ఫేక్ పర్మిషన్లు.. రెండు నోటీసులిచ్చి చేతులు దులుపుకున్న అధికారులు

by Anjali |
ఫేక్ పర్మిషన్లు.. రెండు నోటీసులిచ్చి చేతులు దులుపుకున్న అధికారులు
X

దిశ, సిటీబ్యూరో : జీహెచ్ఎంసీ టౌన్‌ప్లానింగ్ అధికారులు అడ్డదారిలో అక్రమార్జన కోసం ఎంతకైనా బరితెగిస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నిర్మాణదారులిచ్చే లంచాల కోసం ఏకంగా పర్మిషన్లు లేని సైట్‌లకు ఫేక్ పర్మిషన్లు సృష్టించి నిఘా వర్గాలను, ఇతర విభాగాల అధికారులను తప్పుదోవపట్టించేందుకు సిద్దమయ్యారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జీహెచ్ఎంసీ సర్కిల్ 18 పరిధిలోని జూబ్లీహిల్స్ ప్రాంతంలోని రోడ్ నెం 86లో వేంకటేశ్వర స్వామి దేవస్థానం పక్కనే లోటస్ పాండ్‌లోని పార్కు స్థలాన్ని ఓ ప్రముఖ వ్యక్తి కబ్జా చేసేందుకు యత్నించాడు. పార్కు పక్కనే ఆయన ఫ్లాట్ ఉండడంతో పార్కు స్థలంలో చదును చేస్తున్నట్లు ఈవీడీఎం అధికారులు గుర్తించారు. గత కొద్ది రోజుల క్రితం జీహెచ్ఎంసీ గోడను, దానికి ఉన్న గ్రిల్స్‌ను కూడా తొలగించి అందులో లారీలతో మట్టి పోయించి కబ్జాకు చేసేందుకు చేస్తున్న యత్నాన్ని ఈవీడీఎం కమిషనర్ రంగనాథ్ అడ్డుకున్నా, అధికారులు మాత్రం కనీసం అక్కడ పనులను ఆపలేకపోయారు.

పర్మిషన్ రెన్యువల్ చేసుకోకుండానే..

సదరు యజమాని తీసుకున్న అనుమతి ప్రకారం 27 జూలై 2019కి ముందు నిర్మాణ పనులను చేపట్టి, 27 జనవరి 2024 నాటికి ముగించాల్సి ఉంది. జీహెచ్ఎంసీ ఇచ్చిన అనుమతిని మళ్లీ ఫీజులు చెల్లించి రెన్యూవల్ చేసుకుంటేనే పనులు చేపట్టే అవకాశముంది. కానీ సదరు నిర్మాణదారుడికి వకాల్తా పుచ్చుకున్నట్లు వ్యవహరిస్తున్న స్థానిక టౌన్ ప్లానింగ్ ఆఫీసర్లు యజమాని రెన్యూవల్ చేయించుకునే పనులు చేపడుతున్నట్లు నమ్మించే ప్రయత్నాలు చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. సైటు సర్కిల్ 18లో ఉండగా, అనుమతి ప్రొసీడింగ్‌లో సర్కిల్ 19ని ముద్రించి వివరాలు లభ్యం కాకుండా టౌన్ ప్లానింగ్ అధికారులు చీప్ ట్రిక్ ప్లే చేస్తుండటం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఒక అక్రమ నిర్మాణాన్ని, అదీ జీహెచ్ఎంసీ పార్కు స్థలాన్ని కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్న సదరు నిర్మాణదారుడికి ఇంత బరితెగించి మద్దతునిస్తున్నారంటే, వీరికి ఎంత పెద్ద మొత్తంలో లంచాలు ముట్టాయోనన్న చర్చ లేకపోలేదు. ఇలాంటి ఫేక్ అనుమతుల కాపీలతో దాదాపు అన్ని సర్కిళ్లలోనూ టౌన్ ప్లానింగ్ సిబ్బంది అక్రమాలకు పాల్పడుతున్నారన్న వాదనలున్నాయి. దీనిపై స్టేట్ విజిలెన్స్ అధికారులు జోక్యం చేసుకుని సీరియస్ యాక్షన్ తీసుకోకుంటే నిర్మాణ అనుమతుల ద్వారా జీహెచ్ఎంసీ రావల్సిన నిధులన్నీ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ల జేబుల్లోకి వెళ్తాయన్న కామెంట్లు సైతం లేకపోలేవు.

రెండు నోటీసులిచ్చాం : ఏసీపీ సంపత్

జీహెచ్ఎంసీ సర్కిల్ 18లోని ఇన్‌కం ట్యాక్స్ కాలనీలో కొనసాగుతున్న నిర్మాణానికి రెండు నోటీసులు జారీ చేశామని, ప్రస్తుతం పనులు కూడా ఆపివేయించామని సర్కిల్ 18 అసిస్టెంట్ సిటీ ప్లానర్ సంపత్ దిశకు తెలిపారు. మళ్లీ పనులు మొదలుపడితే ఫైనల్ నోటీసు జారీ చేస్తామని కూడా ఆయన స్పష్టం చేశారు.



Next Story