సైబరాబాద్ లో బైక్ రేసర్ల హల్చల్

by Sridhar Babu |
సైబరాబాద్ లో బైక్ రేసర్ల హల్చల్
X

దిశ, శేరిలింగంపల్లి : బైక్ లపై విన్యాసాలు చేస్తూ.. రేసింగ్ లు నిర్వహిస్తూ.. వాహనదారులను భయబ్రాంతులకు గురిచేస్తూ హల్చల్ చేస్తున్నారు పోకిరీలు. వీకెండ్ వచ్చిందంటే చాలు రాయదుర్గం పోలీసు స్టేషన్ పరిధిలోని నాలెడ్జ్ సిటీ, టీ హబ్, సత్య బిల్డింగ్ రోడ్, ఐకియా రోడ్డు ప్రాంతాల్లో పోకిరీలు బైక్ రేసింగ్ నిర్వహిస్తూ నానా హంగామా సృష్టిస్తున్నారు. తాజాగా రాయదుర్గం నాలెడ్జ్‌ సిటీ టీ హబ్‌ రోడ్లలో పోకిరీలు వాహన రేసులు, విన్యాసాలతో హంగామా చేస్తుండగా పట్టుకునేందుకు వెళ్లిన పోలీసులను బైకులతో ఢీకొట్టేందుకు యత్నించారు. పోలీసులు అప్రమత్తంగా వ్యవహరించి ఎక్కడికక్కడ భారీకేడ్లు పెట్టి వారిని అడ్డుకునేందుకు యత్నించారు. దీంతో బైక్ లను వదిలేసి పారిపోయారు. ఈ ఘటనకు సంబంధించి రాయదుర్గం ఇన్స్పెక్టర్

వెంకన్న తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని వివిధ ప్రాంతాలకు చెందిన బైక్ రేసింగ్ చేస్తున్న యువకులు నాలెడ్జ్‌ సిటీ, టీ హబ్‌ రోడ్లపైకి వస్తూ రేసులు నిర్వహిస్తూ, పెద్దగా అరుస్తూ రోడ్లపై వెళ్లే వారిని భయాందోళనకు గురిచేస్తున్నారని తెలిపారు. గత ఆదివారం కూడా టి. హబ్ నాలేజ్డ్ సిటీ ప్రాంతంలో బైక్ రేసింగ్ జరుగుతుందన్న సమాచారం అందుకున్న రాయదుర్గం పోలీసులు రెండు గస్తీ వాహనాలలో కానిస్టేబుళ్లు, బ్లూకోల్ట్స్‌ కానిస్టేబుళ్లు అక్కడికి చేరుకుని బైక్ రేసింగ్ ను అడ్డుకోవాలని చూశారు. అయినా పోకిరీలు ఏమాత్రం వెనక్కి తగ్గకపోగా పోలీసులపైకి దూసుకువచ్చేందుకు యత్నించారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు బారీకేడ్లు ఏర్పాటు చేసి పట్టుకునేందుకు యత్నించగా కొందరు వాహనాలు అక్కడే వదిలేసి పారిపోయారు. ఈ ఘటనలో పోలీసులు పది బైకులు స్వాధీనం చేసుకున్నారు. వీరిలో ఆరుగురిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. మరో నలుగురు పరారీలో ఉన్నట్లు సీఐ వెంకన్న తెలిపారు.

Next Story