అంతా రెడీ.. టీపీసీసీ చీఫ్ ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు పూర్తి

by karthikeya |   ( Updated:2024-09-15 03:45:31.0  )
అంతా రెడీ.. టీపీసీసీ చీఫ్ ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు పూర్తి
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర పీసీసీ చీఫ్‌గా మహేశ్‌కుమార్ గౌడ్ ఆదివారం మధ్యాహ్నం పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు. గాంధీ భవన్ వేదికగా జరిగే ఈ కార్యక్రమాన్ని పార్టీ అట్టహాసంగా నిర్వహిస్తున్నది. ఇప్పటివరకూ పీసీసీ చీఫ్‌గా ఉన్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో పాటు మంత్రులు, పార్టీ సీనియర్ నేతలు కూడా హాజరవుతున్నారు. ఏఐసీసీ నుంచి ప్రత్యేకంగా పలువురు జాతీయ నేతలు ఈ కార్యక్రమానికి అటెండ్ అవుతున్నట్లు రాష్ట్ర పార్టీ వర్గాలు తెలిపాయి. పీసీసీ చీఫ్‌గా బాధ్యతలు తీసుకోడానికి ముందు గన్‌పార్కులోని అమరవీరుల స్మారక స్తూపానికి నివాళులర్పించనున్నారు. అక్కడి నుంచి ర్యాలీగా పార్టీ శ్రేణులతో కలిసి గాంధీభవన్‌కు వెళ్ళనున్నారు. మధ్యాహ్నం రెండు గంటల తర్వాత గాంధీభవన్‌లో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం దాదాపు మూడు గంటల సమయంలో ప్రస్తుత పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి నుంచి మహేశ్‌కుమార్ గౌడ్ బాధ్యతలను స్వీకరించనున్నారు. ఆ తర్వాత ఇందిరా భవన్ ముందు ఉన్న ప్రాంగణంలో పార్టీ శ్రేణులను ఉద్దేశించి మహేశ్‌కుమార్ గౌడ్, సీఎం రేవంత్‌రెడ్డి, మరికొందరు ప్రసగించనున్నారు.

ఉమ్మడి రాష్ట్రం నుంచి ఇప్పటివరకు గౌడ సామాజికవర్గానికి చెందిన తొలి పీసీసీ చీఫ్‌గా మహేశ్‌కుమార్ గౌడ్ చరిత్ర సృష్టించనున్నారు. ఇంతకాలం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్న మహేశ్‌కుమార్ గౌడ్ ఇటీవలే ఎమ్మెల్సీగా కూడా ఎన్నికయ్యారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా రెడ్డి సామాజికవర్గానికి అవకాశమిచ్చిన ఏఐసీసీ అసెంబ్లీ స్పీకర్‌గా దళితుడికి చాన్స్ ఇచ్చింది. ఇప్పుడు పార్టీ పగ్గాలను బీసీ సామజికవర్గానికి చెందిన నేతకు అప్పజెప్పడంతో క్యాస్ట్ ఈక్వేషన్ పాటించిందనే టాక్ పార్టీ శ్రేణుల్లో వ్యక్తమైంది. పీసీసీ చీఫ్‌గా మహేశ్‌కుమార్ గౌడ్ పదవీ బాధ్యతల స్వీకార కార్యక్రమానికి పార్టీ శ్రేణులు విస్తృత ఏర్పాట్లు చేశాయి. గాంధీభవన్ ప్రాంగణంలో భారీ స్థాయిలో పార్టీ తోరణాలు, ఫ్లెక్సీ బ్యానర్లు కట్టగా అక్కడికి దారితీసే రోడ్లపై కూడా ప్రధాన కూడళ్ళ దగ్గర హోర్డింగులు, స్వాగతం పలికే బ్యానర్లను ఏర్పాటు చేశారు. రాష్ట్రం నలుమూలల నుంచి జిల్లాల లీడర్లు, కేడర్ ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో వర్కింగ్ ప్రెసిడెంట్‌గా పలువురు నేతలతో సమన్వయం చేసిన మహేశ్‌గౌడ్ ఇప్పుడు పీసీసీ చీఫ్‌గానూ సక్సెస్ సాధిస్తారనే ధీమా శ్రేణుల్లో వ్యక్తమవుతున్నది.

Advertisement

Next Story

Most Viewed