కాంగ్రెస్ గూటికి కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్

by Sridhar Babu |   ( Updated:2023-10-12 16:22:25.0  )
కాంగ్రెస్ గూటికి కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్
X

దిశ, శేరిలింగంపల్లి : ఎన్నికల షెడ్యూల్ విడుదల అయిన నాటి నుండి రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు వేగంగా మారిపోతున్నాయి. ఎప్పుడు ఎవరు ఏ పార్టీలో ఉంటారో..? ఎవరు ఏ పార్టీలో చేరుతారో కూడా తెలియని అయోమయ పరిస్థితులు కనిపిస్తున్నాయి. శేరిలింగంపల్లి నియోజకవర్గ నాయకుడు, మాదాపూర్ కార్పొరేటర్, బీఆర్ ఎస్ జీహెచ్ఎంసీ ఫ్లోర్ లీడర్ జగదీశ్వర్ గౌడ్ కాంగ్రెస్ గూటికి చేరడం దాదాపు ఖరారు అయినట్లు తెలుస్తుంది. గత మూడు రోజుల క్రితం ఢిల్లీకి వెళ్లిన జగదీశ్వర్ గౌడ్ హస్తినలో

కాంగ్రెస్ నేతలతో మంతనాలు సాగిస్తున్నట్లు సమాచారం. శేరిలింగంపల్లి కాంగ్రెస్ టికెట్ తనకు కేటాయిస్తే పార్టీలో చేరుతాననే షరతు విధించారని, అందుకు కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం, హస్తినా పెద్దలు కూడా సానుకూలత వ్యక్తం చేశారని, అయితే శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు, టికెట్ ఆశావహులతో రాష్ట్ర నాయకత్వం మంతనాలు జరిపి వారిని ఒప్పించే పనిలో ఉన్నారని, వారికి నచ్చజెప్పి జగదీశ్వర్ గౌడ్ కు టికెట్ హామీ ఇవ్వనున్నారని జగదీశ్వర్ గౌడ్ సన్నిహితులు చెబుతున్నారు.

బీఆర్ ఎస్ తో అంటీముట్టనట్టు వ్యవహరిస్తున్న జగదీశ్వర్ గౌడ్

బీఆర్ ఎస్ నాయకుడు జగదీశ్వర్ గౌడ్ మాదాపూర్ డివిజన్ నుండి, ఆయన భార్య పూజిత హఫీజ్ పేట్ డివిజన్ నుండి గత రెండు పర్యాయాలుగా కార్పొరేటర్లుగా కొనసాగుతున్నారు. గతంలో శేరిలింగంపల్లి ఎమ్మెల్యే టికెట్ రేసులో ఉంటారన్న ప్రచారం జరిగినా చివరి నిమిషంలో కేటీఆర్ బుజ్జగించడంతో వెనక్కి తగ్గారన్న ప్రచారం ఉంది. ఈసారి కూడా సిట్టింగ్

లకే సీట్లు అని అరెకపూడి గాంధీకే టికెట్ కేటాయించింది బీఆర్ ఎస్ అధిష్టానం. ఈ నేపథ్యంలో జగదీశ్వర్ గౌడ్ పార్టీ మారనున్నారన్న ప్రచారం మరోసారి జోరుగా సాగింది. అయితే వెంటనే రంగంలోకి దిగిన మంత్రి కేటీఆర్ జగదీశ్వర్ గౌడ్ తో మాట్లాడి ఆయనకు జీహెచ్ఎంసీ ఫ్లోర్ లీడర్ పదవి కట్టబెట్టారు. ఇక అంతా సర్దుకుంటుంది లే అనుకున్న తరుణంలో ఆయన హస్తినా టూర్ ప్రాధాన్యత సంతరించుకుంది. గత మూడు రోజులుగా జగదీశ్వర్ గౌడ్ ఢిల్లీలోనే ఉన్నారని, ఆయన కాంగ్రెస్ పెద్దలతో మంతనాలు జరుపుతున్నారన్న ప్రచారం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.

Advertisement

Next Story