గోశాలలెన్నీ.. ఖర్చుకు లెక్కేది?

by Mahesh |
గోశాలలెన్నీ.. ఖర్చుకు లెక్కేది?
X

దిశ, తెలంగాణ బ్యూరో : ప్రజలకు జవాబుదారీగా ఉండి సేవలు అందించాల్సిన కొంతమంది అధికారులు నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తున్నారు. ప్రభుత్వ శాఖలకు సంబంధించిన సమాచారం తమ వద్ద లేదని ఖరాఖండిగా చెప్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా జిల్లాల్లో ఎన్ని గోశాలలు ఉన్నాయి? ఎక్కడెక్కడ ఉన్నాయి? వాటి నిర్వహణకు ఎంత ఖర్చు పెడుతున్నారు? వాటి వివరాలు, గోశాల సంఖ్యను తెలపాలని యూత్ ఫర్ యాంటీ కరప్షన్ సంస్థ సమాచార హక్కు చట్టం ద్వారా రాష్ట్ర పశు వైద్య, పశు సంవర్థక శాఖకు దరఖాస్తు చేసింది.

కానీ.. ఆ శాఖ అధికారులు అరకొర సమాధానమే ఇచ్చారు. మిగతా సమాచారం తమ వద్ద లేదంటూ.. ఆ శాఖ ప్రజా సమాచార అధికారి చెప్పారని యూత్ ఫర్ యాంటీ కరప్షన్ ఫౌండర్ రాజేంద్ర పల్నాటి తెలిపారు. రాష్ట్రంలో గోశాలల నిర్వహణ బాధ్యత ఎవరు చేపడుతున్నారు? వాటిపై అజమాయిషీ ఏమిటి? అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.

ఎంత ఖర్చు?

రాష్ట్రంలో ప్రస్తుతం మొత్తం 221 గోశాలలు ఉన్నాయని అధికారులు వెల్లడించారు. గోశాలలోని పశువుల సంఖ్య 30,973 అని సమాధానం ఇచ్చారు. అంతా బాగానే ఉంది. కానీ.. గోశాల నిర్వహణకు ప్రతి నెల ఎంత ఖర్చు చేస్తున్నారని అడిగిన ప్రశ్నకు మాత్రం వివరాలు తమ వద్ద లేవని సమాధానం ఇచ్చారు. కనీసం జిల్లాలోని గోశాలల సమాచారమైనా ఇవ్వమని అడిగినా అందుబాటులో లేదని ఆ శాఖ ప్రజా సమాచార అధికారి రామచందర్ తెలిపారు.

రాష్ట్రంలోని గోశాలల సంఖ్య ఉంటుంది. వాటిలో ఎన్ని పశువులు ఉన్నాయో లెక్కలు ఉన్నాయి. కానీ.. వాటి ఖర్చుల వివరాలు లేకపోవడం మాత్రం విచిత్రంగా ఉంది. నిధులను ఖర్చు చేయడంలో ఏదైనా గోల్ మాల్ జరిగే అవకాశం ఉంటుందని, అందుకే ఖర్చుల సమాచారం ఇవ్వడం లేదని యూత్ ఫర్ యాంటీ కరప్షన్ పౌండర్ రాజేంద్ర అంటున్నారు. దీనిపై పూర్తి సమాచారం కొరకు అప్పీలు చేస్తామని ఆయన పేర్కొన్నారు.

ఇదీ లెక్క

తెలంగాణలో గోశాల సంఖ్య : 221

మొత్తం గోవుల సంఖ్య : 30,973

నిర్వహణకు ప్రతి నెలా ఖర్చు : వివరాలు లేవు

జిల్లాల వారీగా ఎంత ఖర్చు : వివరాలు లేవు

Advertisement

Next Story

Most Viewed