్యార్థి సాత్విక్ కుటుంబానికి ఎక్స్ గ్రేషియా చెల్లించాలని, అతని కుటుంబానికి న్యాయం చేయాలని, శ్రీచైతన్య కాలేజీ గుర్తింపును రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ భారత జాగృతి విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో మాదాపూర్ లోని చైతన్య కార్పొరేట్ విద్యాసంస్థ హెడ్ ఆఫీస్ వద్ద ధర్నా నిర్వహించారు. శ్రీ చైతన్య కాలేజీ యాజమాన్యానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. యాజమాన్యం ఒత్తిడి కారణంగానే విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని, బట్టి చదువులతో ర్యాంక్ ల కోసం ఒత్తిడి చేస్తున్నారని భారత జాగృతి విద్యార్థి విభాగం రాష్ట్ర నాయకులు ఆనంతుల ప్రశాంత్ ఆరోపించారు. మార్కులు విధానం వల్ల ఒత్తిడి పెరుగుతుందని ప్రభుత్వం దాన్ని తీసేసి, ర్యాంక్ పద్ధతిని తీసుకువచ్చిందని, అయినా యాజమాన్యాల తీరుమారడంలేదని విమర్శించారు. ఆత్మహత్యకు పాల్పడ్డ సాత్విక్ కుటుంబానికి ఎక్స్ గ్రేషియా చెల్లించాలని, అతని కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. కార్పొరేట్ సంస్థల్లో విద్యార్థులు ప్రశాంతంగా చదువుకునే అవకాశవలేకుండా పోయిందని, విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా వాటి తీరు మారడంలేదని అన్నారు.

సాత్విక్ ఆత్మహత్యకు కారకులైన వార్డెన్, లెక్చర్లను వెంటనే అరెస్టు చేయాలని, స్వాతిక్ కుటుంబానికి నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. అనంతరం శ్రీచైతన్య కాలేజీ ఏజీఎం డి. రామకృష్ణ భారత జాగృతి విద్యార్థి విభాగం ప్రతినిధులతో మాట్లాడుతూ.. సాత్విక్ మరణంపై అంతర్గత విచారణ కొనసాగుతుందని, దాచిపెట్టడానికి ఏమీ లేదని, సాత్విక్ కుటుంబానికి ఎక్స్ గ్రేషియా చెల్లిస్తున్నామని తెలిపారు. విద్యార్థుల ఆత్మహత్యల నేపథ్యంలో వారికి కౌన్సిలింగ్ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని, ఇకపై అలాంటివి చోటుచేసుకోకుండా చూస్తామన్నారు ఏజీఎం డి.రామకృష్ణ. ఈ ఆందోళనలో భారత జాగృతి విద్యార్థి విభాగం ప్రతినిధులు చరణ్, సంతోష్ కుమార్, రాము యాదవ్, పొట్టి శ్రీను, శ్రీకాంత్, అర్చన సేనాపతి, లావణ్య, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story