GHMC: బల్దియాలో కదులుతున్న అధికారుల సీట్లు

by srinivas |
GHMC: బల్దియాలో కదులుతున్న అధికారుల సీట్లు
X

దిశ, సిటీ బ్యూరో: ఎట్టకేలకు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో బల్దియాలో లాంగ్ స్టాండింగ్ అధికారుల సీట్లు కదులుతున్నాయి. ఇతర ప్రభుత్వ శాఖల నుంచి జీహెచ్ఎంసీలోకి డిప్యూటేషన్‌పై వచ్చి, ఇక్కడే సీట్లకు అతుక్కుపోయిన అధికారులకు బదిలీలు మొదలయ్యాయి. ఒకే జిల్లాలో ఒకేచోట రెండేళ్ల పదవీకాలం పూర్తి చేసుకున్న అధికారులకు సర్కారు స్థానచలనం కలిగించడంలో భాగంగా ఇప్పటికే పదుల సంఖ్యలో ఆఫీసర్లను బదిలీ చేశారు. దీంతో పాటు ఇప్పటికే జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఎల్లో వివిధ హోదాల్లో విధులు నిర్వహిస్తున్న టౌన్ ప్లానింగ్‌కు చెందిన దాదాపు 20మంది ఆఫీసర్లకు ఇటీవలే కౌన్సిలింగ్ నిర్వహించి బదిలీలు చేసినట్లు సమాచారం. వీరితో పాటు దశాబ్దాలుగా జీహెచ్ఎంసీలో మెడికల్ ఆఫీసర్లుగా విధులు నిర్వహిస్తున్న రాష్ట్ర వైద్యారోగ్య శాఖకు చెందిన మెడికల్ ఆఫీసర్లలో సైతం కొందరికి స్థానచలనం కలిగించినట్లు తెలిసింది.

బదిలీ అయిన మెడికల్ ఆఫీసర్లు వచ్చే నెల 1వ తేదీన తమ మాతృ శాఖలో రిపోర్టు చేయనున్నట్లు సమాచారం. ఇతర ప్రభుత్వ శాఖల నుంచి జీహెచ్ఎంసీలోకి డిప్యూటేషన్ పై వచ్చి దశాబ్దాలుగా ఇక్కడే కొనసాగుతున్న వారు, రిటైరైన జీహెచ్ఎంసీని వదలకుండా కొనసాగుతున్న ఆఫీసర్లు, ఇతర సిబ్బంది మొత్తం దాదాపు వెయ్యి మంది వరకు ఉన్నట్లు కొద్ది నెలల క్రితం జరిగిన కౌన్సిల్ సమావేశంలో అధికారులు వెల్లడించారు. వీరిలో సుమారు 300మంది రిటైరయ్యాక సైతం జీహెచ్ఎంసీలో కొనసాగుతుండగా, తమనెపుడు ఇంటికి పంపిస్తారేమోనన్న భయం వారిని వెంటాడుతోంది.

ఇప్పటికే హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీల్లో విధులు నిర్వహిస్తున్న 20మందిని బదిలీ చేయగా, త్వరలో ఇంజనీరింగ్ విభాగంలో లాంగ్ స్టాండింగులకు స్థానచలనం కల్గించనున్నట్లు సమాచారం. జీహెచ్ఎంసీలో విధులు నిర్వహిస్తున్న ఫస్ట్ గ్రేడ్, స్పెషల్ గ్రేడ్ క్యాటగిరీలకు చెందిన, జీహెచ్ఎంసీలో అదనపు కమిషనర్, జాయింట్ కమిషనర్లుగా విధులు నిర్వహిస్తున్న వారికి స్థానచలనం కల్గించవచ్చునన్న ప్రచారం జరుగుతున్నా, వారిని జీహెచ్ఎంసీ నుంచి బదిలీ చేస్తే, బయట వారి హోదాకు తగిన పోస్టులు ఖాళీగా లేకపోవటంతో వారిని జీహెచ్ఎంసీలోనే కొనసాగించే అవకాశాలు ఉన్నాయని సమాచారం.

పోస్టింగుల కోసం పైరవీలు

జీహెచ్ఎంసీలో ఏళ్ల తరబడి నిబంధనలకు విరుద్ధంగా విధులు నిర్వహిస్తున్న పలువురు అధికారులు తమ స్థానాన్ని కాపాడుకునేందుకు, అలాగే ఇటీవలే హెచ్ఎండీఏ, జీహెచ్ఎం నుంచి బదిలీ అయి బయటకు వెళ్లిన ఆఫీసర్లలో చాలా మంది పైరవీల కోసం అధికార పార్టీ నేతలను ఆశ్రయిస్తున్నట్లు సమాచారం. వీరిలో గులాబీ అధికారులుగా, గత సర్కారు హయాంలో ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించారంటూ ముద్ర పడిన కొందరు అధికారులు వయా బెంగుళూరు నుంచి కర్ణాటక కాంగ్రెస్ నేతలతో పైరవీలు చేసుకుంటుండగా, మరి కొందరు అధికార పార్టీ నేతలు, ప్రజాప్రతినిధుల ద్వారా మంత్రుల వద్ద పైరవీలు కొనసాగిస్తున్నట్లు సమాచారం. ఇందులో గ్రేటర్ మేయర్ కార్యాలయానికి చెందిన సిబ్బంది ఉన్నట్లు ఆరోపణలొస్తున్నాయి. ఇటీవలే డైరెక్టర్ ఆఫ్ కంట్రీ అండ్ టౌన్ ప్లానింగ్ బదిలీ చేసిన 20 మంది ఆఫీసర్లలో సగానికి పైగా ఆఫీసర్లు మళ్లీ జీహెచ్ఎంసీలో గానీ, హెచ్ఎండీఏలో గానీ పోస్టింగ్ కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. మేయర్ కార్యాలయానికి చెందిన కొందరు సిబ్బంది ఒక్కో ఆఫీసర్ దగ్గరి నుంచి రూ.5లక్షలు బేరం మాట్లాడుకున్నట్లు విశ్వసనీయ సమాచారం.

త్వరలో అంతర్గత బదిలీలు

జీహెచ్ఎంసీలో ఏళ్ల తరబడి పదోన్నతుల కోసం ఎదురుచూస్తున్న 250 మంది సూపరింటెండెంట్లకు సైతం అంతర్గతంగా పదోన్నతులు కల్పించి, బదిలీలు చేయనున్నట్లు సమాచారం. రెండు నెలల క్రితం ఈ బదిలీలకు సంబంధించిన సమాచారాన్ని సర్కిల్ స్థాయి నుంచి తెప్పించిన అప్పటి కమిషనర్ రోనాల్డ్ రోస్ అనూహ్యంగా ఆయనే బదిలీ అయ్యారు. అప్పటి నుంచి బదిలీల జాబితా సిద్ధంగా ఉండటంతో త్వరలోనే జీహెచ్ఎంసీ కమిషనర్ ఆ జాబితాకు ఆమోదముద్ర వేయనున్నట్లు తెలిసింది.

Advertisement

Next Story

Most Viewed