Hot News:‘హైడ్రా’తో అక్రమార్కుల వెన్నులో వణుకు.. అన్ని పార్టీల నేతల్లో అలజడి షురూ

by Shiva |   ( Updated:2024-08-26 01:52:26.0  )
Hot News:‘హైడ్రా’తో అక్రమార్కుల వెన్నులో వణుకు.. అన్ని పార్టీల నేతల్లో అలజడి షురూ
X

దిశ, తెలంగాణ బ్యూరో: హైడ్రా పదం వింటేనే ఇప్పుడు కబ్జాదారుల గుండెల్లో గుబులు రేగుతోంది. ఏ రోజు నోటీసులు వస్తాయోనని కొందరు ఆందోళన పడుతూ ఉంటే... నోటీసులే లేకుండా ఎప్పుడు కూల్చేస్తారోనని మరికొందరు టెన్షన్ పడుతున్నారు. చెరువుల ఎఫ్‌టీఎల్‌ పరిధిలో, బఫర్‌జోన్‌లో నిర్మాణాలు చేపట్టిన అక్రమార్కులకు కంటి మీద కునుకు లేకుండాపోయింది. రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, సంపన్నుల్లో ఈ అలజడి మరింతగా నెలకొన్నది. రాజకీయాలతో సంబంధం లేకుండా అన్ని పార్టీల నేతలకూ ఫామ్‌హౌజ్‌లు, విల్లాలు, విలాసవంతమైన భవనాలు హైడ్రాకు టార్గెట్‌గా మారాయి. ఏయే చెరువులో భవనాలు వెలిశాయో హైడ్రా లెక్కలు తీస్తున్నది. ఏ రోజు ఎక్కడకు జేసీబీలు వెళ్తాయో అర్థం కాకుండా హైడ్రా కమిషనర్ పకడ్బందీ ప్రణాళికతో యాక్షన్ ప్లాన్ రూపొందిస్తున్నారు.

రావుల సవాల్.. ‘ఎన్ కన్వెన్షన్’ నేలమట్టం

ప్రత్యర్థి బీఆర్ఎస్‌ను టార్గెట్‌గా చేసి హైడ్రా వ్యవస్థతో రాష్ట్ర ప్రభుత్వం హైడ్రామా చేస్తున్నదంటూ ఆ పార్టీ నేతలు కేటీఆర్, హరీశ్‌రావు సహా పలువురు విమర్శలు చేశారు. ఆ పార్టీకి చెందిన రావుల శ్రీధర్‌రెడ్డి ఒక అడుగు ముందుకేసి సినీ నటుడు అక్కినేని నాగార్జున చెరువులోనే కట్టిన ఎన్ కన్వెన్షన్ సెంటర్‌ను కూల్చే దమ్ముందా? అంటూ హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు నాలుగు రోజుల క్రితం సవాలు విసిరారు. ఆయన సవాలుకు తగినట్లుగానే శనివారం ఎన్ కన్వెన్షన్ సెంటర్‌ను నేలమట్టం చేశారు. జన్వాడ ఫామ్ హౌజ్ సైతం హైడ్రా లిస్టులో ఉన్నదని తెలుసుకుని ప్రదీప్‌రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. అనురాగ్ యూనివర్సిటీ అధినేత ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి సైతం అదే బాట పట్టారు. ఇంకొందరు లీగల్ మార్గాలపై న్యాయవాదులతో సంప్రదింపుల్లో మునిగిపోయారు.

