హైదరాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయం తరలింపు ప్రక్రియ షురూ

by sudharani |
హైదరాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయం తరలింపు ప్రక్రియ షురూ
X

దిశ ప్రతినిధి , హైదరాబాద్: నాంపల్లి రోడ్‌లోని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయం తరలింపు ప్రక్రియ మొదలైంది. ఎలాంటి హంగు ఆర్భాటం లేకుండా వాహనాలలో ఫైళ్లను లక్డీకాపూల్‌లోని రంగారెడ్డి జిల్లా పాత కలెక్టర్ కార్యాలయంలోకి తరలింపును మొదలు పెట్టారు. 1990లో అబిడ్స్ నుండి నాంపల్లికి వెళ్లే దారిలో ఇప్పుడున్న కలెక్టర్ కార్యాలయాన్ని నిర్మించారు. అయితే నగరం నడిబొడ్డున ఉండడం, పార్కింగ్ తదితర సదుపాయాలు అవసరాల మేరకు లేకపోవడంతో ప్రత్యామ్నాయంగా కలెక్టరేట్‌ను మారుస్తున్నారు.

దీనికితోడు డిమాండ్ల సాధన కోసం రాజకీయ పార్టీలు తరచుగా ధర్నాలు, ఆందోళనలు చేస్తుండడంతో అబిడ్స్, నాంపల్లి తదితర ప్రాంతాలలో తరచుగా ట్రాఫిక్ జాం ఏర్పడుతుండగా దీని ప్రభావం రోజంతా ఉంటుంది. వీటన్నింటికి చెక్ పెట్టేందుకు గాను ఈ కార్యాలయాన్ని తరలించాలనే ప్రతిపాధన చాలా కాలంగా కొనసాగుతోంది. కాగా సీఎస్ శాంతికుమారి నుండి వచ్చిన ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ కార్యాలయం తరలింపు కొనసాగుతోంది. ఇప్పుడున్న భవనంలో మొత్తం 32 విభాగాలు ఉండగా అన్ని విభాగాలు లక్డీకాపూల్‌కు తరలివెళ్లనున్నాయి. 200లకు పైగా అధికారులు, ఉద్యోగులు పని చేస్తున్నారు. ఇందులో భాగంగా డీసీఎం ఇతర వాహనాలలో ఫైళ్లు, కంప్యూటర్లు, ఫర్నీచర్ , బీరువాలు ఒక్కటొక్కటిగా మారుస్తున్నారు .

Advertisement

Next Story