నిమజ్జనానికి ఏర్పాట్లు చేయాలి

by Kalyani |
నిమజ్జనానికి ఏర్పాట్లు చేయాలి
X

దిశ, ముషీరాబాద్: ప్రజల విశ్వాసాల పైన నిషేధం విధించే హక్కు ఏ ప్రభుత్వానికి లేదని భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి స్పష్టం చేసింది. ట్యాంక్ బండ్ పైన గణపతి విగ్రహాల నిమజ్జనానికి తక్షణ ఏర్పాట్లు చేయాలని డిమాండ్ చేసింది. లేనట్లయితే తామే క్రేన్లు పెడతామని ఉత్సవ సమితి ప్రతినిధులు హెచ్చరించారు. అడ్డుకోవాలని చూస్తే గణపతి విగ్రహాలను మండపాల నుంచి తరలించేది లేదని తేల్చి చెప్పారు. గణపతి విగ్రహాల నిమజ్జనం చేయకుండా ట్యాంక్ బండ్ పై నిషేధాజ్ఞలు విధించడం సరికాదని భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.

ట్యాంక్ బండ్ వద్దకు ఆదివారం ఉదయం వచ్చిన సమితి అధ్యక్షుడు రాఘవ రెడ్డి, ప్రధాన కార్యదర్శి రాజు వర్ధన్ రెడ్డి, అలె భాస్కర్, శశిధర్, బుచ్చిరెడ్డి, వినయ్ కుమార్, గోవింద్ రాటి, శక్తీ సింగ్, వినయ్ కుమార్ లతో పాటు కార్యకర్తలు అధిక సంఖ్యలో వచ్చి పోలీసుల ఆంక్షలను నిరసిస్తూ ఆందోళనకు దిగారు. సాగర్ నీటిలో విగ్రహాలు వేయకుండా ఏర్పాటు చేసిన ఇనుప కంచెలను తొలగించారు. విగ్రహాల నిమజ్జనం లేదంటూ కట్టిన బ్యానర్లను తీసివేశారు. ట్యాంక్ బండ్ మీదుగా వెళుతున్న వాహనాలను ఆపి అందులో ఉన్న గణపతి విగ్రహాలను వినాయక్ సాగర్ లో నిమజ్జనం చేశారు. పోలీసులు ఉత్సవ సమితి నేతలను అడ్డుకోవడానికి ప్రయత్నించగా వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ సందర్భంగా రాఘవ రెడ్డి మాట్లాడుతూ… నిమజ్జనానికి సంబంధించి హైకోర్టు ఎటువంటి నిషేధం విధించలేదన్నారు.

ప్రజల ధార్మిక హక్కులపై ఆంక్షలు పెట్టి ఇబ్బందులు పెట్టాలని ప్రయత్నిస్తే ఊరుకునేది లేదన్నారు. ప్రతీ సంవత్సరం మాదిరిగానే ఈసారి గణపతి విగ్రహాలను సాగర్ లో నిమజ్జనం చేయాలన్నారు. ప్రభుత్వం ఏర్పాట్లు చేయకపోతే తామే క్రేన్లు పెట్టి గణనాథులను నిమజ్జనం చేస్తామని తేల్చి చెప్పారు. పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేస్తే మండపాల నుంచి విగ్రహాలను తరలించకుండా, భాగ్యనగరాన్ని ఎక్కడికక్కడ విగ్రహాలతో స్తంభింపజేస్తామని హెచ్చరించారు. మండపాలన్నీ మందిరాలవుతాయన్నారు. నిమజ్జనంపై ప్రభుత్వం మొండికేస్తే జరగబోయే పరిణామాలకు పాలకులే బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. కొత్త రూల్స్ తీసుకువచ్చి భక్తుల మనోభావాలను ప్రభుత్వం దెబ్బతీస్తుందని,

2022, 23లోను పోలీసులు ఆంక్షలు విధించారని, కానీ చివరకు ట్యాంక్ బండ్ పై నుంచి గణేష్ నిమజ్జనాలు జరిగాయని గుర్తు చేశారు. ప్రభుత్వం వెంటనే ఏర్పాట్లు చేయాలని, లేని పక్షంలో అన్ని వినాయక మండపాల నిర్వాహకులకు సమాచారం ఇచ్చి రేపు పెద్ద ఎత్తున ఆందోళనలు చేసి నగరాన్ని స్తంభింప చేస్తామని హెచ్చరించారు. ఇదిలా ఉండగాహుస్సేన్ సాగర్ లో మట్టితో చేసిన గణపతి విగ్రహాలను మాత్రమే నిమజ్జనం చేయాలన్న నిబంధనలు అమలు కావడం లేదు. ఎన్టీఆర్ మార్గ్ తో పాటు నెక్లెస్ రోడ్డు వైపు ఏర్పాటు చేసిన క్రేన్ల నుంచి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో చేసిన విగ్రహాలను నిమజ్జనం చేస్తున్నారు. అదే సమయంలో ఇందిరా పార్క్ ఎన్టీఆర్ స్టేడియంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన నీటి కొలనులపై ప్రచారం కల్పించడంలో జీహెచ్ఎంసీ సహా అన్ని ప్రభుత్వ విభాగాలు వైఫల్యం చెందాయి. దీంతో అటువైపు నిమజ్జనానికి గణపతి విగ్రహాలు వెళ్ళక పోవడం తో అవి ఖాళీగా ఉంటున్నాయి.

Advertisement

Next Story

Most Viewed