Collector : హైదరాబాద్ జిల్లాలో 8 గ్రూప్ -1 పరీక్ష కేంద్రాలు

by Kalyani |
Collector : హైదరాబాద్ జిల్లాలో 8 గ్రూప్ -1 పరీక్ష కేంద్రాలు
X

దిశ, హైదరాబాద్ బ్యూరో: జిల్లాలో 8 కేంద్రాల్లో గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు నిర్వహించనున్నట్లు హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. వీటిల్లో 5,613 మంది అభ్యర్థులు పరీక్షలు (కన్వెన్షనల్/డిస్క్రిప్టివ్ టైప్) రాయనున్నట్లు వివరించారు. ఈ నెల 21వ తేదీ నుంచి 27వ తేదీ వరకు మధ్యాహ్నం 2.00 నుంచి సాయంత్రం 5.00 గంటల వరకు జరుగుతాయని, హాల్ టికెట్లు 14వ తేదీ నుంచి అందుబాటులో ఉంచడం జరిగిందన్నారు. ఈ మేరకు బుధవారం ఆయన మాట్లాడుతూ.. పరీక్షలు రాసే అభ్యర్థులను కేంద్రాల్లోకి మధ్యాహ్నం 12:30 గంటల నుండి అనుమతించడం జరుగుతుందని, మధ్యాహ్నం 1:30 గంటలకు పరీక్షా కేంద్రం గేట్లు మూసివేయబడతాయన్నారు. ఆ సమయం తర్వాత అభ్యర్థులు ఎవరిని పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించరని చెప్పారు .

మొదటి రోజు పరీక్షకు ఉపయోగించిన అదే హాల్ టికెట్‌ను మిగిలిన ఆరు పరీక్షలకు ఉపయోగించాలని, అభ్యర్థులు నలుపు/నీలం బాల్ పాయింట్ పెన్నులు, పెన్సిల్, ఎరేజర్ వెంట ఉంచుకోవాలని, హాల్ టికెట్‌ను దానిపై అతికించిన ఫోటో, ప్రభుత్వం జారీ చేసిన ఏదైనా చెల్లుబాటు అయ్యే ఒరిజినల్ ఫోటో గుర్తింపు కార్డుని మాత్రమే పరీక్ష హాల్‌లోకి తీసుకెళ్లాలని సూచించారు. అన్ని సమాధానాలు బాల్ పాయింట్ పెన్ (నీలం,నలుపు)తో మాత్రమే రాయాలని, అభ్యర్థి ఫోటోగ్రాఫ్ , సంతకం ముద్రించిన చిత్రాలు స్పష్టంగా ఉన్నట్లయితే మాత్రమే ఈ హాల్ టికెట్ చెల్లుబాటు అవుతుందని, దీన్ని నిర్ధారించుకోవడానికి, లేజర్ ప్రింటర్‌తో ఏ4 సైజు కాగితంపై ముద్రించిన హాల్ టిక్కెట్‌ను తీసుకురావాలన్నారు. తాజా పాస్‌పోర్ట్ సైజు ఫోటోగ్రాఫ్‌ ను పరీక్షా కేంద్రానికి వచ్చే ముందు ప్రింటెడ్ హాల్ టికెట్‌లోని నిర్దేశిత స్థలంలో అతికించాలని లేకుంటే అభ్యర్థి దరఖాస్తు తిరస్కరణకు గురవుతుందని తెలిపారు.

డౌన్‌లోడ్ చేసిన హాల్ టిక్కెట్‌లో అస్పష్టమైన ఛాయాచిత్రం ఉంటే, అభ్యర్థి మూడు పాస్‌పోర్ట్ సైజు ఫోటోలను సక్రమంగా చివరిగా అధ్యయనం చేసిన సంస్థ యొక్క గెజిటెడ్ అధికారి, ప్రిన్సిపాల్ చేత ధృవీకరించబడిన ఒక అండర్‌టేకింగ్‌తో పాటు www.tspsc.gov వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్న ఫార్మాట్‌ను తీసుకువచ్చి పరీక్ష హాల్‌లోని ఇన్విజిలేటర్‌కు అప్పగించాలని, విఫలమైతే అభ్యర్థి పరీక్ష హాల్‌లోకి అనుమతించబడరని కలెక్టర్ వెల్లడించారు. అభ్యర్థి తమ గ్రూప్-1 సర్వీసెస్ ఆన్‌లైన్ అప్లికేషన్‌లో ఎంచుకున్న భాషలో అన్ని మెయిన్స్ పరీక్షలను (జనరల్ ఇంగ్లీష్ మినహా) రాయాలని, పరీక్షను ఎంచుకున్న భాషలో కాకుండా ఇతర భాషలో రాసినట్లయితే, అటువంటి సమాధానాల బుక్‌లెట్‌లు మూల్యాంకణం చేయబడవు అని ఆయన పేర్కొన్నారు.అభ్యర్థులు తమ హాల్ టికెట్‌పై ముద్రించిన సూచనలను తప్పకుండా చదవాలని సూచించారు.

Advertisement

Next Story

Most Viewed