4 గంట‌ల్లోనే నిందితుడిని ప‌ట్టించిన సెల్‌ఫోన్ సిగ్నల్స్

by Disha News Web Desk |
4 గంట‌ల్లోనే నిందితుడిని ప‌ట్టించిన సెల్‌ఫోన్ సిగ్నల్స్
X

దిశ‌, ఎల్బీన‌గ‌ర్: రాచ‌కొండ పోలీస్ క‌మిష‌నరేట్ ప‌రిధిలో జ‌రిగిన ఓ చోరీ కేసులో ఓ పాత‌నేర‌స్తుడిని మీర్‌పేట్ పోలీసులు నాలుగు గంట‌ల్లో అదుపులోకి తీసుకున్నారు. సీసీ కెమెరాలో గుర్తించిన వ్యక్తి పాత నేర‌స్తుడు కావ‌డంతో పోలీసుల వ‌ద్ద ఉన్న అత‌డి సెల్‌ఫోన్ సిగ్నల్ ఆధారంగా కేసును త్వరిత‌గ‌తిన చేధించారు. నిందితుడి నుండి 26 తులాల బంగారు, 25 గ్రాములు వెండి ఆభ‌ర‌ణాలు, ఒక లాప్‌టాప్‌, మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు త‌ర‌లించారు. గురువారం ఎల్బీన‌గ‌ర్ సీపీ క్యాంపు కార్యాల‌యంలో డీసీపీ స‌న్‌ప్రీత్‌సింగ్ మీడియాకు వివ‌రాలు వెల్లడించారు. నాగ‌ర్‌క‌ర్నూల్ జిల్లా రేవెళ్ల మండ‌లం గుడిప‌ల్లి గ్రామాల‌నికి చెందిన కొడిదెల సుధాక‌ర్ అలియాస్ శుభ‌క‌ర్(27) గ‌త కొంతకాలంగా మీర్‌పేట్‌లో అద్దెకుంటున్నాడు. గ‌తంలో ప‌లు నేరాల‌కు పాల్పడి జైలు పాల‌య్యాడు. దొంగ‌త‌నాల‌తో పాటు ఇత‌డు ఎల్బీన‌గ‌ర్ పీఎస్ ప‌రిధిలో జ‌రిగిన ఓ హ‌త్యకేసులోనూ నిందితుడు.

కాగా. ఈనెల 7వ తేదీన జైలు నుండి బెయిల్‌పై విడుద‌ల‌య్యాడు. నేరాల‌ను ప్రవృత్తిగా మార్చుకున్న నిందితుడు బుధ‌వారం మ‌ధ్యాహ్నం సుమారు రెండు గంట‌ల ప్రాంతంలో బండ‌గ్‌పేట్‌లోని ఓ ఇంట్లోకి చొర‌బ‌డి దొంగ‌త‌నానికి పాల్పడ్డాడు. దీంతో బాధితుడు క‌ట్టెకోల ర‌త్నాక‌ర్‌రావు త‌న అత్తమామ‌ల వ‌ర్ధంతి సంద‌ర్భంగా తాను ఇంటికి తాళం వేసి త‌న బావ ఇంటికి వెళ్లి వ‌చ్చేస‌రికి ఇంటి తాళాలు తెరిచి ఉన్నాయ‌ని ఫిర్యాదు చేశాడు. ఇంటిలోని బీరువాలోని నెక్లెస్, 2 హ్యండ్ రింగ్స్‌, ఒక ఉగ‌రం, ఇయ‌ర్ టాప్స్‌, 7 జ‌త‌ల బంగారం మొత్తం 26 తులాల బంగారు ఆభ‌ర‌ణాలు, 2.5 తులాల వెండి ఆభ‌ర‌ణాలు, రూ.10 వేల న‌గ‌దు చోరీకి గురైంద‌ని పేర్కొన్నాడు.

దీంతో కేసు న‌మోదు చేసిన మీర్‌పేట్ డిటెక్టివ్ ఇన్స్‌స్పెక్టర్ వెంట‌నే స్పందించి సీసీ కెమెరా ఫుటేజీలు, సెల్‌ఫోన్ సిగ్నల్ ఆధారంగా కేవ‌లం 4 గంట‌ల వ్యవ‌ధిలో బడంగ్‌పేట్‌లోనే నిందితుడిని అదుపులోకి తీసుకుని ఆభ‌ర‌ణాల‌ను స్వాధీనం చేసుకున్నారు. ఎంతో చాక‌చ‌క్యంగా వ్యవ‌హ‌రించి త‌క్కువ స‌మ‌యంలో గుర్తించిన మీర్‌పేట్ క్రైమ్ పోలీసుల‌ను డీసీపీ అభినందించారు. ఈ స‌మావేశంలో రాచ‌కొండ‌ క్రైమ్ డీసీపీ పి.యాదగిరి, వ‌న‌స్థలిపురం డివిజ‌న్‌ ఏసీపీ పురుషోత్తం రెడ్డి, మీర్‌పేట్ ఇన్‌స్పెక్టర్‌ మహేందర్ రెడ్డి, మీర్‌పేట్ డిటెక్టివ్ ఇన్‌స్పెక్టర్ సీహెచ్‌ శేఖర్, డీఎస్సై నర్సింగ్ రాథోడ్, ఎస్సై వి.మారయ్య, కానిస్టేబుళ్లు కరణ్, శేఖర్, ఎ.శివరాజ్, పి.ఎల్లయ్య, వై.విజయ్ కుమార్ రెడ్డి, వి.మహిపాల్, అనిల్‌రాజ్, నవీన్ కుమార్‌లు ఉన్నారు.

Advertisement

Next Story

Most Viewed