గణేష్ నిమజ్జనోత్సవాలు ప్రశాంతంగా జరిగిలా ప్రభుత్వం చర్యలు : మంత్రి పొన్నం

by Aamani |
గణేష్ నిమజ్జనోత్సవాలు ప్రశాంతంగా జరిగిలా ప్రభుత్వం చర్యలు : మంత్రి పొన్నం
X

దిశ,హైదరాబాద్ బ్యూరో : జంట నగరాల్లో జరిగే గణేష్ నిమజ్జనోత్సవాలు శాంతియుత వాతావరణంలో జరిగేలా ప్రజలందరూ సహకరించాలని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు . కలెక్టరేట్ సమావేశ మందిరంలో శుక్రవారం ఏర్పాటుచేసిన పత్రిక విలేకరుల సమావేశంలో మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, నగర సిపి సీవీ ఆనంద్ లతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సెప్టెంబర్ 17న అంగరంగ వైభవంగా చేపట్టే నిమజ్జన వేడుకలు రాజకీయాలకు అతీతంగా ప్రశాంతవాతావరణంలో జరగాలని, ఆ దిశగా ప్రభుత్వం పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. గణేష్ నవరాత్రి ఉత్సవ వేడుకల సందర్భంగా ఇప్పటికే రాష్ట్ర ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఉన్నతాధికారులు, ఉత్సవ కమిటీ సభ్యులతో జంట నగరాల్లో జిల్లా కలెక్టర్లు, పోలీస్ ఉన్నత అధికారులు జిల్లా స్థాయిలలో సమావేశాలు నిర్వహించడం జరిగిందని అన్నారు. జంట నగరాల్లో ఎక్కడ కూడా ట్రాఫిక్ కి ఇబ్బంది కలగకుండా పోలీస్ యంత్రాంగం చర్యలు తీసుకోవడం జరుగుతుందని పేర్కొన్నారు.

నిమజ్జన వేడుకల్లో ఎక్కడైనా సమస్యలు, ఇబ్బందులు ఉంటే పోలీస్, రెవెన్యూ శాఖలకు సత్వరమే తెలపాలని అన్నారు. శాంతి భద్రతల విషయంలో పటిష్ట చర్యలు తీసుకోవడం జరుగుతుందని ప్రజలు, ప్రజా ప్రతినిధులు పూర్తి సహకారం అందించాలని కోరారు . ఈ నెల 16న నిర్వహించే మిలాదున్ నబి పండుగను ముస్లిం మత పెద్దలు 19 న పండుగ చేసుకునేలా అంగీకరించినట్లు మంత్రి పేర్కొన్నారు. హైదరాబాద్ ఐక్యత కు ప్రతీకగా నిలుస్తుందని, ఎక్కడైనా పండుగ నేపథ్యంలో అలజడులు సృష్టిస్తే కఠినంగా వ్యవహారిస్తామని స్పష్టం చేశారు. స్వేచ్ఛగా మంచి వాతావరణం లో గణేష్ పండుగ జరగాలని అన్నారు. ప్రజలందరూ సహకరించి పండుగ ఉత్సవాలను విజయవంతం చేయాలన్నారు. సోషల్ మీడియా ద్వారా రెచ్చగొట్టే, అపోహలు సృష్టించే వారిని ఉక్కు పాదంతో అణిచివేస్తామని అన్నారు.

జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మాట్లాడుతూ హైదరాబాద్ జిల్లాలో నిమజ్జన వేడుకలు శాంతియుత వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకున్నట్లు తెలిపారు . ఇప్పటికే జిల్లా స్థాయిలో అధికారులతో సమావేశాలు ఏర్పాటు చేసి విధి విధానాలపై స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగిందన్నారు . బాలాపూర్, ఖైరతాబాద్ లలోని భారీ విగ్రహాల శోభాయాత్ర, నిమజ్జనం కోసం ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరుగుతుందని పేర్కొన్నారు.

హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ మాట్లాడుతూ నిమజ్జనం సందర్భంగా శాంతి భద్రతల నిర్వహణ లో పోలీస్ యంత్రాంగాన్ని అప్రమత్తం చేయడం జరిగిందని నిమజ్జన వేడుకల్లో 15 వేల మందితో బందోబస్తు నిర్వహిస్తున్నట్లు తెలిపారు . బందోబస్తు కోసం ఇతర జిల్లాల నుంచి 3 వేల మందిని రప్పించామని , మరో 8 వేల మంది పోలీసులను విధులకు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఈ వేడుకల సందర్భంగా ప్రభుత్వం నిధులు కేటాయించి పూర్తిగా సహకారం అందిస్తుందని పేర్కొన్నారు. నిమజ్జన వేడుకలలో ప్రజలు ట్రాఫిక్ ఇబ్బందులు పడకుండా మల్లింపు చర్యలు తీసుకోవడం జరుగుతుందని, ప్రజలు, ఉత్సవ కమిటీ సభ్యులు సహకరించాలని అన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ వెంకటాచారి (రెవెన్యూ), పోలీస్, జీహెచ్ఎంసీ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed