జీహెచ్ఎంసీ పాట్లు.. ఆదాయం కోసం అన్వేషణ

by sudharani |
జీహెచ్ఎంసీ పాట్లు.. ఆదాయం కోసం అన్వేషణ
X

దిశ, సిటీబ్యూరో : చేతులు కాలాక ఆకులు పట్టుకున్న విధంగా తయారైంది జీహెచ్ఎంసీ పరిస్థితి. నిధులు పుష్కలంగా ఉన్నప్పుడు ఖర్చుపెట్టిన మాదిరిగానే ఆర్థిక సంక్షోభంలోనూ దుబారా ఖర్చులు చేసిన జీహెచ్ఎంసీలో ఇప్పుడు కనీసం న్యూస్ పేపర్ల బిల్లులు చెల్లించలేని దుస్థితి నెలకొంది. రోజురోజుకు పరిస్థితి తీవ్రమవుతుందే తప్ప, ఏ మాత్రం గాడీనపడటం లేదు. మున్ముందు పరిస్థితి ఇంకా తీవ్రమయ్యే పరిస్తితులుండటంతో విషయాన్ని గ్రహించిన అధికారులు సమస్య నుంచి గట్టెక్కేందుకు ఆదాయ మార్గాలను అన్వేషిస్తున్నట్లు తెలిసింది. ఇందులో భాగంగానే బుధవారం కమిషనర్ లోకేశ్ కుమార్ 30 సర్కిళ్ల డిప్యూటీ కమిషనర్లతో సమావేశమైనట్లు తెలిసింది. ఆదాయ సమీకరణ, వనరుల అన్వేషణలో భాగంగానే తొలి టార్గెట్‌గా అధికారులు ట్రేడ్ లైసెన్స్‌లను ఎంపిక చేసుకున్నట్లు సమాచారం.

2017 జూన్ 22న మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ది శాఖ జారీ చేసిన జీవో 459 ప్రకారం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నియమావళిని ట్రేడ్ లైసెన్స్‌ల జారీకి వర్తింపజేసేందుకు సిద్దమయ్యారు. దీని ప్రకారం ట్రేడ్ లైసెన్స్‌కు సంబంధించిన రెన్యువల్ ఫీజును ఆన్ లైన్‌లో, ఈ సేవా, మీ సేవా కేంద్రాల్లో, సిటిజన్ సర్వీస్ సెంటర్లలో, జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో గానీ చెల్లిస్తే ఆటోమెటిక్‌గా ట్రేడ్ లైసెన్స్ రెన్యువల్ చేసేలా చర్యలు చేపడుతున్నారు. వ్యాపారులు తమ లైసెన్సులను వచ్చే జనవరి 31 లోపు రెన్యువల్ చేసుకోవాలని సూచిస్తుంది. లేనిపక్షంలో లైసెన్స్‌లు లేని వ్యాపార సంస్థలను గుర్తించి వంద శాతం పెనాల్టీలు విధించేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఈ రకంగా వ్యాపార సంస్థలు చెల్లించిన పెనాల్టీలో ప్రతి నెల పది శాతాన్ని వసూలు చేయాలని కూడా భావిస్తున్నట్లు సమాచారం.

ఈ అక్రమాలకు అడ్డుకట్ట వేయరా?

ట్రేడ్ లైసెన్స్‌లకు సంబంధించి పలు సర్కిళ్లలో హాస్టల్స్‌కు నోటీసులిచ్చి, భయపెట్టి లంచాలు గుంజుతున్నట్లు ఆరోపణలున్నాయి. ఏరియా, యూసేజీ ప్రకారం బల్దియా ఖజానాకు రావాల్సిన నిధులను అధికారులు జేబులు నింపుకుంటున్నట్లు ఆరోపణలున్నాయి. క్యాటగిరీతో వ్యత్యాసం లేకుండా లైసనింగ్ ఆఫీసర్లు, అసిస్టెంట్ లైసనింగ్ ఆఫీసర్లు, మెడికల్ ఆఫీసర్లంతా కుమ్మక్కై తమ పరిధుల్లోని హాస్టళ్లు, ఇతర వ్యాపార సంస్థలకు నోటీసులు జారీ చేస్తారు. క్షేత్రస్థాయి తనిఖీలకు వచ్చి, టేపు పెట్టి ఏరియాను కొలవటంతో యజమాని ఇచ్చిన సమాచారం కన్నా, యూసేజీ ఏరియా, ప్లింత్ ఏరియాలతో పాటు అదనపు అంతస్తులు బయటపడతాయి. దీంతో మీ లైసెన్స్ రద్దు చేసి, మీకు లక్షల్లో జరిమానా విధిస్తున్నట్లు చెప్పి భయపెట్టి, బేరసారాలు కుదుర్చుకుంటున్నట్లు ఆరోపణలున్నాయి.

ఈ లక్షల్లో బేరాలు కుదుర్చుకుని, ఒకటి, రెండు అంతస్తులు రికార్డుల్లో చూపి, జీహెచ్ఎంసీకి లక్షల్లో రావల్సిన ట్రేడ్ లైసెన్సుల ఛార్జీలు వందలు, వేలకు కుదించి, వారు మాత్రం లక్షల్లో లంచాలు తీసుకుంటూ పబ్బం గడుపుతున్నారనే విమర్శలు ఉన్నాయి. ఇదే రకంగా అంబర్‌పేట, ఖైరతాబాద్, సికింద్రాబాద్ సర్కిళ్లల్లో కొద్ది రోజుల క్రితం కొన్ని హాస్టల్స్‌కు నోటీసులచ్చిన మెడికల్ ఆఫీసర్ ప్రస్తుతం ఎందుకు మౌనంగా ఉన్నారు. నోటీసుల జారీ అనంతరం చర్యలు చేపట్టకపొవటానికి కారణాలేమిటీ? అన్నది చర్చనీయాంశంగా మారింది. అంబర్‌పేట సర్కిల్‌లో గతంలో ఇదే తరహాలో లంచాలు తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ ఓ అధికారి ఈ దందాల్లో కీ రోల్ ప్లే చేస్తున్నట్లు కూడా చర్చ లేకపోలేదు. ఇక ఖైరతాబాద్ సర్కిల్‌లో మెడికల్ ఆఫీసరే లైసనింగ్ ఆఫీసర్‌గా వ్యవహరిస్తున్నా, కొత్త లైసెన్సుల కోసం వచ్చిన సుమారు నాలుగు నుంచి ఐదు వేల వరకు దరఖాస్తులను పక్కనపడేసినట్లు సమాచారం.

Advertisement

Next Story