HYD : ఫేక్ ఐపీఎస్ ఆఫీసర్‌ అరెస్ట్.. విచారణలో షాకింగ్ విషయాలు

by Sathputhe Rajesh |
HYD : ఫేక్ ఐపీఎస్ ఆఫీసర్‌ అరెస్ట్.. విచారణలో షాకింగ్ విషయాలు
X

దిశ, శేరిలింగంపల్లి : ఐపీఎస్ ఆఫీసర్‌ను, ఆర్మీ మేజర్‌ను అంటూ ప్రజలను మోసం చేస్తున్న నకిలీ ఐపీఎస్‌ను సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. విశ్వసనీయ సమాచారంతో మాదాపూర్ పోలీసులు, స్పెషల్ ఆపరేషన్ టీమ్ ఆధ్వర్యంలో రామ్ ఐపీఎస్ పేరుతో చలామణి అవుతున్న నాగరాజు కార్తీక్ రఘు వర్మ అలియాస్ కార్తీక్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను డీసీపీ శ్రీనివాస్ ఇతర పోలీసు అధికారులతో కలిసి వెల్లడించారు. వెస్ట్ గోదావరి జిల్లా వీర వాసరం మండలం చిక్కల గ్రామానికి చెందిన నాగరాజు కార్తీక్ రఘువర్మ డిగ్రీ వరకు చదువుకున్నాడు.

అనంతరం ప్రభుత్వ ఉద్యోగాల కోసం పరీక్షలు రాశాడు. అనంతరం ఉద్యోగ ప్రయత్నాల్లో భాగంగా నగరానికి వలసవచ్చిన కార్తీక్ ముందుగా ఓ ట్రావెల్ ఏజెన్సీలో పనిచేశాడు. అక్కడ నాలుగు వాహనాలను దొంగతనం చేయడంతో కేసు నమోదు అయింది. అనంతరం ఒక సాఫ్ట్ వేర్ కంపెనీలో హెచ్‌ఆర్ మేనేజర్ దగ్గర పనిచేస్తున్న క్రమంలో అతని వెహికిల్‌ను కూడా దొంగతనం చేయడంతో మరోసారి కేసు నమోదు అయింది. దీంతో ఎస్బీ విచారణలో ప్రభుత్వ ఉద్యోగం రాలేదు. ఆ తర్వాత ఒక సెక్యూరిటీ కంపెనీలో జాబు సంపాదించిన కార్తీక్ అక్కడే పనిచేస్తున్న మాజీ ఆర్మీ అధికారితో పరిచయం పెంచుకుని ఆర్మీ అధికారులు, వాళ్ల బ్యాడ్జీలు, హోదాలు ఇలా అన్ని విషయాలపై అవగాహన పెంచుకున్నాడు.

అలాగే పోలీసులకు సంబంధించిన విషయాలు, పదవులపై తెలుసుకుని నేరాలబాట పట్టాడు. రామ్ ఐపీఎస్ పేరుతో తెలంగాణ, ఏపీ, ఝార్ఖండ్ రాష్ట్రాల్లో మోసాలకు పాల్పడుతున్నాడు. ఉద్యోగాలు కేంద్ర ప్రభుత్వంలో పదవులు సెటిల్‌మెంట్ల పేర్లతో మోసాలు చేస్తున్నాడు. సైబరాబాద్‌ కమిషనరేట్ పరిధిలో ఏకంగా కార్యాలయమే తెరిచి.. బాధితులను కార్యాలయానికి పిలిపించి సెటిల్‌మెంట్స్ చేస్తున్నాడు. బాధితులకు ఇంటరాగేషన్ పేరుతో పోలీసుల స్టైల్ చుక్కలు చూపెడుతున్నాడు. ప్రత్యేక పోలీస్ అధికారి పేరుతో నకిలీ ఐపీఎస్ రామ్ వ్యవహారం నడుపుతున్నాడు.

హైదరాబాద్‌కు చెందిన ఓ మహిళను తక్కువ ధరకు వాహనాలు ఇప్పిస్తానని ఝార్ఖండ్ తీసుకువెళ్లి ఆమె వద్ద రూ.9 లక్షలు తీసుకుని మోసం చేశాడు. బాధిత మహిళ అక్కడి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో రామ్ ఐపీఎస్ వ్యవహారం మరోసారి తెరమీదకు వచ్చింది. గతంలోనే ఓ కేసు విషయంలో కేపీహెచ్‌బీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇతనిపై సైబరాబాద్ పరిధిలో పీడీ యాక్ట్ కూడా ఉంది. జైలు నుండి వచ్చిన తర్వాత తిరిగి పెద్ద మొత్తంలో నేరాలు చేయడం ప్రారంభించాడు. మేకా రవిశంకర్ అనే వ్యక్తి జాబ్స్ ఇప్పిస్తానని మోసం చేస్తున్నాడని తెలుసుకుని అతన్ని కిడ్నాప్ చేసి అతని హౌస్‌ను కార్తీక్ తన పేరున రాయించుకున్నాడు. అతన్ని ఫేక్ ఎన్ కౌంటర్ చేసినట్లు అందరినీ నమ్మించాడు.

టెక్నీకల్‌గా కూడా ఎక్స్‌పర్ట్ కావడంతో ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్, ఎంఎస్ ధోనీతో ఉన్నట్లు ఫోటోలు మార్ఫింగ్ చేసి అతని ఊరి వారిని, స్నేహితులను నమ్మించాడు. ఊర్లో కార్తీక్‌కు ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి పిల్లలకు రోల్ మోడల్‌గా చూపించే ప్రయత్నం చేశారు. నిందితుడు కార్తీక్ నార్త్ ఇండియన్ హిందీ యాక్సెంట్ కూడా బాగా మాట్లాడంతో అందరూ నిజమైన అధికారిగా భావించారు. ఇతనికి 14 జీ మెయిల్ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.

నిందితుడిపై ఆయా పోలీసు స్టేషన్‌లలో 10 నుండి 15 కేసులు ఉన్నాయి. పలు సందర్భాల్లో పోలీస్ విచారణ పేరుతో చాలామందిని చిత్రహింసలకు గురిచేశాడు. తుపాకులు, పోలీస్ వాహనాల, సైరన్లను వేసి భయపెట్టేవాడు. సమాచారం అందుకున్న సైబరాబాద్ పోలీసులు నకిలీ ఐపీఎస్ రామ్‌ని అరెస్ట్ చేసి విచారణ జరుపుతున్నారు. ఎవరెవరి నుంచి ఎంత మొత్తం డబ్బులు వసూలు చేసింది, తదితర అంశాలపై దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. నిందితుడి వద్ద నుండి పోలీసు బ్యాడ్జీలు, ఆర్మీ బ్యాడ్జీలు తదితర వస్తువులను స్వాధీనం చేసుకున్నారు.

Advertisement

Next Story

Most Viewed