Harish Rao : రాష్ట్రంలో శాంతిభద్రతలు లేకుండా పోయాయి

by Aamani |   ( Updated:2024-09-12 15:15:02.0  )
Harish Rao : రాష్ట్రంలో శాంతిభద్రతలు లేకుండా పోయాయి
X

దిశ, శేరిలింగంపల్లి : నగరం నడిబొడ్డున ఓ ప్రజా ప్రతినిధిపై కాంగ్రెస్ గుండాలు దాడి చేయడం హేయమైన చర్య అని, గతంలో ఇలాంటి ఘటనలు ఎన్నడూ జరగలేదని.. పాడి కౌశిక్ రెడ్డి పై జరిగిన దాడి ముమ్మాటికి రేవంత్ రెడ్డి చేయించిన దాడిగానే పరిగణిస్తున్నామని ఇదంతా సీఎం కార్యాలయం నుండి వచ్చిన ఆదేశాలతోనే జరిగిందని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై దాడి ఘటన నేపథ్యంలో గురువారం బీఆర్ ఎస్ నాయకులు కొండాపూర్ లోని కౌశిక్ రెడ్డి ఇంటికి వచ్చి ఆయనను పరామర్శించారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ.. కాంగ్రెస్ గుండాలు, గాంధీ అనుచరులు మూకుమ్మడిగా వచ్చి దాడికి చేయడం హేయమైన చర్య అని అన్నారు. కౌశిక్ రెడ్డికి సమాధానం చెప్పలేకనే దాడులకు దిగుతున్నారని, ఇది ప్రజాస్వామ్య వ్యవస్థలో మంచిది కాదని హితవు పలికారు. నగరం నడిబొడ్డున ఎమ్మెల్యే మీద దాడి చేయడం పట్ల దేశంలో హైదరాబాద్ పరువును తీశారని, ప్రజల చేత ఎన్నుకోబడ్డ ఓ ప్రజాప్రతినిధి పై దాడి చేస్తుంటే లా అండ్ ఆర్డర్ ఎక్కడ పోయిందని హరీష్ రావు ప్రశ్నించారు.

ఉదయం నుండి పలుమార్లు సైబరాబాద్ సీపీ, మాదాపూర్ డీసీపీలతో మాట్లాడానని అయినా ప్రయోజనం లేకుండా పోయిందన్నారు. పోలీసులే దగ్గరుండి మరీ ఎస్కార్ట్ ఇచ్చి దాడులు చేయిస్తున్నారని, వారి ప్రోద్భలంతోనే ఇదంతా జరుగుతుందన్నారు. వరద బాధితులను పరామర్శించేందుకు వెళ్లిన మా మీద దాడి చేసిన వారిపై ఇప్పటికి కేసులు పెట్టలేదని ఇదెక్కడి పోలీసు వ్యవస్థ అని నిలదీశారు. రాజకీయాల్లో పదవులు, అధికారం ఎవరికీ శాశ్వతం కాదని, పోలీసులు కాంగ్రెస్ పార్టీకి తొత్తుగా వ్యవహరిస్తున్నారని, వారి పద్ధతి మార్చుకోవాలని సూచించారు. కౌశిక్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు గాంధీని ఎందుకు చేయలేదని, ఆయన కూకట్ పల్లి నుండి ఇక్కడికి వచ్చి దాడి చేస్తుంటే ఎందుకు మిన్నకుండి చోద్యం చూస్తున్నారని, పోలీసులు ఏం చేస్తున్నారన్నారు. ఇది ముమ్మాటికీ ప్రభుత్వ దాడేనని, చట్టం మీద నమ్మకం ఉంటే ఏసీపీ, సీఐని సస్పెండ్ చేయాలని సీపీ, డీజీపీలను డిమాండ్ చేశారు. పోరాడి తెలంగాణ తెచ్చుకున్నామని, 10 ఏళ్లలో ఎక్కడా ఎలాంటి ఘటనలు జరగకుండా కంటికి రెప్పలా కాపాడుకున్నామన్నారు. హైదరాబాద్ బ్రాండ్ ను కాపాడింది కేసీఆర్ అని, కానీ రేవంత్ పాలనలో అంతా అశాంతి, అరాచకమే నడుస్తుందన్నారు. గడిచిన 9 ఏళ్లలో 1800 హత్యాచారాలు, 2500 ల మర్డర్ లు జరిగాయని, రాష్ట్రంలో లాండ్ ఆర్డర్ ఎక్కడ ఉందన్నారు. పెట్టుబడులు రాకుండా పోతున్నాయని, హైదరాబాద్ ప్రతిష్ట దెబ్బతింటుందన్నారు హరీష్ రావు. మేము దాడి చేయలేక కాదు.. కష్టపడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రం ప్రతిష్ట మంట కలవద్దని కోరుకుంటున్నారు. తెలంగాణ కోసం రేవంత్ ఎన్నడూ పోరాడలేదని, ఆయనకు తెలంగాణ గొప్పతనం అర్థం కాదన్నారు.

ఎమ్మెల్యే గాంధీ మాట్లాడిన భాష అర్ధరహితమని, సంస్కారహీనులు మాట్లాడే బాష ఎమ్మెల్యే మాట్లాడటం సిగ్గు చేటన్నారు. దీనిపై స్పీకర్ వెంటనే స్పందించాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకుని తిరుగుతున్న రాహుల్ గాంధీ ఇదేనా మీరు ప్రజాస్వామ్య వ్యవస్థకు ఇచ్చే విలువ.. మీరు చెప్పే నీతులు ఇవ్వేనా, ప్రతిపక్షాలపై దాడులు చేయడమేనా రాజ్యాంగ పరిరక్షణ అంటే అని నిలదీశారు. దమ్ముంటే రేవంత్ రెడ్డి మీద చర్యలు తీసుకోవాలని, రాహుల్ ఉత్తర కుమార ప్రగల్భాలు పలకటం ఆపాలన్నారు. అనంతరం ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ.. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇవాళ దుర్దినం అని, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ఎమ్మెల్యే మీద దాడి హేయమైన చర్య అని అన్నారు. గాంధీ అనుచరులు కౌశిక్ రెడ్డిని చంపేందుకు యత్నించారన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం బండారాలను బయటపెడుతున్నారని కౌశిక్ రెడ్డి మీద దాడి చేశారని ఆరోపించారు.

Advertisement

Next Story

Most Viewed