బంజారా సరస్సునూ మింగేస్తున్నారు

by Sridhar Babu |
బంజారా సరస్సునూ మింగేస్తున్నారు
X

దిశ, హైదరాబాద్ బ్యూరో/ ఖైరతాబాద్ : చెరువులు, కుంటలు కబ్జాలు చేసి చేపట్టిన అక్రమ నిర్మాణాలను హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ ఎస్టేట్స్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా) కూల్చివేతలు మొదలు పెట్టడంతో జీహెచ్ఎంసీ వ్యాప్తంగా ఎన్నో ఆక్రమణలు వెలుగు చూస్తున్నాయి. గతంలో మనకెందుకులే పెద్దవాళ్లతో గొడవ అని సర్ధిపెట్టుకున్న ప్రజలు ఇప్పుడు నిర్భయంగా బయటకు వచ్చి ఆక్రమణలపై ఫిర్యాదులు చేస్తున్నారు. అధికారులను నేరుగా కలిసి వివరాలు అందిస్తున్నారు. అంతేకాకుండా ఎక్స్, వాట్సాప్, ఫేస్ బుక్ తదితర సోషల్ మీడియాలను వేదికగా చేసుకుని తమ ప్రాంతాలలో చోటు చేసుకున్న కబ్జాల గురించి వివరాలు పోస్ట్ చేస్తుండడంతో అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి.

ప్రతినిత్యం మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర ప్రజా ప్రతినిధులు, వీఐపీలు, వీవీఐపీలు తిరిగే ప్రాంతానికి అతి సమీపంలో ఉన్న బంజారాహిల్స్ లోని అనంతగాని కుంట (గుండ చెరువు, బంజారా సరస్సు) రోజు రోజుకు కుదించుకుపోతోందని స్థానికుల నుండి అధికారులకు ఫిర్యాదులు అందుతున్నాయి. దీని చుట్టూ 2016 లో కొంతభాగం పూడ్చి వేసి రూ. 95 లక్షల వ్యయంతో సుందరీకరణ పేరుతో 2.4 మీటర్ల వెడల్పు తో సుమారు 900 మీటర్లలో వాకింగ్ ట్రాక్ ను ఏర్పాటు చేశారు. అయితే అనంతరం ఇది ప్రొహిబిటెడ్ అని అధికారులు బోర్డులు పెట్టడంతో వాకింగ్ ట్రాక్ , బ్యూటిఫికేషన్ ఎందుకు చేశారనేది ఎవరికీ అర్థం కాకుండా పోయింది. 1930 సంవత్సరంలో ఈ ప్రాంతంలో నివాసముంటున్న రాజకుటుంబాలు దీనిని నిర్మించాయి.

కిలోమీటర్ కంటే ఎక్కువ విస్థీర్ణంలో సుమారు 5 మీటర్ల లోతులో ఉన్న బంజారా లేక్ లో సింహభాగం ఆక్రమణలకు గురి కాగా నాటి ఆనవాళ్లు కోల్పోయింది. మిగిలిన సరస్సులో కూడా వ్యర్థాలు, పూడిక మేటలు వేయడంతో లోతు తగ్గిపోయింది. తాజాగా జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ పరిధిలో అన్యాక్రాంతమైన ప్రభుత్వ , ఇనాం, వక్ఫ్, దేవాదాయ, చెరువులు, కుంటల భూములను కాపాడేందుకు హైడ్రా చర్యలు తీసుకుంటుండగా జీఓ నెంబర్ 59 ముసుగులో మాయమైన కుంటలు, చెరువు స్థలాలతో పాటు ఆక్రమణలకు గురైన విలువైన స్థలాలను కాపాడాలని, వీరికి సహకరించిన అధికారులపై చర్యలు తీసుకోవాలనే డిమాండ్లు వినబడుతున్నాయి.

విలువైన స్థలం...

నగరం నడిబొడ్డున ఉన్న బంజారా సరస్సు స్థలం కోట్లాది రూపాయల విలువ జేస్తుంది. దీనిపై అక్రమార్కుల కన్ను పడడంతో కుచించుకుపోయిందని స్థానికులు అధికారులకు ఫిర్యాదు చేశారు. గతంలో జరిగిన ఆక్రమణల నిరోధక డ్రైవ్ లో కూడా సరస్సు స్థలం కబ్జాలకు గురైందని అధికారుల దృష్టికి వచ్చింది. సేవ్ అవర్ అర్బన్ లేక్స్ (సోల్) ప్రతినిధులు కూడా అప్పట్లో జీహెచ్ఎంసీ కి ఫిర్యాదు చేసి విలువైన స్థలాన్ని కాపాడాలని కోరారు.

2002 -2009 మధ్య కాలంలో సుమారు రూ. 4.3 కోట్లు వెచ్చించి జాతీయ సరస్సు పరిరక్షణ పథకం కింద ఇందులోకి ప్రవేశించే మురుగునీటిని మళ్లించడానికి 800 మిమీ ఆర్సీసీ రింగ్ డ్రెయిన్ వేశారు. అనంతరం అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో యథేచ్ఛగా ఆక్రమణలకు గురౌతోందని ప్రజల నుండి హైడ్రాకు, సీఎం రేవంత్ రెడ్డికి ఫిర్యాదులు అందుతున్నాయి. సమీపంలోని ఓ స్టార్ హోటల్ ఇందులో కొంత భాగాన్ని ఆక్రమించుకోవాలని చూస్తోందని స్థానికుల నుండి ఫిర్యాదులు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఆక్రమించుకున్న వారి కబంద హస్తాల నుండి బంజారా సరస్సును కాపాడి పూర్వ వైభవం తేవాలని స్థానికులు కోరుతున్నారు.

మురుగును వదులుతున్న తాజ్ బంజారా...

బంజారా సరస్సుకు సమీపంలో ఉన్న తాజ్ బంజారా హోటల్ నుండి మురుగును సంవత్సరాలుగా వదులుతుండడంతో కలుషితంగా మారింది. ఈ హోటల్ నుండి వ్యర్థాలను చెరువులోకి వదలడాన్ని గుర్తించిన పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఉమ్మడి రాష్ట్రంలోనే 2012 లో నోటీసులు జారీ చేసింది. అంతేకాకుండా స్థానికులు కూడా మురుగునీటిని ఇందులోకి వదులుతుండడంతో మురికికూపంగా మారింది.

అంతేకాకుండా జీహెచ్ఎంసీ, హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు లు కూడా వ్యర్థాలను దీని ఒడ్డున పడేస్తుండడంతో మూసీని తలపిస్తోంది. ఓ వైపు ఆక్రమణలు, మరోవైపు దుర్గంధం నిరాటంకంగా కొనసాగుతున్నా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం పట్ల స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు . ఈ విషయమై వివరణ కోరేందుకు ప్రయత్నించగా జీహెచ్ఎంసీ , హైడ్రా అధికారులు అందుబాటులోకి రాలేదు.

Advertisement

Next Story