హైడ్రా కార్యాచరణ కంటిన్యూ చేయాలని రిక్వెస్టుజజ

పదేండ్లుగా యథేచ్ఛగా జరిగిన ఆక్రమణల తొలగింపుపై హైడ్రా కార్యాచరణను పర్యావరణవేత్తలు, మేధావులు, ప్రజలు స్వాగతిస్తున్నారు. కబ్జాల నుంచి చెరువులను కాపాడుతున్నందుకు మద్దతుగా ఎన్జీవోలు ర్యాలీలు తీస్తున్నాయి. దీన్ని కంటిన్యూ చేయాల్సిందిగా ప్రభుత్వాన్ని రిక్వెస్టు చేస్తున్నాయి. హైడ్రాను మరింత పటిష్టం చేసేందుకు వీలుగా అదనపు సిబ్బందిని, ఆఫీసును, యంత్రసామగ్రిని, వాహనాలను సమకూర్చాలంటూ కమిషనర్ రంగనాథ్.. ప్రభుత్వానికి ఇప్పటికే రిక్వెస్టు పంపారు. పూర్తిస్థాయి సిబ్బందిని నియమించకముందే హైడ్రా దూకుడు ఇలా ఉంటే రానున్న రోజుల్లో ఇంకెంత ఉధృతంగా కూల్చివేతలు జరుగుతాయోననే చర్చలు మొదలయ్యాయి.

బీఆర్ఎస్ విమర్శలకు సమాధానం..

ప్రతిపక్ష పార్టీలను టార్గెట్ చేసేందుకే హైడ్రాను తీసుకొచ్చారనే బీఆర్ఎస్ విమర్శలకు సమాధానంగా కాంగ్రెస్ పార్టీకి చెందిన పల్లం రాజు సోదరుడు పల్లం ఆనంద్, ఎమ్మెల్యే దానం నాగేందర్ ఆక్రమణపైనా హైడ్రా విరుచుకుపడింది. కాంగ్రెస్‌తో స్నేహ సంబంధాల్లో ఉన్న మజ్లిస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల భవనాలను సైతం హైడ్రా నేలమట్టం చేసింది. రాజకీయాలతో సంబంధం లేని అక్కినేని నాగార్జున, కావేరీ సీడ్స్ భాస్కరరావు, ప్రొ-కబడ్డీ యజమాని అనుపమ తదితరుల అక్రమ కట్టడాలను సైతం కూల్చివేసింది. ప్రగతి నగర్, ఎర్రకుంట, మాదాపూర్, గండిపేట్, మన్సూరాబాద్, ఫిలింనగర్, గాజులరామారం, జూబ్లీహిల్స్, నందగిరి హిల్స్, చింతల్ చెరువు, రాజేంద్రనగర్, చందానగర్, బాచుపల్లి... ఇలా అన్ని ఏరియాల్లోని చెరువులను హైడ్రా జల్లెడ పడుతున్నది.

కంప్లయింట్ రాగానే ఫుల్ డీటెయిల్స్ సేకరణ

ఫిర్యాదులు రావడంతోనే లోతుల్లోకి వెళ్లి వివరాలను సేకరించి అనుకూల ప్రతికూల పరిణామాలను హైడ్రా బేరీజు వేసుకుంటున్నది. వాటిని కూల్చివేయడానికి గుట్టుచప్పుడు కాకుండా కసరత్తు చేస్తున్నది. సమాచారం లీక్ కాకుండా వ్యవహరిస్తున్నప్పటికీ కొన్నిసార్లు జీహెచ్ఎంసీ, ఈవీడీఎం సిబ్బంది నుంచే అక్రమార్కులకు ఉప్పందుతున్నట్టు వార్తలు వెలువడుతున్నాయి. దీంతో హైకోర్టుకు వెళ్లి స్టే ఆర్డర్ తెచ్చుకోడానికి వెసులుబాటు లభిస్తున్నది. ఇంతకాలం అక్రమ నిర్మాణాలు చేపట్టినా రాజకీయ పలుకుబడి, సమాజంలో పేరు ప్రతిష్టలు, ఆర్థిక స్తోమతతో పెద్దవారిగా చలామణి అయినవారే ఇప్పుడు హైడ్రా చర్యలతో అక్రమార్కులుగా, కబ్జాదారులుగా ప్రజల్లో పలచబడుతున్నారు. పరువు ప్రతిష్టల కోసం న్యాయస్థానాలను ఆశ్రయిస్తున్నారు. హైడ్రా నోటీసులు, చర్యలకు సంజాయిషీ ఇచ్చుకుంటున్నారు.

Advertisement

Next Story

Most Viewed