గ్రేటర్‌లో వేడెక్కిన రాజకీయ వాతావరణం

by Aamani |   ( Updated:2024-09-13 14:31:01.0  )
గ్రేటర్‌లో వేడెక్కిన రాజకీయ వాతావరణం
X

దిశ,హైదరాబాద్ బ్యూరో : ఎమ్మెల్యేలు కౌశిక్ రెడ్డి, అరికెపూడి గాంధీ మధ్య మొదలైన జెండా పంచాయతీ గ్రేటర్ హైదరాబాద్ లో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి . బీఆర్ఎస్ పార్టీ నుండి గెలిచి కాంగ్రెస్ పార్టీ కి దగ్గరైన శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ , బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మధ్య చోటు చేసుకున్న మాటల యుద్ధం తో మొదలైన వివాదం చిలికి చిలికి గాలివానగా మారుతోంది. గురువారం అరికెపూడి గాంధీ వర్గీయులు కొండాపూర్ లోని కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడి చేయగా తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకున్న విషయం తెలిసిందే. దీంతో ఈ వ్యవహారం మరింత ముదిరి శుక్రవారం ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి, బీఆర్ఎస్ వర్గీయులు ఎమ్మెల్యే గాంధీ నివాసాన్ని ముట్టడిస్తామని ప్రకటించింది. దీంతో పోలీసులు మూడు కమీషనరేట్లలో పోలీసులు అప్రమత్తమై భారీ బందోబస్తును ఏర్పాటు చేయడమే కాకుండా మాజీ మంత్రి హరీష్ రావు తో సహా బీఆర్ఎస్ నాయకులను ఎక్కడికక్కడ హౌస్ అరెస్ట్ చేశారు .

ఎమ్మెల్యే దానం పై తీవ్ర స్థాయిలో విమర్శలు...

ఖైరతాబాద్ శాసనసభ్యుడు దానం నాగేందర్ బిచ్చగాడు అంటూ కౌశిక్ రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. దానం నాగేందర్ గతంలో అనేక పార్టీలు మారారని కౌశిక్ రెడ్డి ఆరోపించారు. కారు గుర్తు నుండి గెలిచి పార్టీ ఫిరాయించిన పదిమంది ఎమ్మెల్యేల నియోజకవర్గల్లో ఓటర్లు ఉప ఎన్నికల కోసం ఎదురుచూస్తున్నారు అంటూ ఆయన వ్యాఖ్యానించారు. ఈ వ్యవహారం మొత్తంలో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి మాజీ మంత్రి హరీష్ రావు బాసటగా నిలిచారు .ఆయన పైన పోలీసులు కేసు నమోదు చేయడాన్ని నిరసిస్తూ హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ కార్యాలయం వద్ద బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళనకు దిగడమే కాకుండా ఛలో గాంధీ నివాసానికి బీఆర్ఎస్ పిలుపునిచ్చింది . మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ఆధ్వర్యంలో అరికెపూడి గాంధీ ఇంటికి వెళ్లి అక్కడే అల్పాహారం, లంచ్ చేసి , ఆయనకు బీఆర్ఎస్ కండువా కప్పి అక్కడి నుంచి నేరుగా తెలంగాణ భవన్‌కు తీసుకొచ్చి ప్రెస్ మీట్ పెడతామని, ఆ తర్వాత కేసీఆర్‌ను కల్పించేందుకు తీసుకెళ్తామని పార్టీ ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు, ఇతర నాయకులు అందరూ హాజరు కావాలని కోరడంతో ముందు జాగ్రత్త చర్యగా పోలీసులు ఎక్కడిక్కడా బీఆర్ఎస్ నేతలను ముందస్తుగా హౌస్ అరెస్టులు చేశారు.ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే దానం నాగేందర్ శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ నివాసానికి చేరుకుని సంఘీభావం ప్రకటించడం గమనార్హం..

ఆసక్తిగా గమనిస్తున్న బీజేపీ...

రాష్ట్రంలో పదేండ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్, ప్రస్తుతం పాలన సాగిస్తున్న కాంగ్రెస్ పార్టీ నాయకుల మధ్య చోటు చేసుకున్న వాగ్వాదం, దాడులు, ఆరోపణలు, ప్రత్యారోపణలను బీజేపీ ఆసక్తిగా గమనిస్తోంది. ఆ రెండు పార్టీల మద్య తగవు తమకు అనుకూలంగా మలుచుకునేందుకు చూస్తోంది. ఈ వ్యవహారంలో పార్టీ ఎలాంటి వ్యాఖ్యలు చేయనప్పటికీ ఇరుపార్టీల మధ్య వైరాన్ని ఆసరాగా చేసుకుని రెండు పార్టీల వ్యవహారాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు టాక్ వినబడుతోంది . ఇదిలా ఉండగా జీహెచ్ఎంసీ వ్యాప్తంగా ఎక్కడ చూసినా ఇదే విషయమై చర్చించుకోవడం కనబడుతోంది. రాజకీయాలకు సంబంధం లేని వారు కూడా ఈ విషయంలో ఆసక్తి కనబరుస్తుండడం గమనార్హం .

Advertisement

Next Story

Most Viewed